భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఆసియా కప్ కోసం కొత్త క్రికెట్ కిట్‌ను పొందిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. భారత జట్టు కొత్త జెర్సీ ఎలా ఉంటుందో తెలిపే ఫోటోను కూడా రవీంద్ర జడేజా షేర్ చేశాడు. ఆగస్ట్ 27వ తేదీ నుంచి సెప్టెంబర్ 11వ తేదీ వరకు జరగనున్న ఆసియా కప్ కోసం ఈ కొత్త జెర్సీని ఆవిష్కరించారు. ఈ టోర్నమెంట్ యూఏఈలో జరగనుంది.


ఆసియా కప్‌లో టీమిండియా తొలి మ్యాచ్‌ పాకిస్తాన్‌తో తలపడనుంది. ఆగస్టు 28వ తేదీన ఈ మ్యాచ్ జరగనుంది. రెండో మ్యాచ్‌లో ఆగస్టు 31న హాంకాంగ్‌తో ఆడనుంది. భారత జట్టు దుబాయ్ చేరుకున్న తర్వాత  ప్రాక్టీస్ కూడాప్రారంభించింది. ఈ ప్రాక్టీస్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈరోజు సాయంత్రం కూడా భారత జట్టు ప్రాక్టీస్ సెషన్ నిర్వహించింది.


శనివారం నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్‌కు భారత జట్టు తాత్కాలిక ప్రధాన కోచ్‌గా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌ను బీసీసీఐ నియమించింది. కోవిడ్ పాజిటివ్ వచ్చిన కారణంగా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ యూఏఈకి వెళ్లలేకపోతున్నాడు. దీంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టుతో వీవీఎస్ లక్ష్మణ్ ఇప్పటికే చేరాడు. జింబాబ్వేలో ఇటీవల ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో లక్ష్మణ్ భారత జట్టుకు కోచ్‌గా పనిచేశాడు.