ఆస్టేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఎనిమిది ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 90 పరుగులు సాధించింది. అనంతరం టీమిండియా 7.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఆరు వికెట్లతో భారత్ గెలిచింది. హైదరాబాద్‌లో జరగనున్న మూడో టీ20 రసవత్తరంగా జరగనుంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను ఎనిమిది ఓవర్లకు కుదించారు.
అదరగొట్టిన హిట్‌మ్యాన్
92 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు మెరుపు ఆరంభం లభించింది. మొదటి ఓవర్లో రోహిత్ శర్మ (46 నాటౌట్: 20 బంతుల్లో, నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) రెండు సిక్సర్లు, కేఎల్ రాహుల్ (10: 6 బంతుల్లో, ఒక సిక్సర్) ఒక సిక్సర్ కొట్టారు. దీంతో మొదటి ఓవర్లోనే 20 పరుగులు వచ్చాయి. కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (11: 6 బంతుల్లో, రెండు ఫోర్లు) ఉన్నది కాసేపే అయినా బంతులు వృథా చేయకుండా వేగంగా ఆడారు.
ఒకవైపు మిగతా బ్యాటర్లు వచ్చి వెళ్తున్నా మరో ఎండ్‌లో రోహిత్ శర్మ చాలా వేగంగా ఆడాడు. చివరి ఓవర్లో తొమ్మిది పరుగులు కావాల్సి ఉండగా, దినేష్ కార్తీక్ (10 నాటౌట్: రెండు బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) ఒక ఫోర్, సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడం జంపా మూడు వికెట్లు, ప్యాట్ కమిన్స్ ఒక వికెట్ దక్కించుకున్నారు.
రాణించిన ఆరోన్ ఫించ్, వేడ్
అంతకు ముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆశించిన శుభారంభం లభించలేదు. ఓపెనర్ కామెరాన్ గ్రీన్ (5: 4 బంతుల్లో, ఒక ఫోర్), ఆ తర్వాత వచ్చిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ (0: 1 బంతి), టిమ్ డేవిడ్ (2: 3 బంతుల్లో) విఫలం కావడంతో ఆస్ట్రేలియా 3.1 ఓవర్లలో 31 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఉన్నంత సేపు దూకుడుగా ఆడిన మరో ఓపెనర్, కెప్టెన్ ఆరోన్ ఫించ్ (31: 15 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) కూడా కాసేపటికే అవుటయ్యాడు.
అయితే చివరి ఓవర్లలో మాథ్యూ వేడ్ (43 నాటౌట్: 20 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు) చెలరేగిపోయాడు. మూడు సిక్సర్లతో 19 పరుగులు రాబట్టాడు. దీంతో ఆస్ట్రేలియా 8 ఓవరల్లో ఐదు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ రెండు వికెట్లు, జస్‌ప్రీత్ బుమ్రాకు ఒక వికెట్ దక్కింది. అక్షర్ పటేల్ పొదుపుగా బౌలింగ్ చేశాడు. రెండు ఓవర్లలో కేవలం 13 పరుగులే చేసి రెండు వికెట్లు తీసుకున్నాడు.