Duleep Trophy Final:

  దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో యువ ఆటగాడు యశస్వి జైశ్వాల్ తీరు వివాదాస్పదమైంది. సౌత్ జోన్ ఆటగాడు రవితేజను స్లెడ్జింగ్ చేయటంతో అంపైర్లు, కెప్టెన్ ఆగ్రహానికి గురయ్యాడు. పదేపదే స్లెడ్జింగ్ చేయటంతో అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఫీల్డ్ నుంచి యశస్విని బయటకు పంపించారు.  జైశ్వాల్ వివాదాస్పద తీరు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.


అసలేం జరిగిందంటే


దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో భాగంగా సౌత్ జోన్ జట్టు బ్యాటింగ్ చేస్తోంది. ఆఖరి ఇన్నింగ్స్ 50వ ఓవర్లో వెస్ట జోన్ ఆటగాడు జైశ్వాల్, సౌత్ జోన్ బ్యాటర్ రవితేజ మధ్య వాగ్వాదం జరిగింది. పదేపదే యశస్వి రవితేజను స్లెడ్జింగ్ చేశాడు. సౌత్ కెప్టెన్ రహానేకు రవితేజ ఫిర్యాదు చేయటంతో యశస్విని రహానే రెండుసార్లు మందలించాడు. అయినప్పటికీ తగ్గని యశస్వీ 57వ ఓవర్లో మళ్లీ రవితేజను కవ్వించాడు. ఈసారి రవితేజ అంపైర్లకు ఫిర్యాదు చేశాడు. అంపైర్లు కెప్టెన్ రహానేతో మాట్లాడి యశస్వీ జైస్వాల్ ను ఫీల్డ్ బయటకు పంపించాలని చెప్పారు. ఆ తర్వాత రహానే జైశ్వాల్ తో మాట్లాడి అతడిని మైదానం వీడాల్సిందిగా చెప్పాడు. 7 ఓవర్లపాటు ఫీల్డ్ ను వీడిన యశస్వి తర్వాత తిరిగి వచ్చాడు. 


వెస్ట్ జోన్ విజయం


ఈ మ్యాచ్ లో వెస్ట్ జోన్ 294 పరుగుల తేడాతో సౌత్ జోన్ పై విజయం  సాధించి దులీప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. వివాదాస్పద తీరుతో చర్చనీయాంశంగా మారిన యశస్వీ జైశ్వాల్ ఈ టోర్నీలో 285 పరుగులు చేశాడు. అందులో ఓ ద్విశతకం ఉంది. 


ప్రత్యర్థిని గౌరవించడం ముఖ్యం


మ్యాచ్ అనంతరం ఈ ఘటనపై రహానే మాట్లాడాడు. క్రికెట్ లో నియమాలను పాటించడం, ప్రత్యర్థులను గౌరవించడం ముఖ్యమని చెప్పాడు. పోటీ పోటీలానే ఉండాలని.. ప్రత్యర్థి ఆటగాళ్లపై దూషణలకు దిగకూడదని సూచించాడు. తాను క్రికెట్ ఆడే విధానం అలానే ఉంటుందని చెప్పాడు.