IND vs PAK Super 4 Match: దుబాయ్: భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన గ్రూప్ మ్యాచ్ సమయంలో తలెత్తిన "హ్యాండ్‌షేక్" వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచిన జింబాబ్వే మాజీ క్రికెటర్ ఆండి పైక్రాఫ్ట్ (Andy Pycroft) మళ్లీ ఆదివారం దుబాయ్ వేదికగా జరగబోయే Super4 మ్యాచ్‌కు మ్యాచ్ రెఫరీగా నియమితులయ్యారు. ఈ విషయాన్ని ESPNcricinfo తెలియజేసింది. ఆసియా కప్‌లో సెప్టెంబర్ 14న భారత్ చేతిలో 7 వికెట్ల తేడాతో పాకిస్థాన్ ఘోర పరాజయం అనంతరం, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) మ్యాచ్ రెఫరీ ఆండి పైక్రాఫ్ట్ ను వెంటనే తీసేయాలని డిమాండ్ చేసింది. వారి ఆరోపణల ప్రకారం, పైక్రాఫ్ట్ గ్రూప్ దశలో టాస్ సమయంలో కెప్టెన్లు అఘా సల్మాన్, సూర్యకుమార్ యాదవ్ హ్యాండ్‌షేక్ చేయవద్దని చెప్పినట్టు తెలుస్తోంది.
అయితే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) డిమాండ్‌ను తిరస్కరించింది, దాంతో పైక్రాఫ్ట్ తన స్థానంలోనే కొనసాగారు. అయితే ఈ వివాదం అక్కడితో ఆగలేదు. యుఏఈతో జరిగిన కీలక మ్యాచ్‌కి ముందే పాకిస్థాన్ జట్టు ప్రెస్ కాన్ఫరెన్స్‌ను రద్దు చేయడమే కాకుండా, మ్యాచ్‌కు కూడా ఆలస్యంగా రావడంతో 1 గంట ఆలస్యంగా ప్రారంభమైంది.
అదే వేదిక.. అదే సీన్ రిపీట్ అవుతుందా..
ఈ ఆలస్యం కారణంగా, పాకిస్థాన్ ఆటగాళ్లను హోటల్‌లోనే ఉంచి, PCB అధికారులు ICCతో చర్చలు జరిపినట్టు సమాచారం. యుఏఈతో టాస్‌కు కొన్ని క్షణాల ముందు, పాకిస్థాన్ జట్టు యాజమాన్యం పైక్రాఫ్ట్‌ను కలవడం మరో కొత్త వివాదానికి దారి తీసింది. ఈ సమావేశానికి సంబంధించిన వీడియోను PCB సోషల్ మీడియాలో పంచగా, తర్వాత వెంటనే తొలగించారు. ఇప్పుడు ఈ రెండు జట్లు మళ్లీ అదే వేదికపై తలపడబోతున్నాయి. తొలగించాలని పాక్ కోరిన ఆండి పైక్రాఫ్ట్ భారత్, పాక్ మధ్య జరగనున్న సూపర్ 4 మ్యాచ్‌కు సైతం రిఫరీగా వ్యవహరించనుండటం పాక్‌కు మింగుడు పడటం లేదు. ఈసారి పాక్ మ్యాచ్ ను బాయ్‌కాట్ చేస్తుందా, లేక రిఫరీని తొలగిస్తేనే మ్యాచ్ ఆడతామని డిమాండ్ చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.
వివాదాలకంటే మా పనిపైనే దృష్టి – సూర్యకుమార్ యాదవ్భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం ప్రశాంతంగా జట్టును ముందుకు తీసుకెళ్తున్నాడు. శనివారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, "టోర్నమెంట్‌కు ముందు మా ప్రిపరేషన్ బాగా జరిగింది. మేము 3 మంచి మ్యాచులు ఆడాం. మేం చేయగలిగిన దానిపై దృష్టి పెట్టుతున్నాం. గత 2-3 మ్యాచ్‌లలో ఏర్పడిన మంచి అలవాట్లను కొనసాగించాలని చూస్తున్నాం. ఒక్కో మ్యాచ్‌ను గెలుచుకుంటూ వెళ్లడమే మాకు ముఖ్యం. గత మ్యాచ్ గెలవడం అడ్వాంటేజ్ కాదు. ఇది కొత్త మ్యాచ్. బాగా ఆడిన జట్టే గెలుస్తుంది’ అని అన్నాడు.
భారత జట్టు:సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్