LSG vs SRH IPL 2023: ఐపీఎల్-16లో భాగంగా శనివారం ఉప్పల్ వేదికగా   సన్ రైజర్స్ హైదరాబాద్  - లక్నో సూపర్ జెయింట్స్ మధ్య  ముగిసిన మ్యాచ్‌లో ఆన్ ఫీల్డ్ అంపైర్ తో వాగ్వాదానికి దిగినందుకు గాను  ఎస్ఆర్‌హెచ్ వికెట్ కీపర్  హెన్రిచ్ క్లాసెన్‌కు  బీసీసీఐ షాకిచ్చింది.  నో బాల్ వివాదంలో థర్డ్ అంపైర్ తన డిసీషన్‌ను వెల్లడించినా దానికి అసహనం వ్యక్తం చేస్తూ ఆన్ ఫీల్డ్ అంపైర్ తో  క్లాసెన్ వాగ్వాదానికి దిగాడు. 


ఏం జరిగింది..? 


హైదరాబాద్ - లక్నో మ్యాచ్‌లో భాగంగా ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్ చేస్తుండగా 19వ ఓవర్‌ను అవేశ్ ఖాన్ వేశాడు. ఆ ఓవర్లో మూడో బాల్ హై ఫుల్ టాస్ గా వేయడంతో  ఫీల్డ్ అంపైర్ దానిని  నో బాల్ గా ప్రకటించాడు.  కానీ ఈ నిర్ణయాన్ని లక్నో  రివ్యూ కోరింది. థర్డ్ అంపైర్  రివ్యూలో  బంతి   బ్యాటర్ నడుము  కంటే ఎత్తుగా వెళ్తున్నా   దానిని  కరెక్ట్ బాల్ అనే డిక్లేర్ చేస్తూ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. దీనిపై  సమద్  నిరాశను వ్యక్తం చేయగా   నాన్ స్ట్రైకర్ ఎండ్  లో ఉన్న క్లాసెన్ మాత్రం   అంపైర్ దగ్గరకు వెళ్లి అతడితో వాగ్వాదానికి దిగాడు.  టీవీ రిప్లైలో  బాల్ నడుము కంటే ఎత్తుగా  వెళ్తున్న విషయం అంత స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ దానిని కరెక్ట్ బాల్ అని ప్రకటించడమేంటని  ఆగ్రహం వ్యక్తం చేశాడు.   


 






ఇంతటితో ఆగక క్లాసెన్.. ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత   ‘ఇట్ వాస్ నాట్ ఎ గ్రేట్ అంపైరింగ్’ అని  కామెంట్స్ చేయడం  గమనార్హం.  ఇదే క్లాసెన్  కొంప ముంచింది.   మ్యాచ్ ముగిసిన తర్వాత  బీసీసీఐ.. అతడు ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్  లోని  ఆర్టికల్ 2.7 లెవల్ 1 అఫెన్స్  చేసినట్టు తేల్చింది. దీనికి గాను మ్యాచ్ ఫీజులో  10 శాతం జరిమానా విధించింది.  ఇదే సీజన్ లో  రవిచంద్రన్ అశ్విన్ కూడా  చెన్నై - రాజస్తాన్ మ్యాచ్ లో  అంపైర్ నిర్ణయాన్ని (బంతిని మార్చినందుకు) తప్పుబట్టినందుకు గాను  మ్యాచ్ ఫీజులో  10 శాతం కోత ఎదుర్కున్న విషయం తెలిసిందే.


 






అమిత్ మిశ్రాకూ తప్పలేదు.. 


ఈ మ్యాచ్ లో క్లాసెన్ తో పాటు  లక్నో స్పిన్నర్ అమిత్ మిశ్రా కు కూడా జరిమానా తప్పలేదు. మిశ్రా.. హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో  భాగంగా 9వ ఓవర్ బౌలింగ్ చేశాడు. ఈ ఓవర్లో   అన్‌మోల్ ప్రీత్ సింగ్‌..  ఓ సిక్సర్ కొట్టాడు. కానీ ఇదే  ఓవర్లో  ఆఖరి బంతికి అన్‌మోల్.. అమిత్ మిశ్రాకే క్యాచ్ ఇచ్చాడు. బంతిని అందుకున్న తర్వాత మిశ్రా.. ఫ్రస్ట్రేషన్ తో దానిని బలంగా   కిందికి బాదుతూ అతిగా ప్రవర్తించాడు.  ఇది  కూడా    ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్  ఆర్టికల్  2.2 ను ఉల్లంఘించడమే. దీంతో  మిశ్రాకు  మ్యాచ్ ఫీజులో  పది శాతం కోత విధిస్తున్నట్టు  ఐపీఎల్ ఒక ప్రకటనలో వెల్లడించింది.