IND vs AUS 2nd T20: క్రికెట్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌! భారత్‌, ఆస్ట్రేలియా రెండో టీ20 మ్యాచ్‌ టాస్‌ ఆలస్యం కానుంది. వర్షం రావడమే ఇందుకు కారణం. సాధారణంగా సాయంత్రం 6:30 గంటలకే టాస్‌ వేస్తారు. మైదానం చిత్తడిగా ఉండటంతో అంపైర్లు ఆలస్యంగా టాస్‌ వేయాలని నిర్ణయించారు. రాత్రి 7 గంటలకు పిచ్‌ను తనిఖీ చేశాక తుది నిర్ణయం తీసుకుంటారు.






నాగ్‌పుర్‌లో రెండు రోజుల నుంచి వర్షం కురుస్తూనే ఉంది. అడపా దడపా చిరు జల్లులు కురుస్తూనే ఉన్నాయి. మ్యాచ్‌ రోజైన శుక్రవారం ఎక్కువ వర్షం కురిసేందుకు అవకాశం లేదని వాతావరణ నిపుణులు అంటున్నారు. అయితే మ్యాచ్‌ జరిగేటప్పుడు చిరు జల్లులు పలకరిస్తాయని తెలుస్తోంది.


IND vs AUS, 1st T20 Match Highlights: మొహాలిలో టీమ్‌ఇండియాకు ఓటమి ఎదురైంది! అచొచ్చిన మైదానంలో క్యాచ్‌డ్రాప్‌లు హిట్‌మ్యాన్‌ సేన కొంప ముంచాయి. గెలవాల్సిన మ్యాచును చేజేతులా నేలపాలు చేశాయి. ఫీల్డింగ్‌లో ఎన్నడూ లేనంతగా విఫమవ్వడంతో 209 పరుగుల భారీ టార్గెట్‌ను ఆసీస్‌ సునాయాసంగా ఛేదించేసింది. మ్యాచ్ ఫినిషర్‌ కామెరాన్‌ గ్రీన్‌ (61; 30 బంతుల్లో 8x4, 4x6) ఓపెనింగ్‌లో అదరగొట్టాడు. ఆఖర్లో మాథ్యూవేడ్‌ (45*; 21 బంతుల్లో 6x4, 2x6) భారీ సిక్సర్లతో కంగారూలకు విజయం అందించాడు. అంతకు ముందు టీమ్‌ఇండియాలో కేఎల్‌ రాహుల్‌ (55; 35 బంతుల్లో 4x4, 3x6), సూర్యకుమార్‌ యాదవ్‌ (46; 25 బంతుల్లో 2x4, 4x6), హార్దిక్‌ పాండ్య (71*; 30 బంతుల్లో 7x4, 5x6) రాణించారు.


3 లైఫులతో 'గ్రీన్‌'కు సిగ్నల్‌


మొహాలిలో ఛేదన సులభంగా ఉంటుంది! ఆసీస్‌లో సూపర్‌ బ్యాటర్లు ఉన్నారు. అయినా 209 టార్గెట్‌ కావడంతో టీమ్‌ఇండియా గెలుస్తుందని అభిమానులు నమ్మారు. క్యాచులే మ్యాచులను గెలిపిస్తాయన్న సింపుల్‌ ఫార్ములానూ మర్చిపోయిన హిట్‌మ్యాన్‌ సేన వారి నమ్మకాన్ని వమ్ము చేసింది. ఏకంగా మూడు క్యాచులను నేలపాలు చేసి మ్యాచును వదిలేసింది. భారీ టార్గెట్‌ కావడంతో ఆసీస్‌ ఎక్కడా రన్‌రేట్‌ తగ్గకుండా బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్‌ ఆరోన్‌ ఫించ్‌ (22), గ్రీన్‌ కలిసి తొలి వికెట్‌కు 39 రన్స్‌ భాగస్వామ్యం అందించారు.


ఆ తర్వాత స్టీవ్‌ స్మిత్‌ (35)తో కలిసిన గ్రీన్‌ జట్టు స్కోరును పవర్‌ ప్లే ముగిసే సరికి 60, 9.2 ఓవర్లకు 100కు చేర్చాడు. గ్రీన్‌కు మొత్తం 3 లైఫుల్‌ వచ్చాయి. ఒకసారి ఎల్బీ కోరలేదు. రెండు క్యాచ్‌లు డ్రాప్‌ చేశారు. ఈ క్రమంలో 2 ఓవర్ల వ్యవధిలోనే గ్రీన్‌, స్మిత్‌, మాక్సీ (1) ఔటౌనా టిమ్‌ డేవిడ్‌ (18), మాథ్యూ వేడ్‌ నిలిచారు. లెగ్‌సైడ్‌ దూకుడుగా ఆడే వేడ్‌కు టీమ్‌ఇండియా బౌలర్లు అటువైపే వేసి మరీ బౌండరీలు కొట్టించారు. 18 బంతుల్లో 40 అవసరమైన దశలో 18వ ఓవర్లో హర్షల్‌ 22 రన్స్‌ ఇవ్వడంతో మ్యాచ్‌ ఆసీస్‌ సొంతమైంది. ఆ తర్వాత డేవిడ్‌ ఔటైనా అప్పటికే నష్టం జరిగిపోయింది. అక్షర్‌ పటేల్‌ 3, ఉమేశ్ 2 వికెట్లు పడగొట్టారు.