IPL 2023, MI vs RCB: ముంబై ఇండియన్స్  స్టార్ బ్యాటర్  సూర్యకుమార్ యాదవ్ మళ్లీ  తన పూర్వపు ఫామ్‌ను అందుకున్నాడు.  ఈ సీజన్‌కు ముందు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో మూడుసార్లు సున్నాలు చుట్టి  ఐపీఎల్-16లో కూడా మొదటి మూడు మ్యాచ్‌లలో దారుణంగా విఫలమైన నయా 360.. గడిచిన ఐదు మ్యాచ్‌లలో ధాటిగా ఆడుతూ ముంబై విజయాలలో కీలక పాత్ర  పోషిస్తున్నాడు.  నిన్న వాంఖెడే వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో  జరిగిన మ్యాచ్‌లో అయితే  ఆర్సీబీ బౌలర్లందరికీ పీడకలను మిగుల్చుతూ పేరుపేరునా అందరినీ ఉతికారేశాడు. 


మంగళవారం నాటి మ్యాచ్‌లో  సూర్య..  35 బంతుల్లోనే 7 బౌండరీలు,  ఆరు భారీ సిక్సర్ల సాయంతో  83 పరుగులు చేశాడు.  ఈ క్రమంలో సూర్య  పలు రికార్డులను బ్రేక్ చేశాడు.  ఈ మ్యాచ్  లో సూపర్ ఇన్నింగ్స్‌తో  సూర్య ఐపీఎల్‌లో  3 వేల పరుగుల  మైలురాయిని దాటడమే గాక  వంద సిక్సర్ల క్లబ్ లో చేరాడు.  తన  11 ఏండ్ల ఐపీఎల్ కెరీర్ లో  సూర్యకు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. 


 






3వేల పరుగుల క్లబ్‌లో..


నిన్నటి మ్యాచ్‌లో  సూర్య 63 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా  అతడు 3 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.   ఈ ఘనతను చేరడానికి సూర్యకు  134 మ్యాచ్ ‌లలో  119 ఇన్నింగ్స్ అవసరమయ్యాయి. హసరంగ వేసిన  14వ ఓవర్లో   మూడో బాల్‌కు సిక్సర్ కొట్టడం ద్వారా సూర్య ఐపీఎల్‌లో వంద సిక్సర్లు  పూర్తిచేసుకున్నాడు.


బ్యాక్ ఆన్ ట్రాక్.. 


2012 నుంచి ఐపీఎల్ ఆడుతున్న  సూర్య ఇప్పటివరకు  134 మ్యాచ్ లు ఆడి  119 ఇన్నింగ్స్ లలో  3,020 పరుగుల చేశాడు.  ఈ క్రమంలో సూర్య  20 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇక ఈ సీజన్ లో సూర్య.. గడిచిన ఆరు ఇన్నింగ్స్ స్కోరు చూస్తే మళ్లీ  పూర్వపు ఫామ్ అందుకున్నాడని స్పష్టమవుతున్నది.  పంజాబ్‌తో మ్యాచ్‌లో 26 బంతుల్లోనే  57 పరుగులు చేసిన సూర్య.. ఆ తర్వాత 23,  55,  66, 26,  83 పరుగులతో ముంబై విజయాలలో  కీలక పాత్ర పోషిస్తున్నాడు.  ఈ సీజన్ మొత్తంలో 11 మ్యాచ్ లు ఆడి  376  పరుగులు చేస్తే.. గత ఆరు మ్యాచ్ లలోనే 310 పరుగులు రాబట్టడం విశేషం.  ఇక సూర్యాభాయ్ ఇదే ఫామ్ ను కంటిన్యూ చేస్తే ముంబైకి ప్లేఆఫ్స్ లో అది ఎంతో ఉపకరించేదే.


 






ఇక సూర్య విజృంభణతో  ఆర్సీబీ నిర్దేశించిన  200  పరుగుల లక్ష్యాన్ని ముంబై..  16.3 ఓవర్లలోనే  ఛేదించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో  ఆర్సీబీ.. 6 వికెట్లు కోల్పోయి  199 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్ (68), డుప్లెసిస్ (65) లతో పాటు చివర్లో దినేశ్ కార్తీక్ (30) రాణించారు. భారీ  లక్ష్య ఛేదనలో ముంబై బ్యాటర్లు ఇషాన్ కిషన్ (42) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడగా   నెహల్ వధేరా  (52 నాటౌట్) లు వీరవిహారం చేశారు.