ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్ల మధ్య కొనసాగుతున్న రెండో టెస్టులో ఓ ఆసక్తికర ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మూడో రోజు ఆట కొనసాగుతున్న సమయంలో బౌండరీ లైన్‌ వద్ద ఉన్న పాక్ పేస‌ర్ హసన్ అలీ సరదాగా డ్యాన్స్ చేశాడు. హ‌స‌న్ అలీ అభిమానుల‌తో ఉత్సాహంగా డ్యాన్స్‌ చేసే వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అలీ డ్యాన్స్‌కు స్టాండ్స్‌లో ఉన్న అభిమానులు కూడా కలిసి డ్యాన్స్ చేశారు. హసన్ ఎలా చేస్తున్నాడో స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు కూడా అలాగే చేతులు ఊపుతూ అరుపులు చేస్తూ సందడి చేశారు. అలీని ఫాలో అయిన ఫ్యాన్స్ అత‌డి మాదిరిగానే స్టాండ్స్‌లో డాన్స్ చేశారు. ఒక్కసారిగా అంతమంది డ్యాన్స్‌ చేయడంతో స్టేడియం అరుపులతో దద్దరిల్లింది. అలీ స్ట్రెచింగ్, డాన్స్ స్టెప్పుల‌తో వాళ్లను ఉత్సాహ‌ప‌రిచాడు. మ్యాచ్ స‌మ‌యంలో అలీ ఫ్యాన్స్‌కు ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ సంద‌డి చేశాడు. ఒక అభిమాని నుదుటిపై ఆటోగ్రాఫ్ ఇస్తున్న ఫొటో ఆన్‌లైన్‌లో వైర‌ల్ అయింది.

 

పోరాడుతున్న పాక్‌

స్వదేశంలో పాకిస్థాన్‌తో జ‌రుగుతున్న బాక్సిండ్ టెస్ట్‌లో ఆస్ట్రేలియా ప‌ట్టుబిగిస్తోంది. మూడో రోజు తొలి సెష‌న్‌లోనే పాక్‌ను చుట్టేసిన ఆసీస్.. రెండో ఇన్నింగ్స్‌లో 187 ప‌రుగులు చేసింది. మిచెల్ మార్ష్‌(95), స్టీవ్ స్మిత్(50) హాఫ్ సెంచరీల‌తో రాణించడంతో మూడో రోజు ఆట ముగిసే స‌రికి ఆసీస్ 6 వికెట్ల న‌ష్టానికి 187 ప‌రుగులు చేసింది. ఫామ్‌లో ఉన్న స్మిత్‌ ఆట ముగుస్తుందన‌గా ఆఖ‌రి బంతికి షాహిన్ ఆఫ్రిది బౌలింగ్‌లో ఔట‌య్యాడు. మొత్తంగా ఈ టెస్టులో కంగారూ జ‌ట్టు 241 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది. దాంతో, మ్యాచ్ విజేత‌ను నిర్ణయించేందుకు నాలుగో రోజు ఆట కీల‌కం కానుంది.

 

తొలి ఇన్నింగ్స్‌ సాగిందిలా..

ఇప్పటికే తొలి టెస్టులో ఘన విజయం సాధించినా కంగారులు... రెండో టెస్ట్‌లోనూ దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఈ మ్యాచ్ మొద‌టి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 318 ప‌రుగులు చేసింది. మార్నస్ ల‌బుషేన్ (63) హాఫ్ సెంచ‌రీ చేశాడు. ఉస్మాన్ ఖ‌వాజా (42), మిచెల్ మార్ష్ (41), డేవిడ్ వార్నర్ (38) లు రాణించారు. పాక్‌ బౌల‌ర్ల‌లో అమీర్ జమాల్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు, షాహీన్ అఫ్రీది, మీర్ హంజా, హసన్ అలీ లు త‌లా రెండు వికెట్లు తీశారు. అగా సల్మాన్ ఓ వికెట్ సాధించాడు. అనంత‌రం మొద‌టి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన పాక్‌.. రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ఆరు వికెట్లు కోల్పోయి 194 ప‌రుగులు చేసింది. మహ్మద్ రిజ్వాన్ (29), అమీర్ జమాల్ (2)లు క్రీజులో ఉన్నారు. అబ్దుల్లా షఫీక్ (62), షాన్ మసూద్ (54)లు అర్ధ‌శ‌త‌కాల‌తో రాణించారు. ఆస్ట్రేలియా మొద‌టి ఇన్నింగ్స్ స్కోరుకు పాకిస్తాన్ ఇంకా 124 ప‌రుగుల దూరంలో ఉంది. ఆరంభంలో పాక్‌ మెరుగ్గా కనిపించినప్పటికీ. కమిన్స్‌ సూపర్‌ బౌలింగ్‌తో పాక్‌ను దెబ్బతీశాడు. ఆసీస్ బౌల‌ర్లలో పాట్ క‌మిన్స్ మూడు వికెట్లు తీయ‌గా, నాథ‌న్ ల‌య‌న్ రెండు, జోష్ హేజిల్‌వుడ్ లు ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.