IND vs SA T20:

  టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికాను భారత బౌలర్లు వణికించారు. బౌలింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై చెలరేగిపోయారు. ఖచ్చితమైన సీమ్ అండ్ స్వింగ్ తో బాల్స్ సంధిస్తూ క్రమం తప్పకుండా వికెట్లు తీశారు. ముఖ్యంగా దీపక్ చాహర్, అర్హదీప్ సింగ్ పవర్ ప్లేలో 5 వికెట్లు పడగొట్టారు. దక్షిణాఫ్రికా టాప్ 6 బ్యాట్స్ మెన్లలో నలుగురు డకౌట్ అయ్యారంటే భారత బౌలర్ల విజృంభణ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందులో మూడు గోల్డెన్ డక్ లు ఉన్నాయి. 


నలుగురు డకౌట్



దీపక్ చాహర్ తన తొలి ఓవర్లోనే కెప్టెన్ బవుమాను(0) బౌల్డ్ చేశాడు. ప్రొటీస్ కెప్టెన్ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. తర్వాతి ఓవర్ వేసిన అర్హదీప్ మూడు వికెట్లతో చెలరేగాడు. నిప్పులు చెరిగే బంతులతో దక్షిణాఫ్రికాను కోలుకోనివ్వకుండా చేశాడు. వరుస బంతుల్లో డికాక్ (4 బంతుల్లో 1), రిలీ రోసౌవ్ (0) లను ఔట్ చేశాడు. అర్హదీప్ బంతిని వికెట్ల మీదకు ఆడుకుని డికాక్ ఔటయ్యాడు. రిలీ రోసౌవ్ కీపర్ క్యాచ్ తో పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్ (0) ఎదుర్కొన్న తొలి బంతికే అర్హదీప్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. ఫామ్ లో ఉన్న ఆ జట్టు బ్యాట్స్ మెన్ స్టబ్స్ (0) కూడా మొదటి బంతికే చాహర్ బౌలింగ్ లో అర్హదీప్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 


ఆచితూచి ఆడిన మార్ క్రమ్, పావెల్ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. మార్ క్రమ్ కొన్ని చక్కని షాట్లు ఆడాడు. అతనికి పావెల్ సహకారం అందించాడు క్రీజులో కుదురుకుంటున్న మార్ క్రమ్(24 బంతుల్లో 25) ను హర్షల్ పటేల్ ఓ చక్కని బంతితో వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. తర్వాత పావెల్ కు కేశవ్ మహరాజు జతకలిశాడు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. సింగిల్స్ తో స్ట్రై క్ రొటేట్ చేస్తూ స్కోరు బోర్డును నడిపించారు. ఇన్నింగ్స్ ను చక్కదిదితున్న వీరి జంటను అక్షర్ పటేల్ విడదీశాడు. అక్షర్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించిన పావెల్ (37 బంతుల్లో 24)సూర్యకుమార్ పట్టిన చక్కని క్యాచ్ కు నిష్క్రమించాడు. ఆఖరి 2 ఓవర్లలో కేశవ్ మహరాజ్ బ్యాట్ ఝుళిపించటంతో దక్షిణాఫ్రికా స్కోరు వంద దాటింది. 20 వ ఓవర్లో హర్షల్ పటేల్ సూపర్ యార్కర్ తో మహరాజ్ (35 బంతుల్లో 41) ను బౌల్డ్ చేశాడు. భారత్ బౌలర్లలో అర్హదీప్ 3, దీపక్ చాహర్ 2, హర్షల్ పటేల్ 2 వికెట్లు, అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టారు.