India vs West Indies 1st Test Live Streaming: డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఓటమి తర్వాత నెల రోజుల విరామం తీసుకున్న భారత క్రికెట్ జట్టు మళ్లీ  అంతర్జాతీయ మ్యాచ్‌లకు సిద్దమవుతోంది. వెస్టిండీస్‌ సిరీస్ తో భారత జట్టు ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కొత్త సైకిల్ (2023-2025)ను ఆరంభించనుంది. నెల రోజుల పర్యటనలో భాగంగా వెస్టిండీస్‌లో ఉన్న మెన్ ఇన్ బ్లూ.. బుధవారం (జులై 12) నుంచి విండీస్‌తో తొలి టెస్టు ఆడనుంది.  ఈ మేరకు ఇరు జట్లూ ఇప్పటికే డొమినికా చేరుకుని ముమ్మర ప్రాక్టీస్ చేస్తున్నాయి. 


ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లను టీవీలలో లైవ్‌గా చూడాలంటే అభిమానులకు జాగారం తప్పేలా లేదు. ఉపఖండంతో పోలిస్తే టైమ్ జోన్స్  పూర్తిగా మారే కరేబియన్ దీవులలో మ్యాచ్‌లు ఎప్పుడు మొదలవుతాయి..? వాటిని ఎలా చూడాలి..? తదితర వివరాలు ఇక్కడ చూద్దాం.  


ఎప్పుడు..? ఎక్కడ..? 


భారత్ - వెస్టిండీస్ జట్ల మధ్య బుధవారం నుంచి (జులై 12-16) తొలి టెస్టు డొమినికా వేదికగా జరుగుతుంది. డొమినికాలోని  విండ్సోర్ పార్క్‌లో ఈ మ్యాచ్ జరుగనుంది.


టైమింగ్స్..? 


తొలి టెస్టుతో పాటు విండీస్ సిరీస్‌లో వన్డేలు కూడా  భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు మొదలవుతాయి.  టీ20లు రాత్రి 8 గంటల నుంచి మొదలవుతాయి.  టెస్టుల విషయానికొస్తే..  రాత్రి 7 గంటలకు టాస్ పడనుంది. తొలి సెషన్ రాత్రి 7.30 నుంచి 9.30 వరకు ఉంటుంది. రెండో సెషన్ రాత్రి 10.10 గంటల నుంచి 12.10 వరకు జరుగుతుంది. మూడో సెషన్ రాత్రి 12.30 నుంచి 2.30 వరకు జరుగనుంది.


టీవీలో చూడటం ఎలా..? 


తొలి టెస్టుతో పాటు వెస్టిండీస్‌తో జరుగబోయే  మ్యాచ్‌లు అన్నీ టెలివిజన్‌లో చూడాలనుకునేవారికి  దూరదర్శన్ గుడ్ న్యూస్ చెప్పింది. డీడీ స్పోర్ట్స్‌లో ఈ మ్యాచ్‌లను ఉచితంగానే వీక్షించొచ్చు. హిందీ, ఇంగ్లీష్,  బంగ్లా, తెలుగు, కన్నడ, తమిళ్‌లో లైవ్ ప్రసారాలు చూడొచ్చు. తెలుగులో చూసేవాళ్లు డీడీ సప్తగిరి, డీడీ యాదగిరి ఛానెల్స్‌లో మ్యాచ్‌లను ఫ్రీగా చూసేయొచ్చు.  


 






మొబైల్స్, వెబ్ సైట్స్‌లో అయితే.. 


టీవీల ద్వారా కాకుండా మొబైల్స్‌లో ఈ మ్యాచ్‌లను చూడాలనుకునేవారు జియో మొబైల్‌ యాప్, వెబ్‌సైట్‌లో ఫ్రీగా చూసేయొచ్చు. ఫ్యాన్ కోడ్ (వెస్టిండీస్ అధికారిక ప్రసారదారు) యాప్, వెబ్‌సైట్‌లో కూడా వీటిని వీక్షించొచ్చు. కానీ ఫ్యాన్‌కోడ్‌లో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.  


టెస్టులకు భారత జట్టు :  రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్యా రహానె, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్,  శ్రీకర్ భరత్, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, జయదేవ్ ఉనద్కత్, నవ్‌దీప్ సైని, ముఖేష్ కుమార్ 


తొలి టెస్టుకు  వెస్టిండీస్ జట్టు : క్రెయిగ్ బ్రాత్‌వైట్  (కెప్టెన్), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (వైస్ కెప్టెన్), అలిక్ అథనాజ్, తగినరైన్ చందర్పాల్, రకీం కార్న్‌వాల్,  జోషువా డి సిల్వ, జేసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్, కిర్క్ మెకంజీ, రేమన్ రీఫర్, కీమర్ రోచ్, జొమెల్ వారికన్ 


























Join Us on Telegram: https://t.me/abpdesamofficial