పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ 1990లలో భారత్ తో మ్యాచ్ లో జరిగిన ఒక సంఘటనను గుర్తుచేసుకున్నాడు. 1986 ఆస్ట్రల్-ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో పాకిస్థాన్.. భారత్ పై ఒక వికెట్ తేడాతో గెలుపొందింది. ఆ సందర్భంగా తమ డ్రెస్సింగ్ రూములో జరిగిన విషయాన్ని అక్రమ్ పంచుకున్నాడు. 


చివరి బంతికి సిక్స్


ఆ మ్యాచ్ లో తాము చివరి బంతికి విజయం సాధించామని వసీం అక్రమ్ గుర్తుచేశాడు. చివరి ఓవర్ చివరి బంతికి 4 పరుగులు అవసరం కాగా.. చేతన్ శర్మ బౌలింగ్ లో జావెద్ మియాందాద్ సిక్స్ బాది తమ జట్టును గెలిపించాడని చెప్పారు. అయితే ఆ ఉత్కంఠ క్షణాల్లో తమ జట్టు సభ్యులు ఇద్దరు కన్నీరు పెట్టుకున్నారని ఈ బౌలింగ్ దిగ్గజం వెల్లడించాడు. 


ఏడిస్తే మ్యాచులు గెలవలేం కదా


అప్పటికి కుర్రాళ్లుగా ఉన్న జకీర్ ఖాన్, మోక్సిన్ కమల్ లు టెన్షన్ తట్టుకోలేక ఏడ్చారని తెలిపాడు. తాను రనౌట్ అయ్యాక తౌసీఫ్ అహ్మద్ క్రీజులోకి సింగిల్ తీసి జావెద్ కు స్ట్రైకింగ్ ఇచ్చాడని పేర్కొన్నాడు. అప్పటినుంచి వారిద్దరూ ఏడుస్తూ ఉన్నారన్నాడు.  అప్పటికి వారు తుది జట్టులో లేరని ఎందుకు ఏడుస్తున్నారని అడగ్గా.. మనం ఎలాగైనా ఈ మ్యాచ్ గెలిచి తీరాలని చెప్పినట్టు అక్రమ్ వివరించాడు. 'ఏడిస్తే మ్యాచ్ గెలుస్తామనుకుంటే నేను మీతో పాటు ఏడుస్తాను. కానీ అలా జరగదు కదా. ఒక్కసారి మియాందాద్ బ్యాటుకు బంతి కనెక్ట్ అవుతుందని నేను ఆశిస్తున్నాను అని వారితో చెప్పాను' అని అక్రమ్ తెలిపాడు. 


ఈ ఆదివారం (ఆగస్టు 28) ఆసియా కప్ లో చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్తాన్ ల మధ్య మ్యాచ్ జరగనుంది. గతేడాది టీ20 ప్రపంచకప్ లో భారత్ ను పాక్ 10 వికెట్ల తేడాతో ఓడించిన తర్వాత.. వీరి మధ్య పోరు జరగడం ఇదే తొలిసారి. రాజకీయ ఉద్రిక్తతల కారణంగా భారత్, పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరగడంలేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. 


ఆసియా కప్ టోర్నమెంట్ సందర్భంగా ఇరుజట్ల మాజీ ఆటగాళ్లు తమ పాత జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. చిరస్మరణీయ, మరచిపోలేని మ్యాచ్ ల గురించి క్రికెట్ ప్రేమికులకు గుర్తుచేస్తున్నారు. ఈ ఓటమి తమ విశ్వాసంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిందని.. భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ చెప్పారు. అది గుర్తు వచ్చినప్పుడల్లా నిద్రలేని రాత్రులు గడిపానని తెలిపారు.