IPL 2023 Impact Player Rule: గడిచిన రెండు సీజన్లుగా ఐపీఎల్ అనుకున్నంత విజయవంతం కాకపోవడంతో ఈ ఏడాది నుంచి ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో బీసీసీఐ కొన్ని కొత్త నిబంధనలను తీసుకొచ్చి  దీనిని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు  యత్నిస్తున్న విషయం తెలిసిందే.  వైడ్, నోబాల్స్ విషయంలో అంపైర్ నిర్ణయాలను సవాల్ చేయడంతో పాటు   ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధన ఇందులో ముఖ్యమైంది. 2023 సీజన్ నుంచి  ప్రవేశపెట్టిన  ‘ఇంపాక్ట్ ప్లేయర్’పై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ  బీసీసీఐ  దీనిపై  ఫ్రాంచైజీలను  ఫీడ్ బ్యాక్ కోరినట్టు తెలుస్తున్నది. 


ఎలా ఉంది..?  


టూకీగా చెప్పాలంటే ఈ నిబంధన ప్రకారం.. తుది జట్టులో ఉండే 11 ఆటగాళ్లతో కాకుండా  మ్యాచ్‌కు ముందే ప్రకటించిన సబ్‌స్టిట్యూట్ ఆటగాళ్లలో ఒక్కరిని   మ్యాచ్‌లో ఎప్పుడైనా ఫీల్డ్ లోకి  పిలిచి ఆడించొచ్చు.  కానీ  ఇంపాక్ట్ ప్లేయర్  స్థానంలో వచ్చిన ఆటగాడు మళ్లీ గ్రౌండ్ లోకి రావడానికి వీళ్లేదు.  అయితే ఈ నిబంధనను  ఎలా ఉపయోగించుకోవాలో తెలియకనో లేక   ఎవర్ని ఆడించాలనే అవగాహన లేకపోవడం వల్లో  టీమ్స్  ఇప్పటివరకు ఐపీఎల్-16లో  ఈ  అవకాశాన్ని సక్రమంగా వాడుకోలేదనే  వాదనలు వినిపిస్తున్నాయి.  ఈ నేపథ్యంలో   బీసీసీఐ.. ఫ్రాంచైజీల వద్ద  ఫీడ్ బ్యాక్ కోరింది. 


ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు ఇన్‌సైడ్‌స్పోర్ట్స్‌తో  స్పందిస్తూ... ‘ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై ఇదివరకు మేం మంచి రెస్సాన్సే అందుకుంటున్నాం.  ఇది టీమ్స్‌కు ఫ్లెక్సిబిలిటీని ఇస్తున్నది.   ప్రత్యర్థి టీమ్‌కు చివరి నిమిషం వరకూ  ఎవరు  ఫీల్డ్ లోకి వస్తారో తెలియదు.   వారి గేమ్ ప్లాన్  లో కూడా మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.  అయితే ఇప్పటివరకు పది మ్యాచ్‌లు కూడా కాలేదు. మేం కూడా  వెయిట్ చేస్తున్నాం. దీనిమీద బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ.. మేం కూడా టీమ్స్‌ను  ఫీడ్ బ్యాక్ అడిగాం. వాళ్ల నుంచి వచ్చే స్పందనను బట్టి  దీనిలో ఇంకేమైనా  మార్పులు చేర్పులు చేయాలా..? అన్నది  నిర్ణయం తీసుకుంటాం..’అని  చెప్పాడు. 


 






వారం రోజులుగా  జరుగుతున్న ఐపీఎల్‌లో ఇద్దరు ముగ్గురు ఆటగాళ్లు తప్ప  అంతగా ఇంపాక్ట్ చూపిన వాళ్లే లేరని చెప్పొచ్చు.  బ్యాటర్లు  కాస్తో కూస్తో రాణిస్తున్నా బౌలర్లు మాత్రం దారుణంగా విఫలమవుతున్నారు.  ఐపీఎల్ చరిత్రలో తొలి ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన సీఎస్కే బౌలర్  తుషార్  దేశ్‌పాండే ఆడిన రెండు మ్యాచ్ లలోనూ ధారాళంగా పరుగులిచ్చాడు.  నవ్‌దీప్ సైనీ,  జేసన్ బెహ్రాండార్ఫ్, రిషి ధావన్ ఇలా  అందరిదీ విఫలగాథే.  


అయితే  ఈ విషయంలో కొత్త కుర్రాళ్లు కాస్త బెటర్  ఉన్నారు.  రాజస్తాన్ రాయల్స్ - పంజాబ్ కింగ్స్ మధ్య ఇటీవలే ముగిసిన మ్యాచ్ లో  యుజ్వేంద్ర చహల్ స్థానంలో వచ్చిన ధ్రువ్ జురెల్..  ఈ మ్యాచ్‌ను గెలిపించినంత పనిచేశాడు.   రెండ్రోజుల క్రితం  ఆర్సీబీ - కేకేఆర్ తో మ్యాచ్‌లో వెంకటేశ్ అయ్యర్  ప్లేస్ లో వచ్చిన  ఢిల్లీ కుర్రాడు సుయాశ్ శర్మ   కూడా మూడు వికెట్లు తీసి ఈ  ఇంపాక్ట్ ప్లేయర్ రోల్ కు న్యాయం చేశారు.