GT vs DC: ఐపీఎల్-16లో సోమవారం లక్నో - బెంగళూరు మధ్య జరిగిన లోస్కోరింగ్ థ్రిల్లర్ గడిచి రోజైనా గడవకముందే మళ్లీ అదే సీన్ రిపీట్ అయింది. ఢిల్లీ నిర్దేశించిన 131 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న గుజరాత్.. ఆఖరి బంతి వరకూ తెచ్చుకున్నా ఫలితం వారికి అనుకూలంగా రాలేదు. 20 ఓవర్లలో గుజరాత్.. 6 వికెట్లు కోల్పోయి 125 పరుగులకే పరిమితమై ఐదు పరుగుల తేడాతో ఓడింది.
బౌలింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై తమ బ్యాటర్లు విఫలమైన చోట ఢిల్లీ బౌలర్లు వీరోచితంగా పోరాడి ఆ జట్టు ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచారు. చివరి వరకూ విజయం దిశగా సాగిన గుజరాత్.. ఆఖర్లో రాహుల్ తెవాటియా (7 బంతుల్లో 20, 3 సిక్సర్లు) హ్యాట్రిక్ సిక్సర్లతో మెరుపులు మెరిపించినా ఆ జట్టు కు ఓటమి తప్పలేదు. హార్ధిక్ పాండ్యా (53 బంతుల్లో 59 నాటౌట్, 7 ఫోర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.
పవర్ ప్లే లోనే షాక్..
131 పరుగుల లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఢిల్లీ మాదిరిగానే గుజరాత్‌కూ కష్టాలు తప్పలేవు. ఖలీల్ అహ్మద్ వేసిన తొలి ఓవర్లోనే జీటీ ఓపెనర్ వృద్ధిమాన్ సాహా డకౌట్ అయ్యాడు. తొలి ఓవర్ చివరి బంతికి అతడు వికెట్ కీపర్ ఫిలిప్ సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చాడు. నోర్జే వేసిన నాలుగో ఓవర్లో ఫస్ట్ బాల్‌కు శుభ్‌మన్ గిల్ (7 బంతుల్లో 6, 1 ఫోర్) మనీష్ పాండేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
గిల్ స్థానంలో వచ్చిన విజయ్ శంకర్ (9 బంతుల్లో 6, 1 ఫోర్) కూడా ఇషాంత్ శర్మ వేసిన ఐదో ఓవర్లో ఆఖరి బాల్‌కు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పవర్ ప్లే ముగిసేటప్పిటికీ ఆ జట్టు చేసిన స్కోరు 31-3. ఐపీఎల్ లో రెండో సీజన్ ఆడుతున్న గుజరాత్‌కు ఇదే లోయెస్ట్ పవర్ ప్లే స్కోరు. ఏడో ఓవర్లో కుల్దీప్ యాదవ్.. గుజరాత్ కష్టాలను మరింత రెట్టింపు చేశాడు. ఆ ఓవర్లో నాలుగో బాల్‌కు డేవిడ్ మిల్లర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
ఢిల్లీ కట్టడి.. పాండ్యా - మనోహర్ నిలకడ..
31 కే 3 వికెట్లు కోల్పోయిన గుజరాత్‌ను కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, అభినవ్ మనోహర్ (33 బంతుల్లో 26, 1 సిక్స్) ఆదుకున్నారు. ఖలీల్ అహ్మద్ వేసిన మూడో ఓవర్లోనే మూడు ఫోర్లు కొట్టిన హార్ధిక్.. తర్వాత వికెట్లు కోల్పోవడంతో నెమ్మదించాడు. మిల్లర్ అవుట్ అయ్యాక మనోహర్ తో కలిసి అతడు సింగిల్స్ తీసేందుకే తంటాలు పడ్డాడు. ఢిల్లీ బౌలర్లు ఇరువైపులా కట్టడి చేయడంతో గుజరాత్ కు పరుగుల రాక కష్టమైంది. ఇషాంత్, కుల్దీప్, నోర్జేలు గుజరాత్‌ను కట్టడి చేశారు. దీంతో గుజరాత్ స్కోరు 11వ ఓవర్లో ఫస్ట్ బాల్ కు ఫిఫ్టీ దాటింది. 15 ఓవర్లకు గుజరాత్ స్కోరు 79-4 గా ఉంది.
ఛేదించాల్సిన రన్ రేట్ పెరుగుతుండటంతో అభినవ్ మనోహర్ హిట్టింగ్ కు దిగేందుకు యత్నించాడు. ఖలీల్ అహ్మద్ వేసిన 18వ ఓవర్లో ఫస్ట్ బాల్ ను లాంగాన్ దిశగా ఆడాడు. కానీ అక్కడే ఉన్న అమన్ ఖాన్ క్యాచ్ పట్టడంతో మనోహర్ కథ ముగిసింది. పాండ్యాతో కలిసి మనోహర్.. 63 బంతుల్లో 62 పరుగులు జోడించాడు.
ఆఖర్లో హైడ్రామా..
గుజరాత్ విజయానికి చివరి 2 ఓవర్లలో 33 పరుగులు అవసరం ఉండగా నోర్జే వేసిన 19వ ఓవర్లో తెవాటియా హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు. ఈ ఓవర్లో 21 రన్స్ వచ్చాయి. ఇక చివరి ఓవర్లో 12 పరుగులు అవసరం కాగా తొలి రెండు బంతల్లో పాండ్యా 3 రన్స్ చేశాడు. మూడో బాల్‌కు పరుగులేమీ రాలేదు. నాలుగో బాల్‌కు తెవాటియా ఔట్. ఐదో బాల్ ను రషీద్ ఆఫ్ సైడ్ఖ దిశగా ఆడినా రూసో సూపర్బ్ ఫీల్డింగ్ తో రెండు పరుగులే వచ్చాయి. ఆఖరి బంతికి ఏడు పరుగులు కావాల్సి ఉండగా.. ఒక్క పరుగులు మాత్రమే వచ్చింది. ఫలితంగా ఢిల్లీ 5 పరుగుల తేడాతో గెలిచింది.