Ind Vs Aus 4Th Test: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ లో భారత మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విఫలమవుతున్న సంగతి తెలిసిందే. మూడు టెస్టులు కలిపి మొత్తం ఐదు ఇన్నింగ్స్ లలో బరిలోకి దిగిన కోహ్లీ.. ఒక పెర్త్ టెస్టు రెండో ఇన్నింగ్స్ లోనే అజేయ సెంచరీ చేశాడు. అదే టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 5 పరుగులు చేసిన కోహ్లీ.. అడిలైడ్ లో వరుసగా 7, 11 పరుగులు చేశాడు. ఇక డ్రాగా ముగిసిన బ్రిస్బేన్ టెస్టులో 3 పరుగులతో ఘోరంగా విఫలమయ్యాడు. పదే పదే ఆఫ్ స్టంప్ దాటి వెళుతున్న బంతిని వేటాడి తను ఔటవుతున్నాడు. ఆసీస్ పేసర్లు పాట్ కమిన్స్, మిషెల్ స్టార్క్, జోష్ హేజిల్ వుడ్, స్కాట్ బోలాండ్ పదే పదే ఆఫ్ స్టంప్ పై ఊరించే బంతులు వేసి కోహ్లీని ఇబ్బంది పెడుతున్నారు. దీంతో పదే పదే ఒకే విధంగా విరాట్ ఔట్ కావడం చూసి అభిమానులు నిరాశ పడుతున్నారు. తాజాగా దీనిపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు.
అధిగమిస్తాడు..
రాబోయే రెండు టెస్టుల్లో కోహ్లీ.. ఆఫ్ స్టంప్ బలహీనతను అధిగమిస్తాడని రోహిత్ విశ్వాసం వ్యక్తం చేశాడు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. కోహ్లీ మోడర్న్ క్రికెట్ లెజెండ్ అని, ఇలాంటి బలహీనతలను ఎలా అధిగమించాలో తనకు తెలుసని వ్యాఖ్యానించాడు. మరోవైపు జట్టు బ్యాటింగ్ ఆర్డర్ గురించి కూడా చర్చించాడు. నిజానికి ఓపెనర్ గా బరిలోకి దిగాల్సిన రోహిత్.. జట్టు అవసరాల రిత్యా ఆరో నెంబర్లో బ్యాటింగ్ చేస్తున్నాడు. దీనిపై స్పందిస్తూ, జట్టుకు ఏది మంచిది అనిపిస్తుందో దాన్నే చేస్తామని పేర్కొన్నాడు. బ్యాటింగ్ ఆర్డర్ కూర్పు గురించి టీమ్ మేనేజ్మెంట్ కు అవగాహన ఉందని చెప్పుకొచ్చాడు. మరోవైపు అంతగా ఆకట్టుకోని రిషభ్ పంత్, యశస్వి జైస్వాల్, శుభమాన్ గిల్ గురించి మాట్లాడాడు. జట్టులో ఎవరి నుంచి ఏం కావాలో స్పష్టంగా తెలుసని, ఎక్కువగా మాట్లాడి వారిపై ఒత్తిడి పెట్టబోమని తెలిపాడు. చిన్న చిన్న మార్పులు మాత్రం సూచిస్తామని వెల్లడిచాడు.
బుమ్రా భేష్..
ఇక ఈ సిరీస్ లో సత్తా చాటుతున్న స్పీడ్ స్టర్ జస్ప్రీత్ బుమ్రాపై రోహిత్ ప్రశంసలు కురిపించాడు. జట్టుకు ఏం కావాలో బుమ్రాకు తెలుసని, తనతో ఈ విషయాన్ని ఎవరు పంచుకోవాల్సిన అవసరం లేదని తెలిపాడు. జట్టుకు అవసరమైనప్పుడల్లా తన ప్రణాళికలతో వికెట్లు తీయడం బుమ్రాకు అలవాటుగా మారిందని కొనియాడాడు. ఫీల్డులో బౌలింగ్ కు సంబంధించి బుమ్రాకు తానేమీ సూచనలు చేయబోనని, పరిస్థితులకు తగినట్లుగా అతనే బౌలింగ్ చేస్తాడని పేర్కొన్నాడు. అతనో అద్భుతమైన బౌలరని కితాబిచ్చాడు. ఈనెల 26 నుంచి ఇరు జట్ల మధ్య నాలుగోదైన బాక్సింగ్ డే టెస్టు మెల్ బోర్న్ వేదికగా జరగబోతోంది. సిరీస్ లో తొలి మ్యాచ్ ను భారత్ నెగ్గగా, రెండో మ్యాచ్ ను ఆసీస్ కైవసం చేసుకుంది. మూడో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
Also Read: Pujara Comments: టీమిండియా అందులో బలహీనంగా ఉంది.. సరి చేసుకుంటేనే సిరీస్ లో ముందంజ