Asia Cup 2022: ఆగస్టు 27న ప్రారంభమయ్యే ఆసియా కప్ కోసం భారత క్రికెట్ జట్టు దుబాయ్ లో అడుగుపెట్టింది. టీమిండియాతో పాటు పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ ఆటగాళ్లు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. ఆగస్టు 28న భారత్, పాక్ తో మ్యాచ్ ఆడనుంది. అందరి కళ్లు ఈ మ్యాచ్ పైనే ఉన్నాయి. ఇదిలా ఉంటే దుబాయ్ లో భారత్, పాక్ ఆటగాళ్లు కలుసుకున్నారు. ఆఫ్ఘాన్ జట్టు ఆటగాళ్లు భారత జట్టుతో మాట కలిపింది. హార్దిక్ పాండ్య, యుజ్వేంద్ర చాహల్... రషీద్ ఖాన్, మహ్మద్ నబిలతో సంభాషించారు. అలాగే భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, పాక్ నాయకుడు బాబర్ ఆజాంతో మాట కలిపాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. 


ఇటీవల ఫామ్ ను బట్టి చూస్తే పాక్ కెప్టెన్ బాబర్ అజాం అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లీ ఫామ్ కోసం తంటాలు పడుతున్నాడు. వీరిద్దరి మధ్య పోలికలు చాలా ఏళ్ల క్రితం ప్రారంభమైనా.. ఆసియా కప్ నేపథ్యంలో అవి మరింత ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో వీరిద్దరూ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. 


ఆసియా కప్ లో పాకిస్థాన్ తో తలపడే ముందు కోహ్లీ స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడాడు. తన ప్రస్తుత ఫామ్ ను 2014లో ఇంగ్లండ్ పర్యటనతో పోల్చాడు. ఇంగ్లండ్ లో తన వైఫల్యాలకు కారణముందని.. అయితే ప్రస్తుతం పరుగులు చేయకపోవడం తనకు ఆందోళన కలిగించడం లేదని చెప్పాడు. ఎందుకంటే తాను బ్యాటింగ్ బాగా చేయగలనని భావించినప్పుడు బాగా ఆడగలనని అన్నాడు. 


ఇంగ్లండ్ లో ఏం జరిగిందనేది అప్రస్తుతమని.. తాను ఆ వైఫల్యం నుంచి బయటకు రావడానికి శ్రమిస్తున్నట్లు ఈ మాజీ కెప్టెన్ చెప్పాడు. పదేపదే ఒకే విధంగా ఔటయ్యే బలహీనతను అధిగమించాల్సి ఉందని.. దానిపైనే ఇప్పుడు దృష్టి పెట్టినట్లు తెలిపాడు. బాగా ఆడతానని తనకు అనిపించినప్పుడు అంతా సవ్యంగానే ఉంటుందని.. తాను ఒకసారి ఫాంలోకి వస్తే బాగా బ్యాటింగ్ చేయగలనని చెప్పుకొచ్చాడు. అయితే ఇంగ్లండ్ సిరీస్ లో తనకలా అనిపించలేదని చెప్పాడు. 


ఈ మధ్య కాలంలో కోహ్లీ తన బ్యాటింగ్ వైఫల్యం కారణంగా చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. దాదాపు మూడేళ్లుగా సెంచరీ చేయలేదు. అప్పుడప్పుడు అర్ధశతకాలు సాధిస్తున్నా విరాట్ స్థాయికి తగ్గ ప్రదర్శన మాత్రం చేయడంలేదు. దీనిపై స్టార్ స్పోర్ట్స్ షో గేమ్ ప్లాన్ లో విరాట్ మాట్లాడాడు. తన ఆట ఎలా ఉంటుందో తనకు తెలుసునని కోహ్లీ విమర్శకులకు బదులిచ్చాడు. వివిధ పరిస్థితులలో ఆడడం, రకరకాల బౌలింగ్ లను ఎదుర్కోవడం లాంటి సామర్థ్యం లేకుండా తాను అంతర్జాతీయ క్రికెట్ లో ఇంత దూరం రాలేదని తెలిపాడు.