India vs South Africa T20: ఆసియా కప్ పోగొట్టుకుని అభిమానులను నిరాశపర్చిన టీమిండియా.. ఆసీస్ పై పొట్టి సిరీస్ నెగ్గి మళ్లీ గాడిన పడింది. మొదటి మ్యాచ్ ఓడిపోయినా తర్వాత వరుసగా రెండు టీ20 లలో గెలిచి కంగారూలపై సిరీస్ విజయం దక్కించుకుంది. ఆసీస్ తో సిరీస్ అయిన 3 రోజుల్లోనే మరో టీ20 సిరీస్ కు సిద్ధమైంది భారత్. రేపటినుంచి దక్షిణాఫ్రికాతో పొట్టి సిరీస్ ఆరంభం కానుంది. టీ20 ప్రపంచకప్ ముంగిట సన్నద్ధతకు టీమిండియాకు ఇదే చివరి సిరీస్. తప్పులు దిద్దుకుని, బలహీనతలను అధిగమించి, కూర్పును సరిచూసుకునేందుకు మిగిలి ఉన్న ఆఖరి అవకాశం ఇదే. దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని భారత్ భావిస్తోంది.
అంతా ఓకే కాదు
ఆసీస్ పై సిరీస్ గెలిచినంత మాత్రాన భారత జట్టులో అంతా బావుందని అనుకోవడానికి లేదు. ఇంకా చాలా బలహీనతలు టీమిండియాను వేధిస్తున్నాయి. ముఖ్యంగా డెత్ ఓవర్ల బౌలింగ్. గత కొన్ని సిరీస్ ల నుంచి చివరి ఓవర్లలో భారత బౌలర్లు తడబడుతున్నారు. ఆరంభ, మధ్య ఓవర్లలో బాగా బంతులేసి వికెట్లు తీస్తున్నప్పటికీ.. చివరి 4, 5 ఓవర్లలో ధారాళంగా పరుగులిచ్చేస్తున్నారు. ముఖ్యంగా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ అని పేరున్న భువనేశ్వర్ కుమార్ ఆఖరి ఓవర్లలో తేలిపోతున్నాడు. ఆసియా కప్ సూపర్- 4 మ్యాచుల్లో పాకిస్థాన్, శ్రీలంకలపై 19వ ఓవర్లో భారీగా పరుగులిచ్చేశాడు. దీంతో భారత్ గెలుపు అవకాశాలు తగ్గిపోతున్నాయి. పని భారమో, సహకరించే బౌలర్ లేకపోవడమో కారణమేదైనా భువీ అనుకున్నంతగా రాణించట్లేదు. ఆసియా కప్ కు జట్టులో చోటు దక్కించుకున్న అవేష్ ఖాన్ దారుణంగా విఫలమయ్యాడు. మరో కుర్ర బౌలర్ అర్హదీప్ మాత్రం పరవాలేదనిపించాడు.
వారిద్దరూ వచ్చినా మెరుగేం లేదు
గాయాలతో ఆసియా కప్ కు దూరమైన స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ లు దక్షిణాఫ్రికా సిరీస్ లో ఆడారు. 3 మ్యాచుల్లోనూ ఆడిన హర్షల్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. వికెట్లు తీయడం అటుంచితే ధారాళంగా పరుగులిచ్చేశాడు. 2 మ్యాచుల్లో ఆడిన బుమ్రా అంతకుముందులా ఆకట్టుకోలేదు. రెండో టీ20లో కీలకమైన ఫించ్ వికెట్ పడగొట్టినప్పటికీ.. మూడో టీ20లో ఎక్కువ పరుగులే ఇచ్చుకున్నాడు. అయితే వారిద్దరూ గాయం నుంచి కోలుకుని వచ్చారు కాబట్టి లయ అందుకోవడానికి సమయం పడుతుంది. ఇదే విషయమే కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. బౌలర్లపై అతను నమ్మకముంచాడు. వారికి కొంచెం సమయమిస్తే కుదురుకుంటారని ఆశాభావం వ్యక్తంచేశాడు. స్టార్ బ్యాట్స్ మెన్ ఉన్న ప్రొటీస్ ను ఓడించాలంటే మన బౌలింగ్ విభాగం అంచనాలకు తగ్గట్లు రాణించాల్సిన అవసరముంది.
బ్యాటింగ్ లోనూ లోపాలు
ఆసీస్ తో మూడు టీ20ల్లోనూ భారత్ భారీ స్కోర్లే చేసింది. మొదటి మ్యాచ్ లో 209 పరుగులు చేసింది. 8 ఓవర్లకు కుదించిన రెండో టీ20లో ఆసీస్ నిర్దేశించిన 91 పరుగులను, మూడో మ్యాచులో 186 పరుగులను ఛేదించింది. దీన్ని బట్టి చూస్తే భారత బ్యాటర్లు బాగా ఆడినట్లే అనిపిస్తోంది. కానీ బ్యాటింగ్ లోనూ లోపాలు ఉన్నాయి. ఒక్కో మ్యాచులో ఒక్కొక్కరు రాణిస్తున్నారు తప్పితే.. సమష్టిగా బ్యాట్ ఝుళిపించింది లేదు. ఓపెనర్లు రోహిత్, కేఎల్ రాహుల్ లు ఒక మ్యాచులో బాగా ఆడితే మరో దానిలో ఆడడంలేదు. ఇక కోహ్లీ చివరిదైన మూడో టీ20లో అర్థశతకంతో మెరిసినా.. మొదటి రెండు మ్యాచుల్లో సింగిల్ డిజిట్ కే ఔటయ్యాడు. సూర్య కూాడా మూడో మ్యాచులో తప్పితే మిగతా రెండింటిలో అంతగా ఆకట్టుకోలేదు. పాండ్య, దినేశ్ కార్తీక్ లు ఫినిషర్ల పాత్ర బాగానే పోషిస్తున్నారు. అయితే కార్తీక్ కు మరింత సమయం క్రీజులో గడిపే అవకాశం ఇవ్వాలి. పటిష్టమైన దక్షిణాఫ్రికాను ఓడించాలంటే బ్యాట్స్ మెన్ అందరూ సమష్టిగా రాణించాలి.
తుది జట్టులో ఎవరుంటారు!
దక్షిణాఫ్రికాతో సిరీస్ కు భువనేశ్వర్, హార్దిక్ పాండ్యలకు విశ్రాంతినిచ్చారు. షమీ ఇంకా కరోనా నుంచి కోలుకోలేదు కాబట్టి అతను ఆడడు. షమీ స్థానంలో ఉమేశ్ ను కొనసాగించే అవకాశం ఉంది. ఇక దీపక్ హుడా కూడా బ్యాక్ ఇంజూరీతో దూరమయ్యాడు. వీరిద్దరి స్థానాల్లో శ్రేయస్ అయ్యర్, షాబాజ్ అహ్మద్ జట్టులోకి వచ్చే అవకాశముంది. ఒకటి రెండు మార్పులు తప్పితే ఆసీస్ తో ఆడిన జట్టునే భారత్ కొనసాగించే అవకాశం ఉంది.
ప్రాక్టీస్ షురూ
ఇప్పటికే మొదటి టీ20 జరిగే తిరువనంతపురం మైదానానికి చేరుకున్న ఇరు జట్లు ప్రాక్టీసును ముమ్మరం చేస్తున్నాయి.
టీ20 సిరీస్ షెడ్యూల్
మొదటి టీ20 సెప్టెంబర్ 28 తిరువనంతపురం
రెండో టీ20 అక్టోబర్ 02 గువాహటి
మూడో టీ20 అక్టోబర్ 04 ఇండోర్