MS Dhoni: ‘ఇదే లాస్ట్ సీజన్. ఇక  రిటైరైపోతాడు’, ‘సొంత అభిమానుల మధ్య  కెరీర్ ముగిస్తాడు’, ‘వయసైపోతంది. మునపటిలా షాట్లు ఆడటం  కష్టమే.  ఈ సీజన్‌తో గుడ్ బై చెప్తాడు’.. గత కొంతకాలంగా   చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ గురించి వినిపిస్తున్న  వాదనలివి.  ఇప్పుడే కాదు 2021 నుంచీ  ఇవే  గుసగుసలు.   కానీ ధోని వీటికి ఎప్పటికప్పుడూ తన ఆట, ఫిట్నెస్‌తోనే సమాధానం చెబుతున్నాడు. తాజాగా  ధోని తన కెరీర్, రిటైర్మెంట్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.  


శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్ - సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్ లో  ధోని.. ప్రముఖ  క్రికెట్ కామెంటేటర్  హర్షా భోగ్లేతో మాట్లాడుతూ.. ‘నా కెరీర్ గురించి చాలామంది చాలారకాలుగా మాట్లాడుతున్నారు.  నేను ఎంతకాలం ఆడినా సరే. ఇప్పుడైతే కెరీర్ చివరి దశలో ఉన్నా. వయసు  పెరుగుతుంటే  అనుభవం  వచ్చినట్టే..’ అని  చెప్పాడు. ఈ సమయంలో హర్షా కల్పించుకుని   ‘యూ ఆర్ నాట్ ఓల్డ్’అని  అనగానే ధోని నవ్వుతూ.. ‘కచ్చితంగా  వయసు పెరిగింది. నా వయసు గురించి చెప్పడానిని నేనేమీ సిగ్గుపడను..’అని నవ్వుతూ సమాధానమిచ్చాడు.  


సచిన్ టెండూల్కర్  17 ఏండ్ల వయసు నుంచే క్రికెట్ ఆడుతూ రెండున్నర దశాబ్దాల పాటు  క్రికెట్‌కు సేవలందించాడని ధోని ఈ సందర్భంగా  చెప్పుకొచ్చాడు.  కాగా ధోని నిన్నటి మ్యాచ్ గురించి స్పందిస్తూ.. జట్టులోకి కొత్తగా చేరిన పతిరన, ఆకాశ్ సింగ్, తుషార్ దేశ్‌పాండే వంటి బౌలర్లు  క్రమంగా మెరుగవుతున్నారని కొనియాడాడు. ముఖ్యంగా పతిరన ఆర్సీబీతో మ్యాచ్ లోనే గాక  సన్ రైజర్స్ పైనా రాణించాడని తెలిపాడు.  స్పిన్నర్లు కూడా బాగా బౌలింగ్ చేశారని ప్రశంసలు కురిపించాడు. 


 






నాకు బెస్ట్ క్యాచ్ ఇవ్వలేదు : ధోని  


ఈ మ్యాచ్ లో హ్యారీ బ్రూక్ ఇచ్చిన  క్యాచ్ ను  షార్ట్ థర్డ్ కవర్ వద్ద  రుతురాజ్ సూపర్ క్యాచ్ అందుకున్నాడు. ఈ సందర్భంగా అతడికి బెస్ట్ క్యాచ్ అవార్డు దక్కింది. దీని గురించి కూడా ధోని  స్పందించాడు.  తనకు అత్యుత్తమ క్యాచ్ ఇవ్వలేదని  నవ్వుతూ చెప్పాడు. ‘మేం  గ్లోవ్స్ వేసుకుంటాం  కాబట్టి ఇప్పటికీ అభిమానులు మాకు క్యాచ్ లు పట్టడం సులువని అనుకుంటారు. కానీ నేనైతే ప్రతీ క్యాచ్‌ను అద్భుతమైన క్యాచ్ అనే అనుకుంటా. మన ఎబిలిటీతోనే కాకుండా  సరైన ప్రాంతంలో లేకుండానే క్యాచ్‌లను అందుకోవడం జరుగుతుంటుంది..’అని చెప్పాడు. ఈ మ్యాచ్ లో ధోని.. తీక్షణ బౌలింగ్ లో మార్క్‌రమ్ ఇచ్చిన క్యాచ్ పట్టడమే గాక  మయాంక్ అగర్వాల్  ను స్టంపౌట్ చేశాడు. 


 






ఇక నిన్నటి మ్యాచ్ విషయానికొస్తే.. చెపాక్  స్టేడియంలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో  7 వికెట్లు కోల్పోయి  134 పరుగులు మాత్రమే చేసింది. జడేజా మూడు వికెట్లు తీశాడు.  స్వల్ప లక్ష్యాన్ని చెన్నై.. 18.4 ఓవర్లలోనే ఛేదించింది. డెవాన్ కాన్వే (77 నాటౌట్) రాణించాడు.