Dasun Shanaka in IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ -16 ఎడిషన్ లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో విజయంతో జోరు మీదుంది.   మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌ను వారి సొంత మైదానంలో ఓడించిన గుజరాత్..   మరో గుడ్ న్యూస్. ఈ సీజన్‌కు ముందు  నిర్వహించిన వేలంలో   రూ. 2 కోట్లతో  గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసిన  కేన్ విలియమ్సన్ గాయం కారణంగా  పూర్తిగా తప్పుకున్న నేపథ్యంలో  అతడి  స్థానాన్ని  జీటీ  భర్తీ చేసింది. శ్రీలంకకు  పరిమిత ఓవర్లలో  సారథిగా వ్యవహరిస్తున్న  దసున్ శనకను  కేన్ మామ స్థానంలో భర్తీ చేసుకుంది.  


ఈ మేరకు మంగళవారం  జీటీ.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో   మ్యాచ్ ఆడుతుండగానే టీమ్ మేనేజ్మెంట్ ఈ ప్రకటన చేసింది.  మిడిలార్డర్ లో ఉపయుక్తకరమైన బ్యాటర్ తో పాటు  శనక  మీడియం పేస్ బౌలింగ్ కూడా వేయగలడు.  ఈ లెక్కన  గుజరాత్‌కు మరో ఆల్ రౌండర్ కూడా దొరికినట్టే.  రెండు నెలల క్రితం  శ్రీలంక జట్టు భారత్ లో పర్యటించినప్పుడు ఆడిన మూడు టీ20లలో శనక.. ఏకంగా 187 స్ట్రైక్ రేట్‌తో 124 పరుగులు సాధించాడు.  కుదురుకుంటే అలవోకగా సిక్సర్లు కొట్టడం శనకకు మంచినీళ్లు తాగినంత ఈజీ. 


ఇదే మొదటి సీజన్.. 


శనకకు ఇదే తొలి ఐపీఎల్ సీజన్. గతంలో అతడు  పలుమార్లు ఐపీఎల్ వేలంలో పేరు నమోదు చేసుకున్నా   ఏ ఫ్రాంచైజీ కూడా అతడిని దక్కించుకోవడానికి ఆసక్తి చూపలేదు.  గత డిసెంబర్  లో కొచ్చి వేదికగా జరిగిన వేలం ప్రక్రియలో కూడా అతడు అమ్ముడుపోలేదు.  కానీ భారత్‌తో టీ20 సిరీస్ లో శనక మెరుపుల తర్వాత  పలు ఫ్రాంచైజీల ప్రతినిధులు  ‘మేము అతడిని మిస్ చేసుకున్నాం’అని చెప్పిన విషయం తెలిసిందే.  ఈ ఏడాది అతడు ఎవరైనా గాయపడిన ఆటగాడి స్థానాన్ని రిప్లేస్ చేస్తాడని  కూడా సోషల్ మీడియాలో  జోరుగా చర్చ నడిచింది.  ఇందుకు తగ్గట్టుగానే  కేన్ మామ గాయం  శనకకు వరంలా మారింది. ఈ లంక సారథిని  జీటీ..  ఐపీఎల్ లో బేస్ ప్రైస్ రూ. 50 లక్షలు వెచ్చించి సొంతం చేసుకుంది.  ప్రస్తుతం  కివీస్ పర్యటనలో  లంక తరఫున టీ20లు ఆడుతున్న శనక..   ఏప్రిల్ 8న ఈ సిరీస్ ముగిసిన తర్వాతే  గుజరాత్ టీమ్ తో కలుస్తాడు.






కేన్ మామ ఇంటికి..  
సీఎస్కేతో గుజరాత్ ఆడిన తొలి మ్యాచ్‌లో  రుతురాజ్ గైక్వాడ్ కొట్టిన షాట్ ను అందుకోబోయి కింద పడ్డ విలియమ్సన్  మోకాలికి గాయమైంది.  నొప్పితో విలవిల్లాడిన  కేన్ మామను వెంటనే ఆస్పత్రికి తరలించగా అతడికి  అక్కడ స్కానింగ్, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించారు.  కాగా  కాలుకు  కట్టుతో  కేన్ మామ నిన్న  మధ్యాహ్నం న్యూజిలాండ్‌కు పయనమయ్యాడు. కొద్దిరోజుల క్రితమే మోచేతి గాయం నుంచి కోలుకుని జాతీయ జట్టులోకి వచ్చిన అతడు..  మళ్లీ గాయపడటంతో వచ్చే అక్టోబర్ నుంచి  భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ లో ఆడతాడో లేదో అనుమానంగా ఉంది.