Asia Cup 2025 Arshdeep In 100 T20i Wickets Club : భారత పేసర్ అర్షదీప్ సింగ్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్ తరపున వంద టీ20 అంతర్జాతీయ వికెట్లు తీసిన తొలి బౌలర్ గా నిలిచాడు.శుక్రవారం అబుధాబిలో ఒమన్ తో జరిగిన మ్యాచ్ లో తన ఈ ఘనత సాధించాడు. కేవలం 64వ మ్యాచ్ లోనే ఈ మైలురాయిని చేరుకున్న అర్షదీప్.. అత్యంత వేగవంతంగా ఈ మార్కును చేరుకున్న తొలి పేసర్ గా రికార్డులకెక్కాడు. అతనికంటే ముందు అత్యంత వేగంగా రషీద్ ఖాన్ (ఆఫ్గానిస్తాన్), వనిందు హసరంగా (శ్రీలంక) మాత్రమే ఈ మైలురాయిని చేరుకున్నారు. వీరిద్దరూ స్పిన్నర్లు కావడం విశేషం. ఒమన్ బ్యాటర్ వినాయక్ శుక్లాను ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో ఔట్ చేసి, ఈ మైలురాయిని అర్షదీప్ చేరుకోవడం విశేషం.
ఎదురు చూపులు..నిజానికి ఈ ఏడాది ప్రథమార్థంలోనే 99 వికెట్ల మైలురాయిని చేరుకున్న అర్షదీప్.. వందో వికెట్ ను చేరడానికి సుదీర్ఘకాలం వెయిట్ చేశాడు. ఫిబ్రవరిలో ముగిసిన ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్ తర్వాత భారత్.. మళ్లీ టీ20 మ్యాచ్ లు ఆడకపోవడమే దీనికి కారణం. ఈ సిరీస్ ముగిశాక, ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్, ఆ తర్వాత ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, ఐపీఎల్, ఇంగ్లాండ్ లో భారత పర్యటన తదితర కారణాలతో ఇండియా పొట్టి ఫార్మాట్ లో ఆడలేదు. ఇటీవల ప్రారంభమైన ఆసియాకప్ తోనే తిరిగి పొట్టి ఫార్మాట్ ను భారత్ మొదలు పెట్టింది. అయితే పాకిస్తాన్, యూఏఈలతో జరిగిన మ్యాచ్ లో అర్షదీప్ కు తుదిజట్టులో అవకాశం రాకపోవడంతో, తను ఒమన్ తో మ్యాచ్ వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది.
బుమ్రా, పాండ్యా నుంచి సవాలు..నిజానికి వంద వికెట్ల క్లబ్బులో అర్షదీప్ కంటే ముందు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా లేదా స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా చేరతాడని ఒక దశలో అనిపించింది. ఒమన్ తో మ్యాచ్ కు ముందు పాండ్యా ఖాతాలో 95 వికెట్లు ఉండగా, బుమ్రా ఖాతాలో 92 వికెట్లు ఉన్నాయి. అయితే వీరిద్దరూ ఈ ఫార్మాట్లో రెగ్యులర్ గా ఆడుతుండటం, అర్షదీప్ బెంచ్ కే పరిమితం కావడంతో వంద వికెట్ల క్లబ్బులో తను చేరడంపై సందేహాలు నెలకొన్నాయి. ఏదేమైనా ఒమన్ తో మ్యాచ్ లో తను ఈ అనిశ్చితికి తెరదించాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే ఒమన్ పై ఇండియా చెమటోడ్చి నెగ్గింది. అంతకుముందు అబుధాబి వేదికగా శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 188 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ స్టన్నింగ్ ఫిఫ్టీ (45 బంతుల్లో 56, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అనంతరం ఛేజింగ్ లో అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చిన ఒమన్.. ఓవర్లన్నీ ఆడి 4 వికెట్లకు 167 పరుగులు మాత్రమే చేసి, ఓడిపోయింది.