ఐపీఎల్ 2022 సీజన్‌లో చెన్నై ఖాతాలో చెత్త రికార్డు చేరింది. ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చివరి ఐదు ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా కొట్టలేదు. 15 సీజన్లలో ఏ జట్టయినా... ఎంత కష్టమైన పిచ్ మీదనైనా చివరి ఐదు ఓవర్లలో కనీసం ఒక్క బౌండరీ అయినా సాధించింది. కానీ చెన్నై బ్యాటర్లకు మాత్రం అది చేతకాలేదు.


రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే, ధోని వంటి హిట్టర్లు ఈ ఐదు ఓవర్లు ఆడిన బ్యాటర్లలో ఉన్నారు. అయినా గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి బౌండరీ రాకుండా ఆపారు. చివరి మూడు వికెట్లు కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్ కేవలం 24 పరుగులు మాత్రమే చేయగలిగింది.


ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నైకి శుభారంభం లభించలేదు. ఓపెనర్ డెవాన్ కాన్వే (5: 9 బంతుల్లో) మూడో ఓవర్లోనే అవుటయ్యాడు. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (53: 49 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు), మొయిన్ అలీ (21: 17 బంతుల్లో, రెండు సిక్సర్లు) రెండో వికెట్‌కు 53 పరుగులు జోడించారు.


మొయిన్ అలీ అవుటయ్యాక చెన్నై ఇన్నింగ్స్‌లో వేగం తగ్గింది. రుతురాజ్ గైక్వాడ్ నెమ్మదించడంతో పాటు జగదీషన్ (39: 33 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) వేగంగా ఆడలేకపోయాడు. ధోని (7: 10 బంతుల్లో), శివం దూబే (0: 2 బంతుల్లో) విఫలం అయ్యారు. దీంతో 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ షమీకి రెండు వికెట్లు, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, సాయి కిషోర్‌లకు తలో వికెట్ దక్కాయి.


అనంతరం గుజరాత్ ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది.ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (18: 17 బంతుల్లో, మూడు ఫోర్లు), వృద్ధిమాన్ సాహా (67 నాటౌట్: 57 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్) బౌండరీలతో చెలరేగారు. మొదటి వికెట్‌కు కేవలం 7.1 ఓవర్లలోనే 59 పరుగులు జోడించారు.


గిల్ తర్వాత మాథ్యూ వేడ్ (20: 15 బంతుల్లో, రెండు ఫోర్లు), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (7: 6 బంతుల్లో, ఒక ఫోర్) ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. లక్ష్యం తక్కువే కావడంతో సాహా, డేవిడ్ మిల్లర్ (15 నాటౌట్: 20 బంతుల్లో, ఒక ఫోర్) ఆచితూచి ఆడారు. గుజరాత్ 19.1 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. చెన్నై బౌలర్లలో మతీష పతిరాణాకు రెండు వికెట్లు దక్కగా...మొయిన్ అలీ ఒక వికెట్ పడగొట్టాడు.