టీమిండియా(Team India)  మాజీ పేసర్‌ ప్రవీణ్‌కుమార్‌(Praveen Kumar) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Varma)ను అభిమానులు దూషించడాన్ని తాను తట్టుకోలేక పోయినట్లు గుర్తు చేసుకున్నాడు. తాను ఎవరితోనూ సాధారణంగా గొడవ పడేందుకు ఇష్టపడనని ప్రవీణ్‌కుమార్‌ తెలిపాడు. కానీ 2012లో మెల్‌బోర్న్‌లో జరిగిన ఓ ఘటన మాత్రం తనకు తీవ్ర ఆగ్రహం తెప్పించిందని గుర్తు చేసుకున్నాడు. రోహిత్, మనోజ్ తివారీతో కలిసి తాను నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో... అక్కడి భారత అభిమానులే తమను దూషించడం మొదలుపెట్టారని.. ముఖ్యంగా రోహిత్ శర్మపై విమర్శలు గుప్పించారని ప్రవీణ్‌ కుమార్‌ గుర్తు చేసుకున్నాడు. భారత అభిమానులు అలా ఎందుకు చేశారో తనకు అర్థం కాలేదని... అప్పటి వరకు ఓర్పుగా ఉన్న రోహిత్ ఆ తర్వాత ఆగ్రహం వ్యక్తం చేశాడని... వారి దగ్గరకు వెళ్లాడని తెలిపాడు. తాను కూడా రోహిత్‌తోనే ఉన్నానని... మనవాళ్లే మమ్మల్ని దుర్భాషలాడటం తమను తీవ్రంగా బాధించిందని... రోహిత్ పట్ల వారు అలా ప్రవర్తించడం తట్టుకోలేక తాను కూడా కాస్త ఘాటుగానే స్పందించానని ప్రవీణ్‌ తెలిపాడు.


అందరూ తాగేవారే..
ది లలన్‌టాప్‌ ఓనర్‌ సౌరభ్‌ ద్వివేది నిర్వహిస్తున్న ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ప్రవీణ్‌ కుమార్‌ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలోనే భారత క్రికెట్‌ జట్టు మాజీ ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను ఆడినప్పుడు ఉన్న జట్టులో అందరూ మద్యం తాగేవాళ్లని, ఏ ఒక్కరూ అందుకు మినహాయింపు కాదని తెలిపాడు. తాను భారత జట్టులో ఉన్నప్పుడు తాగొద్దు. ఇలా ఉండొద్దు.. అలా ఉండొద్దని సీనియర్లు తనతో చెప్పేవాళ్లని... కానీ అప్పుడు టీమ్‌లో అందరూ తాగేవాళ్లని ప్రవీణ్‌ తెలిపాడు. కానీ వాళ్లంతా తాను మాత్రమే తాగేవాడిని అని నన్ను బద్నాం చేశారని వాపోయాడు. వీరిలో ఎవరైనా తాగొద్దని సలహాలు ఇచ్చారా అన్న ప్రశ్నకు కూడా ప్రవీణ్‌ కుమార్‌ స్పందించాడు. తాను పేరు చెప్పను కానీ అందరూ తనకు సలహాలు ఇచ్చేవారని... అలా చెప్పినవాళ్లు ఎవరో ప్రజలందరికీ తెలుసని అన్నాడు. ప్రవీణ్‌కు ఆ సలహాలు ఇచ్చింది ఎవరు..? తన పేరును బద్నాం చేసిందెవరు..? అన్నది మాత్రం అతడు వెల్లడించలేదు.


లలిద్‌ మోడీ భయపెట్టాడు..
ఇవేకాకుండా ప్రవీణ్‌కుమార్‌ మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌ వ్యవ‌స్థాప‌కుడు ల‌లిత్ మోడీ త‌న‌ను భ‌య‌పెట్టాడ‌ని, కెరీర్ నాశనం చేస్తాన‌ని బెదిరించాడ‌ని ప్రవీణ్ అన్నాడు. ఐపీఎల్ ఆరంభ సీజ‌న్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు కాంట్రాక్టుపై సంత‌కం చేయ‌కుంటే తన కెరీర్‌ను నాశానం చేస్తానని ల‌లిత్ మోడీ బెదిరించాడని ప్రవీణ్‌ తెలిపాడు. ఐపీఎల్ తొలి సీజ‌న్‌లో ఆర్సీబీకి బ‌దులు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఆడాల‌నుకున్నానని... కానీ లలిత్‌ మోడీ బెదిరించాడని తెలిపాడు. అప్పుడు ఒక‌త‌ను తనను కాంట్రాక్టుపై సంత‌కం చేయ‌మ‌న్నాడని.. ఆ పేప‌ర్స్ ఆర్సీబీ కాంట్రాక్టు సంబంధించిన‌వ‌ని తెలిసి తాను ఒప్పుకోలేదని గుర్తు చేసుకున్నాడు. ల‌లిత్ మోడీ తనను ప‌క్కకు పిలిచి.. బెంగ‌ళూరుకే ఆడాల‌ని బెదిరించాడు. కాంట్రాక్ట్‌పై సంత‌కం పెట్ట‌కుంటే తన కెరీర్ నాశ‌నం చేస్తాన‌ని భ‌య‌పెట్టాడని ప్రవీణ్ వెల్లడించాడు.