గడిచిన రెండు సీజన్లుగా ఐపీఎల్‌లో భాగమైన ముంబై ఇండియన్స్ యువ పేసర్ అర్జున్ టెండూల్కర్‌కు ఉప్పల్ స్టేడియం తన కెరీర్‌లో మరిచిపోని జ్ఞాపకాలను ఇచ్చింది. నిన్న హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో అర్జున్ ఐపీఎల్ లో ఫస్ట్ వికెట్ పడగొట్టాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు భువనేశ్వర్ కుమార్ ను ఔట్ చేయడం ద్వారా అర్జున్‌కు తొలి వికెట్ దక్కింది. దీంతో అతడిపై ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రముఖ బాలీవుడ్ నటి, పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింతా, మహ్మద్ కైఫ్, సెహ్వాగ్ వంటి మాజీ క్రికెటర్లు అతడిపై ప్రశంసలు కురిపించారు.
వాస్తవానికి అర్జున్ ఎంట్రీ ముందే జరగాల్సి ఉన్నా అది సాధ్యపడలేదు. 2021 నుంచే ముంబై ఇండియన్స్‌తో ఉంటున్నా అర్జున్ ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చింది ఈ సీజన్‌లోనే. ఈనెల 16న వాంఖెడే వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్ లో ఆడాడు. ఆ మ్యాచ్‌లో 2 ఓవర్లు వేసి 17 పరుగులిచ్చాడు. కానీ వికెట్ తీయలేదు. ఇక నిన్నటి మ్యాచ్ లో అర్జున్.. 2.5 ఓవర్లు వేసి 18 పరుగులే ఇచ్చి వికెట్ తీశాడు.
హైదరాబాద్ విజయానికి ఆఖరి ఓవర్లో 20 పరుగులు అవసరం ఉండగా రోహిత్.. అర్జున్ కు బంతినిచ్చాడు. చివరి ఓవర్ ను తెలివిగా బౌలింగ్ చేసిన అతడు.. ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లను నిలువరించడమే గాక ఐదో బంతికి భువీని ఔట్ చేసి సన్ రైజర్స్ ఇన్నింగ్స్ ను తెరదించాడు.
కాగా అర్జున్ ప్రదర్శనపై ముంబై సారథి ప్రశంసలు కురిపించాడు. గత మూడేండ్లలో అతడు తమ టీమ్ లో భాగమయ్యాడని, అర్జున్ ప్రణాళికలు చాలా స్పష్టంగా ఉంటాయని తెలిపాడు. పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ లో రోహిత్ స్పందిస్తూ.. ‘అర్జున్‌తో కలిసి ఆడటం చాలా ఎగ్జయింట్ గా అనిపించింది. అతడి ప్రణాళికలు చాలా స్ఫష్టంగా ఉంటాయి. కొత్త బంతిని స్వింగ్ చేయడమే గాక డెత్ ఓవర్లలో యార్కర్లను అద్భుతంగా సంధిస్తున్నాడు..’అని చెప్పాడు.
అర్జున్ వికెట్ తీసిన తర్వాత ప్రీతి జింతా ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘చాలామంది అతడిని బంధుప్రీతి (నెపోటిజం) అంటూ ఎగతాళి చేశారు. కానీ ఈ మ్యాచ్‌తో తానేంటో నిరూపించుకున్నాడు. సచిన్‌కు ఇది ప్రౌడ్ మూమెంట్..’అని ట్వీట్ చేసింది.
అర్జున్ వికెట్ తీసిన తర్వాత కెమెరాలన్నీ డగౌట్ లో ఉన్న సచిన్ వైపునకు మళ్లాయి. కొడుకు ఐపీఎల్ లో ఫస్ట్ వికెట్ తీసిన ఆనందంలో సచిన్ కళ్లు చెమర్చాయి. ఇందుకు సంబంధించి వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇక సన్ రైజర్స్ - ముంబై మ్యాచ్ విషయానికొస్తే.. ముంబై నిర్దేశించిన 193 పరుగుల లక్ష్య ఛేదనలో ఎస్ఆర్‌హెచ్.. నిర్ణీత 20 ఓవర్లలొ 178 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా ముంబై 14 పరుగుల తేడాతో గెలిచింది. సొంత గ్రౌండ్ ఉప్పల్ లో ముంబై ఇండియన్స్‌పై మార్క్‌రమ్ సేనకు ఓటమి తప్పలేదు.