IPL 2023: మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్‌కు గుడ్ న్యూస్. పేసర్లతో పాటు పవర్ ప్లేలో వికెట్లు తీయగలిగే స్పిన్నర్ లేక ఇబ్బందులు పడుతున్న సీఎస్కేకు త్వరలోనే ఆ బెంగ తీరననుంది. శ్రీలంక ఆటగాళ్లు సీఎస్కేతో కలవనున్నారు. చెన్నై జట్టులో ఉన్న లంక ఆటగాళ్లు మహీశ్ తీక్షణ, మతీష పతిరనలు రాజస్తాన్ రాయల్స్ తో జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నారు.
న్యూజిలాండ్‌తో వన్డే, టీ20 సిరీస్ ఆడిన జట్టులో ఉన్న లంక స్పిన్నర్ తీక్షణ, పేసర్ పతిరనలు రావడం చెన్నైకి అదనపు బలాన్నిచ్చేదే. పవర్ ప్లేలో వికెట్లు తీయడంలో తీక్షణ దిట్ట.గత సీజన్ లో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన తీక్షణ.. 12 వికెట్లు తీశాడు. ఇందులో ఓసారి నాలుగు వికెట్ల ప్రదర్శన కూడా ఉంది. ఇటీవల కివీస్ తో ముగిసిన తొలి టీ20లో మ్యాచ్ టై కాగా సూపర్ ఓవర్ వేసిన తీక్షణ 8 పరుగులే ఇచ్చి తన జట్టును గెలిపించిన విషయం తెలిసిందే.
ఇక లంక దిగ్గజం లసిత్ మలింగ జూనియర్ గా గుర్తింపు పొందిన పతిరన కూడా నమ్మదగ్గ బౌలరే. సీఎస్కేకు ఈ ఐపీఎల్ లో నిఖార్సైన పేసర్ లేక తంటాలు పడుతోంది. తుషార్ దేశ్‌పాండే ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. రాజ్యవర్ధన్ కూడా విఫలమవుతుండగా ముంబై తో మ్యాచ్ లో దీపక్ చాహర్ కు గాయమైన నేపథ్యంలో ఆ జట్టుకు పతిరన రాక మేలుచేసేదే. వీళ్లిద్దరూ ఈనెల 12న చెన్నైలో రాజస్తాన్ తో జరుగబోయే మ్యాచ్‌కు అందుబాటులో ఉంటారని సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ తెలిపాడు.
ఆ ఫ్రాంచైజీలకూ గుడ్ న్యూసే..
తీక్షణ, పతిరనలతో పాటు మరో ఇద్దరు లంక ప్లేయర్లు కూడా తమ ఫ్రాంచైజీలతో కలువనున్నారు. ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగ.. ఆర్సీబీతో కలవనున్నాడు. హసరంగ లేని లోటు ఆర్సీబీ స్పిన్ విభాగంలో కొట్టొచ్చినట్టు కనిపించింది. వెటరన్ స్పిన్నర్ కర్ణ్ శర్మను ఆడిస్తున్నా అతడు నమ్మదగ్గ బౌలర్ అయితే కాదు. దీంతో ఆర్సీబీ ఎక్కువగా మ్యాక్స్‌వెల్, బ్రాస్‌వెల్ ల మీదే ఆధారపడుతున్నది. హసరంగ రాకతో కర్ణ్ శర్మ బెంచ్ కే పరిమితం కానున్నాడు.
ఇక లంకకు పరిమిత ఓవర్లలో సారథిగా వ్యవహరిస్తున్న దసున్ శనక కూడా ఈ ఏడాది ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయి. ఈ ఆల్ రౌండర్ ను గుజరాత్ టైటాన్స్ ఇటీవలే రూ. 50 లక్షలకు సొంతం చేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ తో తొలి మ్యాచ్ లో గాయపడ్డ కేన్ విలియమ్సన్ స్థానంలో శనకను రిప్లేస్ చేసుకున్నది. శనక కూడా జీటీతో కలిస్తే అతడు ఈనెల 13న గుజరాత్-ముంబైల మధ్య జరుగబోయే మ్యాచ్‌లో ప్లేస్ దక్కించుకోవచ్చు. లంక ఆటగాళ్లలో ఇదివరకే భానుక రాజపక్స పంజాబ్ కింగ్స్ కు ఆడుతున్న విషయం తెలిసిందే. మొహాలీ వేదికగా కేకేఆర్ తో ముగిసిన మ్యాచ్ లో రాజపక్స ధనాధన్ ఇన్నింగ్స్ తో అలరించాడు. నేడు హైదరాబాద్ తో జరిగే మ్యాచ్ లో కూడా సత్తా చాటాలని భావిస్తున్నాడు.