Ind vs Eng 5th Test: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక టెస్టులో టీమిండియా ప్రస్తుత పరిస్థితిపై మాజీ కోచ్ రవి శాస్త్రి స్పందించాడు. డిఫెన్స్ ఆడటం, వెనుకంజ వేస్తూ బ్యాటింగ్ చేయడంతో రెండో ఇన్నింగ్స్‌లో తక్కువ పరుగులకే కుప్పకూలిందన్నాడు. దాంతో ఓటమి పాలవుతామని భావించిన ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు ఒక్కసారిగా మ్యాచ్‌ను శాసించే స్థితికి వచ్చిందని.. అందుకే భారత డిఫెన్స్ బ్యాటింగ్, బెరుకుగా బ్యాటింగ్ చేయడమే కారణమని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.
లంచ్ తరువాత వణుకు మొదలైంది..
ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరుగుతున్న 5వ టెస్టులో ఓ దశలో 132 పరుగుల ఆధిక్యంతో ఉన్న భారత్.. రెండో ఇన్నింగ్స్ లో కేవలం 245 పరుగులకే ఆలౌటైంది. దాంతో టీమిండియాకు 378 పరుగుల ఆధిక్యం లభించింది. కానీ కొండంత లక్ష్యం ముందున్నా కాన్ఫిడెంట్‌గా ఇంగ్లీష్ ఆటగాళ్లు బ్యాటింగ్ చేశారని.. దాంతో ప్రస్తుతం వారు విజయానికి 119 పరుగుల దూరంలో నిలిచారని రవిశాస్త్రి గుర్తుచేశాడు. టీమిండియా మెరుగైన స్థితిలో ఉన్నా అటాకింగ్ చేయలేదు. కనీసం కాన్ఫిడెన్స్‌గా ఆడలేదు. ముఖ్యంగా లంచ్ తరువాత భారత బ్యాటర్లలో వణుకు మొదలైందన్నాడు. వికెట్లు కోల్పోతున్నా, పరుగుల మీద ఫోకస్ చేయడంలో వెనుకంజ వేయడంతో మ్యాచ్ ఇంగ్లాండ్ చేతిలోకి వెళ్లిపోయింది. 2-1తో ఉన్న భారత్ 2-2 తో సిరీస్ ముగించే ఛాన్స్ ఉందని రవిశాస్త్రి పేర్కొన్నాడు.
బుమ్రా వ్యూహాలు బెడిసికొట్టాయి: పీటర్సన్
భారత తాత్కాలిక టెస్ట్ కెప్టెన్ జస్ప్రిత్ బుమ్రా కెప్టెన్సీ వ్యూహాలపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ స్పందించాడు. బుమ్రా వ్యూహాలు బెడిసికొట్టడంతో భారత్ పూర్తిగా ఆత్మరక్షణ ధోరణిలో పడిపోయింది. నాలుగోరోజు ఆటలో బుమ్రా వ్యూహాలు ఏవీ ఫలించలేదు. బౌలింగ్‌లోనూ కాస్త తగ్గినట్లు కనిపించాడు. రివర్స్ స్వింగ్ అవకపోవడంతో బ్యాటర్లకు సహకారం లభించింది. టెస్టు నాలుగోరోజు ముఖ్యంగా ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా వేగంగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం ప్రత్యర్థి జట్టుకు అవకాశాలు పెంచిందని పీటర్సన్ భావించాడు. కనీసం మ్యాచ్ చివరిరోజైనా బుమ్రా ఏమైనా అద్భుతాలు చేస్తాడేమో చూద్దామంటూ తన అభిప్రాయాలు షేర్ చేసుకున్నాడు.
378 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ నాలుగో రోజు ఆట ముగిసేసరికి మూడు వికెట్లు నష్టపోయి 259 పరుగులు చేసింది. జో రూట్ (76 బ్యాటింగ్: 112 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు), జానీ బెయిర్‌స్టో (72 బ్యాటింగ్: 87 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 119 పరుగులు కావాలి.