ODI World Cup 2011: టీమిండియా వన్డే వరల్డ్‌ కప్‌ విజయానికి 13 ఏళ్లు పూర్తయింది. భారత క్రికెట్‌ జట్టు తొలిసారిగా 1983లో వన్డే వరల్డ్‌ కప్‌ను కపిల్‌దేవ్‌ నేతృత్వంలో సాధించింది. సుమారు 28 ఏళ్ల నిరీక్షణ తరువాత మహేంద్ర సింగ్‌ ధోనీ సారథ్యంలోని భారత్‌ జట్టు 2011లో ఏప్రిల్‌ రెండో తేదీన(సరిగ్గా ఇదే రోజు) రెండో వరల్డ్‌ కప్‌ సాధించి కోట్లాది మంది క్రికెట్‌ అభిమానుల చిరకాల వాంఛను నెరవేర్చింది. ఈ విజయంతో భారత్‌ రెండోసారి వరల్డ్‌ కప్‌ను దక్కించుకున్నట్టు అయింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో నాలుగు వికెట్లతో తేడా భారత్‌ జట్టు విజయాన్ని నమోదు చేసింది. ఫైనల్‌ మ్యాచ్‌లో గౌతమ్‌ గంభీర్‌(97), కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ(91) పరుగులు చేయడం ద్వారా జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించి పెట్టారు. 











అద్భుత ప్రదర్శనతో విజయం


ఫైనల్‌ మ్యాచ్‌లో శ్రీలంకతో భారత్‌ జట్టు తలపడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలకం జట్టు ఆరు వికెట్ల నష్టానికి 274 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. ఆ జట్టులోని కీలక ఆటగాళ్లు రాణించడంతో భారత్‌ ముందు భారీ లక్ష్యాన్ని శ్రీలంక ఉంచగలిగింది. శ్రీలంక జట్టులోని ఓపెన్‌ తిలకరత్న దిల్షాన్‌ 33 (49), కెప్టెన్‌ కుమార సంగక్కర 48(67) పరుగులు చేయగా, మిడిలార్డర్‌ బ్యాట్సమెన్‌ మహేల జయవర్ధనే అద్భుతమైన శతకంతో జట్టు భారీ స్కోర్‌ సాధనకు దోహదపడ్డాడు. 88 బంతులు ఆడిన జయవర్ధనే 13 ఫోర్ల సహాయంతో 103 పరుగులు సాధించాడు. ఆ తరువాత వచ్చిన తిలాన్‌ సమరవీర 21(34), నువాన్‌ కుల శేఖర 32(30), తిశార పెరీర 22(9) రాణించడంతో శ్రీలంక జట్టు మెరుగైన స్కోర్‌ను సాధించగలిగింది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు జహీర్‌ ఖాన్‌ రెండు, యువరాజ్‌ సింగ్‌ రెండు, హర్బజన్‌ సింగ్‌ ఒక వికెట్‌ సాధించారు.



భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ జట్టుకు తొలి ఓవర్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. వరల్డ్‌ కప్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తూ జట్టు విజయంలో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చిన ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ 0(2) పెవిలియన్‌ చేరడంతో జట్టు కష్టాల్లో పడింది. మంచి ఫామ్‌లో ఉన్న సచిన్‌ టెండుల్కర్‌ కూడా 18(14) బంతుల్లో కొద్దిసేపటికే నిష్క్రమించడంతో జట్టుకు కష్టాలు మొదలయ్యాయి.


ఈ దశలో క్రీజులోకి వచ్చిన గౌతమ్‌ గంభీర్‌ 97(122), విరాల్‌ కోహ్లీ 35(49) జట్టును విజయం దిశగా నడిపించారు. వీరిద్దరూ 83 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ద్వారా జట్టుకు బలమైన పునాదిని వేశారు. కోహ్టీ ఔట్‌ అయిన తరువాత క్రీజులోకి వచ్చిన ధోనీతో కలిసి గంభీర్‌ జట్టును విజయం వైపు తీసుకెళ్లారు. ధోనీ 91(79) పరుగులు చేసి జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. గంభీర్‌ ఔట్‌ అయిన తరువాత క్రీజులోకి వచ్చిన యువరాజ్‌ సింగ్‌ 21(24) పరుగులు జట్టు చారిత్రాత్మక విజయాన్ని దోహదం చేశాయి. శ్రీలకం బౌలర్లలో లసిత్‌ మలింగ రెండు, తిశార పెరీర, తిలకరత్న దిల్షాన్‌ ఒక్కో వికెట్‌ సాధించారు. 


 



28 ఏళ్ల తరువాత సాకారమైన కల


కపల్‌ దేవ్‌ నేతృత్వంలోని భారత్‌ జట్టు 1983లో తొలి వన్డే వరల్డ్‌ కప్‌ సాధించింది. ఆ తరువాత నుంచి వన్డే వరల్డ్‌ కప్‌ కోసం భారత్‌ ఆశగా ఎదురు చూస్తూనే ఉంది. 2011లో విజయం సాధించడం ద్వారా సుమారు 28 ఏళ్ల తరువాత భారత్‌ వన్డే వరల్డ్‌ కప్‌ కల నెరవేరినట్టు అయింది. ఈ వరల్డ్‌ కప్‌ విజయాన్ని క్రికెట్‌ గాడ్‌గా చెప్పుకునే సచిన్‌ టెండుల్కర్‌కు బహుమతిగా భారత్‌ జట్టు అందించినట్టు అయింది.


సచిన్‌ ఈ వరల్డ్‌ కప్‌ తరువాత రిటైర్మెంట్‌ అవుతానని ప్రకటించడం.. అదే వరల్డ్‌ కప్‌ను గెలిచి భారత్‌ జట్టు టెండుల్కర్‌కు బహుమతిగా అందించినట్టు అయింది. మ్యాచ్‌ అనంతరం టీమ్‌ సభ్యులు టెండుల్కర్‌ను భుజాలపై పెట్టుకుని స్టేడియం మొత్తం తిప్పడం ద్వారా క్రికెట్‌ లెజెండ్‌కు ఘనమైన వీడ్కోలును అందించినట్టు అయింది. 









తప్పని నిరీక్షణ


2011 వరల్డ్‌ కప్‌ విజయం తరువాత భారత్‌కు నిరీక్షణ తప్పడం లేదు. 2015, 2019లో వన్డే వరల్డ్‌ సెమీ ఫైనల్‌లో భారత్‌ జట్టు ఓటమి పాలైంది. 2015లో ఆస్ర్టేలియాపై ఓడిన భారత్‌ జట్టు, 2019లో న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి పాలైంది. 2023లో జరిగిన వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో భారత్‌ జట్టు ఓటమి పాలైంది. ఈ మూడు సార్లు భారత్‌ అద్వీతీయమైన ప్రదర్శనతో కప్‌ గెలుస్తుందన్న భావనను అభిమానులకు కలిగించింది. కానీ, దురదృష్టవశాత్తు కప్‌ను చేజిక్కించుకోలేకపోయింది. గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో భారత్‌ ఆస్ర్టేలియాలో చేతిలో ఓటమి పాలైంది. దీంతో వన్డే వరల్డ్‌ కప్‌ విజయాని మరింత కాలం నిరీక్షించక తప్పని పరిస్థితి ఏర్పడింది. 13 ఏళ్లుగా వన్డే వరల్డ్‌ కప్‌ కోసం భారత్‌ నిరీక్షిస్తోంది. 2011 వన్డే వరల్డ్‌ కప్‌ విజయం తరువాత మరో ఐసీసీ ట్రోఫీని భారత్‌ సాధించలేకపోవడం గమనార్హం.