ఐపీఎల్‌లో  ప్రస్తుతం 16వ సీజన్ రసవత్తరంగా సాగుతున్నది.  ఈ పదహారేండ్లలో రెగ్యులర్ గా 8 జట్లు (గతేడాాది నుంచి 10) ఆడుతున్నా.. ప్రధానంగా రెండు జట్లదే డామినేషన్.  ఇప్పటివరకు 15 ఐపీఎల్  సీజన్స్ ముగిస్తే  అందులో 9 సార్లు వాటిదే గెలుపు. కానీ ఎవరూ ఊహించని విధంగా  గతేడాది  ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ఆ అగ్ర జట్లు అట్టడుగున  9, 10 స్థానాలకు పడిపోయాయి. కొత్త టీమ్‌ల రాక, పలు పాత ఫ్రాంచైజీలు బలంగా మారడంతో ‘ఇక వాటి కథ కంచికే’ అనుకున్నారు. దానికి తోడు ఈ టీమ్స్ ప్రదర్శన కూడా నానాటికీ తీసికట్టుగా  మారింది.  దీంతో  ఇక ఆ టీమ్స్‌ ఆధిపత్యానికి  శుభం కార్డు పడ్డట్టేనని అనుకున్నారంతా.  కానీ ఈ సీజన్‌లో మాత్రం ఆ రెండు ఫ్రాంచైజీలు  పుంజుకున్నాయి. అవే చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్. 


2022లో పేలవం.. 


ఈ లీగ్ లో 4 సార్లు కప్ కొట్టి 9 సార్లు ఫైనల్ చేరిన జట్టు చెన్నై సూపర్ కింగ్స్. 2022లో డిఫెండింగ్ ఛాంపియన్ (2021లో ధోనిసేనదే ట్రోఫీ)  గా బరిలోకి దిగిన సీఎస్కే.. దారుణ ప్రదర్శనలతో నిరాశపరిచింది. కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా (8  మ్యాచ్‌లకు)  సారథ్యంలో  చెన్నై పేలవ ఆటతీరుతో   విమర్శలు మూటగట్టుకుంది. 14 మ్యాచ్ లు ఆడితే  గెలిచింది నాలుగే.  పాయింట్ల పట్టికలో  9వ స్థానం.  ఆ జట్టు చరిత్రలో ఇంత చెత్తగా ఆడటం ఇదే ప్రథమం. 


చెన్నైతో పాటే ముంబై  ఇండియన్స్ కూడా దారుణంగా  చతికిలపడింది.  కీలక ఆటగాళ్లు దూరం కావడం.. జట్టులో కొత్త ప్లేయర్లు,  పలువురి ఆటగాళ్లకు గాయాలు  ముంబైని వేధించాయి. 2022లో ముంబై కూడా 14 మ్యాచ్ లలో  10 ఓడింది. పాయింట్ల పట్టికలో   పదో స్థానంతో   అవమానకరరీతిలో  ఓటమి పాలైంది.  ముంబై ఇండియన్స్ చరిత్రలో  ఇంత చెత్త ఆటతో టేబుల్ లాస్ట్ ప్లేస్ కు పడిపోవడం ఇదే మొదటిసారి..  ఈ రెండు జట్లు  సరిగా ఆడకపోవడం వల్లే గతేడాది ఐపీఎల్ అట్టర్ ఫ్లాఫ్ (రేటింగ్స్, వ్యూస్ పరంగా)అయినట్టు వాదనలు వినిపించాయి.


 






రిథమ్ అందుకున్నట్టే..!


గత సీజన్ అనుభవాల దృష్ట్యా తాజా ఎడిషన్ కు ముందు కూడా ఈ రెండు టీమ్స్‌పైనే అందరి దృష్టంతా. ఎలా ఆడతాయి..?   పుంజుకుంటాయా.. లేక మళ్లీ  2022 పునరావృతమవుతుందా..? అని  ఆసక్తి. దానికి తోడుగానే చెన్నై ఆడిన ఫస్ట్ మ్యాచ్ (గుజరాత్)లో  ఓడింది. ముంబై కూడా వరుసగా రెండు పరాజయాలు.   కానీ తర్వాత  ఈ జట్లు పుంజుకున్నాయి. లక్నో, ముంబై పై గెలిచిన  చెన్నై  తర్వాత రాజస్తాన్ చేతిలో ఓడినా  మళ్లీ ఆర్సీబీ, హైదరాబాద్,  కోల్‌కతాలను ఓడించింది.  ముంబై కూడా రెండు ఓటముల తర్వాత హ్యాట్రిక్ విజయాలు సాధించింది.  పంజాబ్ తో మ్యాచ్ లో విజయానికి దగ్గరగా వచ్చింది.  


ఫుల్ జోష్‌లో ముంబై.. 


ఈ రెండు జట్లు గత సీజన్‌తో పోలిస్తే  బాగా మారాయి. ముంబైలో కుర్రాళ్లు కుదురుకున్నారు.  రూ. 17 కోట్ల ఆటగాడు కామెరూన్ గ్రీన్, ఆంధ్రా కుర్రాడు తిలక్ వర్మలు ఆ జట్టు విజయాల్లో కీలకంగా మారారు.  రోహిత్ కూడా  టచ్ లోకి వచ్చాడు. పంజాబ్ తో మ్యాచ్ లో సూర్యా భాయ్ ఆట చూశాక  కూడా  బ్యాక్ టు ఫామ్ అనక తప్పదు. టిమ్ డేవిడ్ కూడా  అవసరమైన మేరకు బాదుతున్నాడు. ఇషాన్ కిషన్ విఫలమవుతున్నా అతడు కూడా సెట్  అయితే ముంబైకి తిరుగుండదు.   బౌలింగ్ లో కూడా బెహ్రాండార్ఫ్, మెరిడిత్ లతో పాటు అర్జున్ టెండూల్కర్  ఫర్వాలేదనిపిస్తున్నారు. మరీ గొప్ప ప్రదర్శనలు చేయకపోయినా ఉన్నంతలో బాగానే రాణిస్తున్నారు.   వెటరన్ స్పిన్నర్ పియుష్ చావ్లాకు తోడు యువ స్పిన్నర్ హృతీక్ షోకీన్ కూడా తన ప్రభావం చూపుతున్నాడు. 


 






చెన్నైకి బ్యాటింగే బలం.. 


గత సీజన్ లో చెన్నై వైఫల్యాలకు ప్రధాన కారణం బ్యాటింగ్  వైఫల్యమే.  రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, శివమ్ దూబే, మోయిన్ అలీ.. ఇలా అందరూ విఫలమయ్యారు. కానీ ఇప్పుడు వీరు చెన్నై  విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ఏడాది సీఎస్కేకు సర్‌ప్రైజ్  ప్యాకేజీలా దొరికాడు రహానే. ఎవరూ ఊహించని విధంగా  వీరబాదుడు బాదుతూ  ప్రత్యర్థులకు చుక్కల చూపిస్తున్నాడు.  చివర్లో జడ్డూ,  ధోనిలు కూడా ఓ చేయి వేస్తున్నారు. బౌలింగ్  లో కూడా  అంతగా అనుభవం లేకున్నా ఆకాశ్ సింగ్, తుషార్ దేశ్‌పాండే,  పతిరన లతో ధోని అద్భుతాలు చేస్తున్నాడు.  రవీంద్ర జడేజా, తీక్షణ, మోయిన్ అలీలు స్పిన్ మాయతో  అదరగొడుతున్నారు.  ధోని లాస్ట్ సీజన్ (?) అని ఫిక్స్ అయ్యారో ఏమో గానీ  అతడి కోసమైనా మ్యాచ్ గెలవాలన్న పట్టుదల చెన్నై ఆటగాళ్లలో కనిపిస్తోంది. 


అదే జరిగితే..


ఈ రెండు జట్ల జోరు చూస్తుంటే ప్లేఆఫ్స్ కు చేరడం పెద్ద కష్టమైతే కాదనే అనిపిస్తోంది.  ప్రస్తుతం పాయింట్ల పట్టిక ప్రకారం చెన్నై ఏడు మ్యాచ్ లు ఆడి  10 పాయింట్లతో  టాప్ -1 లోకి వచ్చింది. ఆ జట్టు ప్లేఆఫ్స్ చేరడం  పెద్ద కష్టమైతే కాదు.  ముంబై  ఆరు మ్యాచ్ లు ఆడి మూడింట గెలిచి మూడు ఓడింది.  పంజాబ్ తో మ్యాచ్ లో ఓడినా  రోహిత్ శర్మ..  ఓటమి గురించి  పెద్దగా చింతించడం లేదని పాజిటివ్ మైండ్ సెట్ తో ఉన్నాడు. గతేడాది  రోహిత్ లో ఇదే మిస్ అయ్యింది. ఇదే దృక్పథంతో ఆడితే  ముంబైకి కూడా  ప్లేఆఫ్స్  అసాధ్యమైతే కాదు.   ఈ రెండు జట్లు  ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తే అభిమానులకు మరో  ‘ఎల్ క్లాసికో’ చూసే భాగ్యం వస్తుంది. మరి చూద్దాం రాబోయే మూడు వారాల్లో ఏం జరుగుతుందో..!