India Wicket Keeper T20 WC: వచ్చే నెలలో జరిగే టీ20 ప్రపంచకప్ కోసం భారత వికెట్ కీపర్లు రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్ ఇద్దరూ ఎంపికయ్యారు. అయితే ఇటీవల జరిగిన సిరీసుల్లో వారిద్దరు అంతగా రాణించలేదు. కొన్ని మ్యాచుల్లో పంత్ కు, మరికొన్నింటిలో కార్తీక్ కు జట్టు యాజమాన్యం అవకాశాలు ఇచ్చింది. అయితే వాటిని వారు పూర్తిగా సద్వినియోగం చేసుకోలేదు. ఇక ప్రపంచకప్ తుది జట్టులో ఎవరిని తీసుకోవాలి అనే దానిపై కోచ్, కెప్టెన్ తర్జన భర్జనలు పడుతున్నారు. ఈ క్రమంలో పంత్, కార్తీక్ లలో ఎవరు జట్టులో ఉంటే మేలు అనే దానిపై దిగ్గజ క్రికెటర్లు గావస్కర్, మాథ్యూ హేడెన్ తమ అభిప్రాయాలు వెల్లడించారు.
ఇటీవల ముగిసిన ఆసియా కప్ లో మొదట దినేశ్ కార్తీక్ ను జట్టులోకి తీసుకున్నారు. తర్వాత రవీంద్ర జడేజా గాయపడటంతో.. ఎడమచేతి వాటం బ్యాట్స్ మెన్ కోసం పంత్ జట్టులోకి వచ్చాడు. అయితే వచ్చిన అవకాశాలను వారిరువురూ సరిగ్గా వినియోగించుకోలేదు. ఒక్కోసారి ఇద్దరూ జట్టులో ఉంటున్నారు.
ఇద్దరూ ఉండాలి
దీనిపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ స్పందించారు. టీ20 ప్రపంచకప్ తుది జట్టులో పంత్, కార్తీక్ ఇద్దరినీ తీసుకోవాలని గావస్కర్ అభిప్రాయపడ్డారు. హార్దిక్ పాండ్య 5వ స్థానంలో, పంత్ 6, ఏడో స్థానంలో కార్తీక్ ను బ్యాటింగ్ కు పంపాలని సూచించారు. పరిస్థితులను బట్టి పాండ్య కన్నా ముందు పంత్ ను పంపాలని అన్నాడు. పంత్ బ్యాటింగ్ పైనా గావస్కర్ స్పందించాడు. రిషభ్ పంత్ తన ఆఫ్ సైడ్ గేమ్ ను మెరుగపరచుకోవాలని సూచించాడు. హార్దికా పాండ్యలాగా పేస్ ఉపయోగించి ఆప్ సైడ్ సిక్సర్లు కొట్టే నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పాడు.
పంత్ అయితే మేలు
అయితే హెడెన్ మాత్రం రిషభ్ పంత్ తుది జట్టులో ఉండాలని అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియాలోని పెద్ద మైదానాలకు పంత్ ఆట సరిపోతుందని అన్నారు. పంత్ పవర్ హిట్టిింగ్ చేయగలడు. ఆసీస్ లోని పెద్ద గ్రౌండ్స్ లో బంతిని రోప్ దాటించాలంటే హిట్టింగ్ చేయగల పంత్ లాంటి ఆటగాడు ఉండాలి. దినేశ్ కార్తీక్ మంచి ఆటగాడు. పిచ్ లోని పేస్ ను ఉపయోగించుకుని అద్భుతంగా ఆడగలడు. అయితే పెద్ద మైదానాల్లో సిక్సర్లు కొట్టాలంటే పవర్ హిట్టర్లు కావాలి. అందుకు పంత్ సరైనవాడు. ముఖ్యంగా స్వ్కేర్ ఆఫ్ వికెట్ పై రిషభ్ చాలా కీలకం. పంత్ కు బహుముఖ ప్రజ్ఞ ఉంది. అందుకే తుది జట్టులో అతడిని తీసుకోవాలని ఈ ఆసీస్ దిగ్గజం సూచించాడు.