సౌతాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ ఘోర ఓటమితో ఆరంభించింది. సెంచూరియన్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియాకు ఘోర పరాభవం తప్పలేదు. తొలుత డీన్‌ ఎల్గర్‌ భారీ శతకంతో చెలరేగడం... తర్వాత పేసర్‌ కగిసో రబాడ బ్యాటర్ల పతనాన్ని శాసించడంతో ఇన్నింగ్స్‌ 32 పరుగుల తేడాతో భారత్ పరాజయం పాలైంది. విరాట్‌ కోహ్లీ పోరాడినా టీమిండియాకు పరాజయం తప్పలేదు. దక్షిణాఫ్రికా పేసర్ల నిప్పులు చెరిగే బంతులకు భారత బ్యాటర్ల దగ్గర సమాధానమే కరువైంది. ఒక్కొక్కరుగా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు.  సఫారీలు తొలి ఇన్నింగ్స్‌లో 408 పరుగులకు ఆలౌటై 163 పరుగుల ఆధిక్యాన్ని సాధించారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌.. సౌతాఫ్రికా పేసర్లు చెలరేగడంతో 131 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ (76) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. తొలి టెస్టులో భారత్‌ ఓటమిపాలైనా కోహ్లీ మాత్రం అరుదైన ఘనత సాధించాడు. 

 

ఔరా కోహ్లీ...

కోహ్లీ తొలి ఇన్నింగ్స్‌లో 38, రెండో ఇన్నింగ్స్‌లో 76 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 146 ఏళ్ల క్రికెట్‌ చరిత్రలో ఏడు క్యాలెండర్‌ సంవత్సరాల్లో 2000 వేలకుపైగా పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా అవతరించాడు. అధికారికంగా 1877 నుంచి క్రికెట్‌ గణాంకాలను లెక్కలోకి తీసుకుంటే మరే ఇతర బ్యాటర్‌ ఈ ఘనత సాధించలేదు. కోహ్లీ 2012లో 2,186 పరుగులు, 2014లో 2,286 పరుగులు, 2106లో 2,595 పరుగులు, 2017లో 2,818 పరుగులు, 2017లో 2,735 పరుగులు, 2019లో 2,455 పరుగులు చేయగా.. ఇప్పుడు ఈ ఏడాదిలో 2,006 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టే ఈ సంవత్సరం భారత్ ఆడిన చివరి మ్యాచ్‌ కావడం విశేషం. 

 

మ్యాచ్‌ సాగిందిలా...

ఈ టెస్టు మ్యాచ్‌లో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో245 పరుగులకు ఆలౌటైంది. రాహుల్‌ మినహా అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో, కఠిన సవాళ్లను ఎదుర్కొని కేఎల్‌ రాహుల్‌ అద్భుత శతకంతో టీమిండియాకు గౌరవప్రమదమైన స్కోరు అందించాడు. పేసర్లకు స్వర్గధామంగా మారిన పిచ్‌పై ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కోవడంలో టాప్‌ఆర్డర్‌ విఫలమవడంతో జట్టు 92 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. అప్పుడు క్రీజులోకి వచ్చిన రాహుల్‌.. జట్టుకు పోరాడే స్కోరు అందించి చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ప్రొటీస్‌ను ఎల్గర్‌ భారీ స్కోరు దిశగా నడిపించాడు. అశ్విన్‌ బౌలింగ్‌లో ఎల్గర్‌ ఇచ్చిన క్యాచ్‌ చేజారింది. 79 ఓవర్లకు భారత్‌ స్కోరు 300 పరుగులు దాటింది. సిరాజ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 88వ ఓవర్‌లో వరుసగా రెండు బౌండరీలు బాదిన జాన్సన్‌ అర్ధ శతకం సాధించాడు. కెరీర్‌లో అతడికిది రెండో అర్ధ శతకం కావడం గమానార్హం. చాలాసేపటి తర్వాత ఎట్టకేలకు భారత్‌కు ఉపశమనం లభించింది. 94.5వ ఓవర్లో శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో షార్ట్‌ పిచ్‌ బంతిని ఆడబోయిన ఎల్గర్‌ వికెట్‌ కీపర్‌కు దొరికిపోయాడు. భారీ శతకంతో ఇన్నింగ్స్‌ను నిర్మించిన డీన్‌ ఎల్గర్‌ 185 పరుగులు చేసి ఔటయ్యాడు. డీర్‌ఎస్‌కు వెళ్లినా సఫారీ జట్టుకు ఫలితం అనుకూలంగా రాలేదు. ఆరో వికెట్‌కు ఎల్గర్‌-జాన్‌సెన్‌ 111 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించారు. బవుమా బ్యాటింగ్‌కు దిగకపోవడంతో సౌతాఫ్రికా ఆలౌటైనట్లు ప్రకటించారు. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 163 పరుగుల ఆధిక్యం సంపాదించింది. 

 

అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌.. సౌతాఫ్రికా పేసర్లు చెలరేగడంతో 131 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ (76) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. శుభ్‌మన్ గిల్ 26 పరుగులు చేశాడు. మిగతా ఆటగాళ్లలందరూ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో నండ్రీ బర్గర్‌ 4, మార్కో జాన్‌సెన్ 3, రబాడ 2 వికెట్లు తీశారు.