న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా మూడో వన్డేలో 43 పరుగుల తేడాతో భారత్ ను ఓడించింది. దీంతో ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు మూడు వన్డేల సిరీస్ ను 2-1 తేడాతో సాధించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో కంగారూ జట్టు మొదట బ్యాటింగ్ చేయగా 412 పరుగుల భారీ స్కోరు చేసింది. రికార్డు పరుగుల ఛేజింగ్ కు దిగిన భారత జట్టు 369 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ లో స్మృతి మంధానా (125 పరుగులు) సెంచరీ సాధించింది. కానీ జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయింది.
413 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి వచ్చిన భారత జట్టుకు శుభారంభం దొరకలేదు. టీమిండియా ఓపెనర్ ప్రతీకా రావల్ 10 పరుగులు చేసి ఔట్ అయింది. స్టార్ బ్యాటర్ స్మృతి మంధానా ఒక ఎండ్ లో పరుగుల వరద పారించినా మరో ఎండ్ నుండి వికెట్లు వరుసగా పడిపోయాయి. హర్లీన్ డియోల్ కూడా 11 పరుగులు చేసి అవుట్ అయింది.
మ్యాచ్ లో 781 పరుగులు, 111 బౌండరీలు
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ లో మొత్తం 781 పరుగులు నమోదయ్యాయి. రెండు జట్లు కలిపి మొత్తం 99 ఫోర్లు, 12 సిక్సర్లు కొట్టాయి. అంటే మ్యాచ్ లో మొత్తం 111 బౌండరీలు నమోదయ్యాయి. మొదట ఆస్ట్రేలియా జట్టు 60 ఫోర్లు, 5 సిక్సర్లు కొట్టింది. ఆ తర్వాత టీమ్ ఇండియా కూడా దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ 39 ఫోర్లు, 7 సిక్సర్లు కొట్టింది. ఈ విధంగా ఇరు జట్ల బ్యాట్స్ మెన్ లు కలిసి 111 బౌండరీలు బాది వీర విహారం చేశారు. అయితే పూర్తి ఓవర్లు ఆడకుండానే రెండు జట్లు వ్యక్తిగతంగానూ, కలిపి వన్డేల్లో చేసిన అత్యధిక స్కోరు ఇదే.
ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన పురుషుల, మహిళల వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా సెంచరీలు చేసిన భారత క్రికెటర్‌గా నిలిచింది. ఆమె 50 బంతుల్లోనే తన సెంచరీని సాధించింది. విరాట్ కోహ్లీ గతంలో 52 బంతుల్లో సెంచరీ చేసిన రికార్డును బద్దలు కొట్టింది. మంధానకు వన్డేల్లో ఇది 13వ సెంచరీ.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్
ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హేలీ (30) వేగంగా ఆడే క్రమంలో ఔటైంది. మరో ఓపెనర్ జార్జియా వోల్ (81) చేసి రాణా బౌలింగ్ లో పెవిలియన్ చేరింది. కానీ జట్టు స్కోరు వేగం ఎక్కడా తగ్గకుండా ఆడారు. ఆపై ఎలిస్ పెర్రీ (68) సైతం హాఫ్ సెంచరీ చేసింది. బెథ్ మూనీ (75 బంతుల్లో 23 ఫోర్లు, 1 సిక్సర్) మెరుపు సెంచరీతో వీర విహారం చేసింది. రనౌట్ కావడంతో ఆస్ట్రేలియా జోరు తగ్గింది. ఆ తరువాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో ఆసీస్ 47.5 ఓవర్లలో 412 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో అరుందతి రెడ్డి 3 వికెట్లు తీయగా, రేణుకా సింగ్, దీప్తి శర్మ చెరో 2 వికెట్లు తీశారు. క్రాంతి గౌడ్, స్నేహ్ రాణాలకు ఒక వికెట్ దక్కింది.
మంధానా మెరుపు శతకం, రాణించిన హర్మన్ ప్రీత్, దీప్తి శర్మ
అత్యధిక పరుగుల ఛేజింగ్ లో భారత్ కు శుభారంభం లభించలేదు. ఓపెనర్ ప్రతికా రావల్ 10 పరుగులకే ఔటైంది. మరో ఓపెనర్ స్మృతీ మంధానా ఫోర్లు, సిక్సర్లతో విరుచుకు పడింది. హర్లీన్ డియెల్(11) త్వరగా ఔటైంది. 50 బంతుల్లోనే సెంచరీ చేసిన మధానా 125 పరుగులకు హారిస్ బౌలింగ్ లో గార్డెనర్ కు క్యాచిచ్చి ఔటైంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (35 బంతుల్లో 52), దీప్తి శర్మ (58 బంతుల్లో 72, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు. కానీ అవేమీ జట్టుకు విజయాన్ని అందించలేకపోయాయి. కొండంత లక్ష్యం ముందున్నా భారత అమ్మాయిలు అద్భుతంగా పోరాడారని చెప్పవచ్చు. 47 ఓవర్లలో భారత్ 369 పరుగులు చేసింది. టాపార్డర్ లో మరొకరు రాణించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది.