MS Dhoni in IPL 20th Over: ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2023 ఎడిషన్‌లో మరో  లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ ఘనంగా ముగిసింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ - పంజాబ్ కింగ్స్ మధ్య ఉత్కంఠగా ముగిసిన  హై స్కోరింగ్ లాస్ట్ ఓవర్ లాస్ట్ బాల్ థ్రిల్లర్ ‌లో  పంజాబ్‌నే విజయం వరించింది. అయితే ఈ మ్యాచ్‌లో జయాపజయాలు సంగతి  పక్కనబెడితే  సీఎస్కే సారథి  మహేంద్ర సింగ్ ధోని ఆఖరి ఓవర్లో బ్యాటింగ్‌కు వచ్చి  రెండు భారీ సిక్సర్లు బాది తమిళ తంబీలను అలరించాడు.   ఈ నేపథ్యంలో  మొత్తంగా ధోని ఐపీఎల్ లో 20వ ఓవర్లో ఎలా  ఆడాడో ఇక్కడ చూద్దాం. 


వరల్డ్ గ్రేటెస్ట్ ఫినిషర్


టీమిండియాలో ఉండగా ధోనిని అందరూ ‘ఫినిషర్’అనేవారు. జట్టు కష్టాల్లో ఉంటే ముందే వచ్చి చివరి దాకా నిలవడం.. ఒకవేళ చివర్లో తన అవసరం ఉంటే  దానిని తూచా తప్పకుండా  పాటించడం ధోనికి వెన్నతో పెట్టిన విద్య. ఇక ఐపీఎల్ లో అయితే  ధోని లాస్ట్ ఓవర్ విన్యాసాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు.  అయితే అసలు ఇప్పటివరకూ ధోని.. 20 వ ఓవర్లో ఎన్ని పరుగులు చేశాడు..? అనే ప్రశ్నకు సమాధానం వింటే ఆశ్చర్యపోవాల్సిందే.  
ఇప్పటివరకు (ఆదివారం పంజాబ్‌తో  జరిగిన మ్యాచ్‌ను కలుపుకుని)  20వ ఓవర్లో  290  బంతులు ఎదుర్కున్న ధోని ఏకంగా 709 రన్స్ సాధించాడు. ఇందులో 59 సిక్సర్లు, 49  బౌండరీలు ఉన్నాయి.   అంటే సిక్సర్లు (354), బౌండరీల (196) ద్వారానే  550 పరుగులు సాధించాడు.  ఈ క్రమంలో ధోని స్ట్రైక్ రేట్  244.48గా నమోదైంది.  92 ఇన్నింగ్స్ లలో ధోని 290 బంతులను ఎదుర్కుని ఈ ఘనత సాధించాడు. 


 






దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు.. 


20వ ఓవర్లో బ్యాటింగ్ చేస్తూ ఇన్ని పరుగులు చేసిన   ఆటగాళ్లలో ధోని దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. సీఎస్కే సారథి తర్వాత ముంబై మాజీ ఆటగాడు కీరన్ పొలార్డ్.. 189 బంతులు ఆడి  405 రన్స్ చేశాడు. ఇందులో 26 బౌండరీలు, 33 సిక్సర్లున్నాయి.  రవీంద్ర జడేజా (332 రన్స్), హార్ధిక్ పాండ్యా (262 రన్స్), దినేశ్ కార్తీక్ (253 రన్స్) లు తర్వాత స్థానాల్లో ఉన్నారు.  


బాల్స్ పరంగా అయితే.. 


20వ ఓవర్లో 709 పరుగులు చేసిన ధోని  ఏ బంతికి ఎక్కువ పరుగులు చేశాడో ఇక్కడ చూద్దాం. 


19.1 - 74 
19.2 - 103
19.3 - 159 
19.4 - 140
19.5 - 92 
19.6 - 105  
19.7 - 36 (ఆరో బంతి నోబాల్ గా విసిరినప్పుడు) 







మొత్తంగా - 290 బంతులలో 709 పరుగులు చేశాడు. ఐపీఎల్-16 సీజన్ లో కూడా లాస్ట్ ఓవర్ లో (ఏప్రిల్ 30 వరకు) అత్యధిక పరుగులు చేసింది  ధోని (54) నే. ఆ తర్వాత రింకూ సింగ్ (45), షిమ్రన్ హెట్‌మెయర్ (43) ఉన్నారు.