స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌లో రోహిత్‌ సేన వరుస విజయాలతో ఊపు మీదుంది. టాపార్డర్‌ పరుగుల వరద పారిస్తుండడం.. బౌలర్లు తమ పాత్రను సమర్థంగా పోషిస్తుండడంతో ఆడిన అయిదు మ్యాచుల్లోనూ విజయం సాధించి ప్రపంచకప్‌ కల సాకరం దిశగా పయనిస్తోంది. ఈ నెల 29న తన తర్వాతి మ్యాచ్‌లో టీమిండియా ఇంగ్లండ్‌తో తలపడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌పై విజయం సాధించి 2019 ప్రపంచకప్‌లో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. అయితే టీమిండియా ప్రపంచకప్‌లో అద్భుతంగా ముందుకు సాగుతున్న వేళ టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోనీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ ఏడాది కప్పు మనదే అని విశ్వాసం వ్యక్తం చేశాడు. ధోని చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 


 ప్రస్తుత భారత జట్టు చాలా బ్యాలెన్స్‌గా కనిపిస్తోందని ధోనీ అన్నాడు. ఆటగాళ్లు అందరూ పూర్తి సహకారాన్ని అందిస్తున్నారని, అంతా బాగానే ఉందన్నాడు. తాను ఇంతకు మించి ఏమీ చెప్పబోనని వ్యాఖ్యానించాడు. తెలివైన వారికి తన సంకేతం అర్థమవుతుందని చెప్పాడు. 2019లో సెమీస్‌లో ఓడిపోవడం ఇప్పటికీ బాధిస్తోందని, ఆ టైమ్‌లో ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసుకోవడం కూడా కష్టమేనని ధోనీ అన్నాడు. టీమిండియా తరఫున అదే నా లాస్ట్ మ్యాచ్ అని నిర్ణయించుకున్నానని, కానీ అప్పటికే నా మైండ్‌లో వీడ్కోలు చెప్పాలని భావించానని. కానీ ఏడాది తర్వాత ప్రకటించానని ధోనీ చెప్పుకొచ్చాడు. భారత ఆటగాళ్లు బాగా ఆడుతున్నారన్న ధోనీ కామెంట్స్‌తో టీమిండియా ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. గత 12 లేదా 15 ఏళ్లుగా క్రికెట్‌ ఆడిన తర్వాత ఇక దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం లేదని తెలిసినప్పుడు భావోద్వేగాలు తన్నుకొస్తాయని ధోనీ అన్నాడు. కామన్వెల్త్‌ క్రీడలు, ఒలింపిక్స్‌, మరోవైపు ఐసీసీ టోర్నీలు.. ఇలా ఏ క్రీడలోనైనా దేశం తరపున ఆడే అవకాశం కొంతమందికే దొరుకుతుందని.. అదో గొప్ప విషయమని పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా ఐపీఎల్‌లో సీఎస్కే కెప్టెన్‌గా అభిమానులను ధోని అలరిస్తున్నాడు. 


అయితే ఇదే మీడియా సమావశంలో ధోనీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. డిసెంబర్‌లో ఐపీఎల్‌ మినీ వేలం జరుగనున్న నేపథ్యంలో జట్లు రిటైన్‌, రిలీజ్‌ చేసుకునే ఆటగాళ్ల జాబితాను నవంబర్‌ 15లోగా అందజేయాలని బీసీసీఐ.. ఫ్రాంచైజీలకు డెడ్‌ లైన్‌ విధించినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ధోని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనితో యాంకర్‌ ‘మీరు ఇప్పుడు రిటైర్‌ అయ్యారు’ అని అనగానే చెన్నై సారథి కల్పించుకుని.. ‘వన్‌ సెకండ్‌. నేను రిటైర్ అయింది అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి మాత్రమే..’ అని ఆన్సర్‌ ఇచ్చాడు. దీంతో ధోని అభిమానులు.. వచ్చే సీజన్‌లో కూడా తలైవా ఆడతాడని కామెంట్స్‌ చేస్తున్నారు.  టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన ఘనత మహేంద్ర సింగ్‌ ధోని సొంతం. టీ20 ఫార్మాట్లో 2007లో తొలిసారిగా ప్రవేశపెట్టిన వరల్డ్‌కప్‌ ట్రోఫీ గెలచిన ఈ మిస్టర్‌ కూల్‌ కెప్టెన్‌.. 2011లో భారత్‌కు రెండో వన్డే ప్రపంచకప్‌ అందించాడు.


ఆ తర్వాత మళ్లీ చాంపియన్స్‌ ట్రోఫీ రూపంలో 2013లో మరోసారి ప్రతిష్టాత్మక టైటిల్‌ సాధించాడు. ధోని శకం ముగిసిన తర్వాత టీమిండియా మళ్లీ ఇంత వరకు ఐసీసీ టోర్నీ గెలవలేదు. పదేళ్ల తర్వాత సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్‌-2023 రూపంలో మరోసారి టైటిల్‌ గెలిచే అవకాశం ముంగిట నిలిచింది భారత్‌. ట్రోఫీ గెలిచే దిశగా ఇప్పటికే అద్భుతమైన విజయాలతో రోహిత్‌ శర్మ సారథ్యంలోని జట్టు ముందుకు సాగుతోంది.