Sunil Gavaskar on Rohit Sharma: టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మపై సునిల్‌ గావస్కర్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. కొలిచినట్టుగా బ్యాటింగ్‌ చేసిన అతడి అప్రోచ్‌ బాగుందని మెచ్చుకున్నాడు. చక్కని షాట్లతో కీలకమైన మ్యాచులో జట్టును గెలిపించాడని పేర్కొన్నాడు. తన శైలికి విరుద్ధంగా మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడొద్దని స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియాతో రెండో టీ20 తర్వాత సన్నీ మీడియాతో మాట్లాడాడు.


'రోహిత్‌ శర్మ కొలిచినట్టు ఆడటం మీరు చూశారు. అతనెక్కడా బంతుల్ని డిఫెండ్‌ చేస్తున్నట్టు అనిపించలేదు. చాలా కచ్చితత్వంతో ఎంచుకొని మరీ షాట్లు కొట్టాడు. ఫ్లిక్‌ షాట్లు, స్వివెల్‌ పుల్‌ షాట్లు చక్కగా ఆడాడు. వాటిని అతడు సౌకర్యవంతంగా ఆడతాడు. ఆఫ్‌సైడ్‌ ఆడినప్పుడే ఇబ్బంది పడుతున్నాడు. ఫీల్డర్ల మీదుగా ఆఫ్‌సైడ్‌ స్టాండ్స్‌లోకి పంపించే ప్రయత్నంలో క్యాచులు ఇస్తున్నాడు. దానిని సరిచేసుకుంటే చాలు' అని సునిల్‌ గావస్కర్‌ అన్నాడు.






'తనకిష్టమైన జోన్‌లో బంతిని బాదేస్తుంటే ఎలాంటి సమస్యలు కనిపించడం లేదు. రోహిత్ నిజంగా ఆడాల్సింది ఇలాగే. రెండో టీ20లో కొలిచినట్టుగా ఆడాడు. బంతి కోసం ఎదురు చూశాడు. కట్‌ చేశాడు. పుల్‌ చేశాడు. వచ్చిన బంతిని వచ్చినట్టుగా బాదేయలేదు. ఈ రోజు హిట్‌మ్యాన్‌ చక్కగా బ్యాటింగ్‌ చేయడానికి కారణమిదే' అని గావస్కర్‌ పేర్కొన్నాడు.


కొన్నాళ్లుగా రోహిత్‌ శర్మ ఆశించిన రీతిలో విజయవంతం అవ్వడం లేదు. దూకుడుగా ఆడే క్రమంలో త్వరగా ఔటైపోతున్నాడు. లెగ్‌ స్పిన్నర్లు, మీడియం పేసర్ల బౌలింగ్‌లో భారీ షాట్లకు ప్రయత్నించి లాంగాన్‌, డీప్‌ మిడ్‌ వికెట్లో క్యాచులు ఇస్తున్నాడు. తన సహజ శైలికి భిన్నంగా దూకుడు ఆడే అప్రోచ్‌ మంచిది కాదని చాలామంది విమర్శించారు. రెండో టీ20లో తనకు ఇష్టమైన పద్ధతిలోనే ఆడి రన్స్‌ సాధించాడు. 8 ఓవర్లకు కుదించిన మ్యాచులో 20 బంతుల్లో 46తో అజేయంగా నిలిచాడు.


రెండో టీ20 హైలైట్స్


ఆస్టేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఎనిమిది ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి  90 పరుగులు సాధించింది. అనంతరం టీమిండియా 7.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఆరు వికెట్లతో భారత్ గెలిచింది. హైదరాబాద్‌లో జరగనున్న మూడో టీ20 రసవత్తరంగా జరగనుంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను ఎనిమిది ఓవర్లకు కుదించారు.


అదరగొట్టిన హిట్‌మ్యాన్
92 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు మెరుపు ఆరంభం లభించింది. మొదటి ఓవర్లో రోహిత్ శర్మ (46 నాటౌట్: 20 బంతుల్లో, నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) రెండు సిక్సర్లు, కేఎల్ రాహుల్ (10: 6 బంతుల్లో, ఒక సిక్సర్) ఒక సిక్సర్ కొట్టారు. దీంతో మొదటి ఓవర్లోనే 20 పరుగులు వచ్చాయి. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (11: 6 బంతుల్లో, రెండు ఫోర్లు) ఉన్నది కాసేపే అయినా బంతులు వృథా చేయకుండా వేగంగా ఆడారు.


ఒకవైపు మిగతా బ్యాటర్లు వచ్చి వెళ్తున్నా మరో ఎండ్‌లో రోహిత్ శర్మ చాలా వేగంగా ఆడాడు. చివరి ఓవర్లో తొమ్మిది పరుగులు కావాల్సి ఉండగా, దినేష్ కార్తీక్ (10 నాటౌట్: రెండు బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) ఒక ఫోర్, సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడం జంపా మూడు వికెట్లు, ప్యాట్ కమిన్స్ ఒక వికెట్ దక్కించుకున్నారు.