Josh Hazlewood: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నెగ్గడానికి అన్ని అర్హతలు ఉన్నా ఇంతవరకు టైటిల్ నెగ్గని టీమ్ ఏదైనా ఉందా..? అంటే అది కచ్చితంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరే. ఒక్కటా..? రెండా..? పదిహేనేండ్లుగా ఒకే కల (ఈసాలా కప్ నమ్దే)ను మళ్లీ మళ్లీ కంటున్న ఆ జట్టు అభిమానులకు ఈ ఏడాది గుండెకోత తప్పేట్లు లేదు. అసలే కీలక టోర్నీలో అదృష్టం బాగోలేక తంటాటు పడుతున్న ఆ జట్టుకు ఈ సీజన్ లో వరుస షాకులు తాకుతున్నాయి. ఆర్సీబీ కీలక పేసర్ జోష్ హెజిల్వుడ్ ఈ సీజన్ లో సగం మ్యాచ్ లకు అందుబాటులో ఉండటం లేదు.
చావు కబురు చల్లగా చెప్పినట్టు..
ఆర్సీబీకి ఉన్న ప్రధాన పేసర్ హెజిల్వుడ్. ఈ ప్రపంచ నెంబర్ వన్ బౌలర్.. ఈ ఏడాది స్వదేశం (ఆస్ట్రేలియా) లో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో గాయపడ్డాడు. మూడో టెస్టులో ఆడలేదు. గాయం పూర్తిగా కోలుకోకున్నా బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో ఆడతానని టీమ్ తో కలిసి ఎగేసుకుని భారత్ కు వచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చాక అతడు ఇంకా ఫిట్ గా లేడని, మరికొన్నాళ్లు విశ్రాంతి కావాలని క్రికెట్ ఆస్ట్రేలియా మళ్లీ అతడిని ఢిల్లీ టెస్టు ముగిశాక సిడ్నీ ఫ్లైట్ ఎక్కించింది. సరే టెస్టు సిరీస్ కు మిస్ అయినా వన్డే సిరీస్ వరకైనా వస్తాడనుకుంటే దానికీ రాలేదు. వన్డే సిరీస్ పోయినా ఐపీఎల్ వరకైనా కుదురుకుంటాడనుకుంటే ఇప్పుడు చావు కబురు చల్లగా చెప్పినట్టు ‘ఫస్టాఫ్ కు మిస్ అవుతున్నా..’అని సెలవిచ్చాడు.
ఫస్టాఫ్ బ్రేక్.. సెకండాఫ్‌కే ఆశలు..
గాయం నుంచి తాను ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదని.. ఏప్రిల్ 14 వరకూ పూర్తి ఫిట్నెస్ సాధిస్తానని హెజిల్వుడ్ చెప్పుకొచ్చాడు. అప్పటికీ కూడా అందుబాటులో ఉంటాడా..? అంటే అదీ అనుమానమే. అవసరమైతే మరో వారం రోజులు రెస్ట్ తీసుకుని పూర్తి సన్నద్ధత సాధించాక బరిలోకి దిగుతానని చెప్పాడు. వన్డేలు, టెస్టులతో పోల్చుకుంటే టీ20లలో ఆడేది తక్కువ టైమే అయినా వేసే 4 ఓవర్లూ పూర్తి పేస్ తో వేయాల్సి ఉంటుందని.. దానికోసం చాలా శారీరకంగా చాలా శ్రమించాల్సి ఉంటుందని తెలిపాడు. ఈ లెక్కన చూసుకుంటే ఏప్రిల్ నాలుగో వారం దాక జోష్ ఆడేది అనుమానమే.
ఈ సీజన్ లో ఆర్సీబీ తమ తొలి మ్యాచ్ ను ఏప్రిల్ 2న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో ఆడనుంది. ఏప్రిల్ 20 తర్వాతే హెజిల్వుడ్ అందుబాటులోకి వస్తే గనక ఆర్సీబీ అప్పటికే ఆరు మ్యాచ్ లు ఆడుతుంది.
2021 వరకూ చెన్నైకి ఆడిన హెజిల్వుడ్ ను 2022 వేలంలో ఆర్సీబీ రూ. 7.75 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్ లో అతడు.. 12 మ్యాచ్ లలో 20 వికెట్లతో చెలరేగాడు. ఈ సీజన్ లో అతడు లేకపోవడం ఆర్సీబీకి భారీ ఎదురుదెబ్బే.. మరి హెజిల్వుడ్ లేని ‘జోష్’ను సిరాజ్ ఎలా నింపుతాడో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.