IND vs SL, 1st T20: నిన్న భారత్- శ్రీలంక మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరిగింది. ఇందులో 2 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో సంజూ శాంసన్ ఔటైన తీరుపై భారత లెజెండరీ ఆటగాడు సునీల్ గావస్కర్ తీవ్ర నిరాశ వ్యక్తంచేశారు.
మంగళవారం శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో టాస్ ఓడిన భారత్ ముందుగా బ్యాటింగ్ చేసింది. త్వరత్వరగా 3 వికెట్లు కోల్పోయింది. సంజూ శాంసన్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడు. లంక బౌలర్ ధనంజయ డిసిల్వా బౌలింగ్ లో మూడో బంతికి డీప్ మిడ్ వికెట్ వద్ద ఫీల్డర్ క్యాచ్ వదిలేయటంతో సంజూ ఔట్ నుంచి తప్పించుకున్నాడు. అయితే ఆ తర్వాత కూడా బాధ్యతగా ఆడకుండా ఔట్ అయ్యాడు. అదే ఓవర్ ఐదో బంతికి క్రాస్ ది లైన్ షాట్ ఆడి షార్ట్ థర్డ్ మ్యాన్ ఫీల్డర్ కి చిక్కాడు. సంజూ షాట్ పై వ్యాఖ్యాతగా ఉన్న గావస్కర్ తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. ఆ షాట్ ఆడి ఉండాల్సింది కాదని అన్నాడు.
ఆ షాట్ ఆడిఉండాల్సింది కాదు
'సంజూ శాంసన్ మంచి టాలెంట్ ఉన్న ఆటగాడు. అతనిలో చాలా ప్రతిభ ఉంది. అయితే కొన్ని సార్లు అతని షాట్ సెలక్షన్ తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. అలాంటిదే ఈరోజు కూడా జరిగింది' అని గావస్కర్ అన్నాడు. అలాగే నిన్న ఫీల్డింగ్ లోనూ శాంసన్ నిరాశపరిచాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్య బౌలింగ్ లో పాతుమ్ నిస్సాంక ఇచ్చిన క్యాచ్ ను జారవిడిచాడు. అద్భుతంగా డైవ్ చేసి క్యాచ్ అందుకున్నప్పటికీ.. కింద పడే సమయంలో బంతిని వదిలేశాడు. అయితే తర్వాత కుశాల్ మెండిస్, డిసిల్వా క్యాచ్ లను ఒడిసి పట్టుకుని 2 కీలక వికెట్లలో భాగమయ్యాడు.
అవకాశాలను ఉపయోగించుకోవాలి
శాంసన్ గురించి మాజీ బ్యాటర్ గౌతం గంభీర్ కూడా మాట్లాడాడు. 'టీ20 లైనప్ లో ఈ కుడిచేతి వాటం బ్యాటర్ తన అవకాశాలను పొందే సమయం వచ్చేసింది. అతనికి ఎంత ప్రతిభ ఉందో మనందరికీ తెలుసు. అయితే సంజూ ఈ అవకాశాలను ఉపయోగించుకోవాలి' అని గంభీర్ అభిప్రాయపడ్డాడు. శాంసన్ తన కెరీర్ లో ఇప్పటివరకు 17 టీ20 మ్యాచ్ లు ఆడాడు. ఈ ఫార్మాట్ లో అతని అత్యధిక స్కోరు 77.
శ్రీలంకతో 3 టీ20ల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. తన తదుపరి మ్యాచ్ ను గురువారం పుణెలోని ఎంసీఏ లో ఆడనుంది.