భారత కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించి నేటికి 15 సంవత్సరాలు పూర్తయ్యాయి. 2007 జూన్ 23వ తేదీన బెల్‌ఫాస్ట్‌లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్ రోహిత్ కెరీర్‌లో మొదటిది. అయితే ఆ మ్యాచ్‌లో రోహిత్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఈ సందర్భంగా రోహిత్ ఒక నోట్‌ను కూడా సోషల్ మీడియాలో విడుదల చేశాడు.
‘అందరికీ హలో, నేను భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసి నేటికి 15 సంవత్సరాలు నిండుతున్నాయి. ఇది చాలా గొప్ప ప్రయాణం. నా జీవితం అంతా దీన్ని గుర్తు పెట్టుకుంటాను. నా ప్రయాణంలో భాగమైన వారందరికీ ధన్యవాదాలు. నేను ఈరోజు ఉన్న ఆటగాడిగా నన్ను తీర్చిదిద్దిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు. క్రికెట్ ప్రేమికులు, అభిమానులు, విమర్శకుల ప్రేమ, మద్దతు కారణంగా జట్టు ఇన్ని అడ్డంకులను అధిగమించింది.’ అని ఆ నోట్‌లో పేర్కొన్నాడు.
మరోవైపు లీచెస్టర్‌షైర్‌తో జరుగుతున్న నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా తడబడింది. రోహిత్ శర్మ (25: 47 బంతుల్లో, మూడు ఫోర్లు), శుభ్‌మన్ గిల్ (21: 28 బంతుల్లో, మూడు ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (0: 11 బంతుల్లో), హనుమ విహారి (3: 23 బంతుల్లో), రవీంద్ర జడేజాలు (13: 13 బంతుల్లో, రెండు ఫోర్లు) రాణించలేకపోయారు. దీంతో టీమిండియా 37.2 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 133 పరుగులు చేయగలిగింది. అయితే ఈ దశలో వర్షం రావడంతో మ్యాచ్ నిలిచిపోయింది. విరాట్ కోహ్లీ (32: 60 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్), కేఎస్ భరత్ (11: 44 బంతుల్లో, ఒక ఫోర్) క్రీజులో ఉన్నారు.