Rohit Sharma Injured: ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2022లో టీమ్‌ఇండియాకు షాక్! సెమీ ఫైనల్‌కు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. అడిలైడ్‌లో మంగళవారం నెట్ ప్రాక్టీస్ చేస్తుండగా అతడి చేతికి బంతి తగిలింది. త్రో డౌన్ స్పెషలిస్ట్ విసిరిన బంతి ఆడే క్రమంలో హిట్‌మ్యాన్ గాయపడ్డాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి ఎలా ఉందో, సెమీస్‌కు అందుబాటులో ఉంటాడో లేదో బీసీసీఐ ఇంకా అధికారికంగా ఏమీ చెప్పలేదు. భారత్ గురువారం ఇంగ్లాండ్‌తో సెమీస్ ఆడే సంగతి తెలిసిందే.
అడిలైడ్‌లో టీమ్‌ఇండియా ఉదయమే ప్రాక్టీస్‌కు దిగింది. ఆటగాళ్లంతా హుషారుగా సాధన చేస్తున్నాడు. త్రో డౌన్ స్పెషలిస్టు నేతృత్వంలో రోహిత్ శర్మ బ్యాటింగ్ చేశాడు. అయితే ఓ బంతి అతడి కుడి చేతికి తగిలింది. నొప్పితో విలవిల్లాడిన హిట్‌మ్యాన్ అక్కడే కూలబడ్డాడు. దాంతో అందరి ముఖాల్లోనూ ఆందోళన కనిపించింది. ఫిజియో వచ్చి మ్యాజిక్ స్ప్రే చల్లాడు. అరగంట వరకు నెట్స్‌లోనే కూర్చున్న రోహిత్ తర్వాత సాధన చేయడంతో జట్టులో కలవరపాటు తగ్గింది. హోటల్‌కు వచ్చే ముందు తనకు అంతా బాగానే ఉన్నట్టు కెప్టెన్ థంప్స్ అప్ గుర్తు చూపించాడు.
టీమ్‌ఇండియా టీ20 వరల్డ్ కప్ గెలవాలంటే కెప్టెన్ రోహిత్ శర్మ ఎంతో కీలకం. ఇప్పటి వరకు అతడు 89 పరుగులే చేసినప్పటికీ తన ఫీల్డింగ్, కెప్టెన్సీ, వ్యూహాలతో ఆకట్టుకున్నాడు. తీవ్ర ఉత్కంఠ రేపిన మ్యాచుల్లో ఫీల్డర్లు, బౌలర్లను మారుస్తూ ప్రత్యర్థులను దెబ్బకొట్టాడు. పరుగుల పరంగా వెనకే ఉన్నా అతడు నిలబడితే ఎంత విధ్వంసకరంగా ఆడతాడో తెలిసిందే. ఇంగ్లాండ్ వంటి భీకరమైన జట్టుపై సెమీస్ గెలవాలంటే హిట్‌మ్యాన్ నాయకత్వం అత్యవసరం.