Virat Kohli: రన్ మెషీన్.. ఛేదన రారాజు.. రికార్డుల వీరుడు.. వీటన్నింటికి ప్రత్యామ్నాయ పేరు ఒకటే.. అతడే విరాట్ కోహ్లీ. గత మూడేళ్లుగా కొంచెం జోరు తగ్గినా కోహ్లీ కోహ్లీనే. ఇటీవలే ఆసియా కప్ తో ఫామ్ లోకి వచ్చిన విరాట్.. ఆసీస్ తో పొట్టి సిరీస్ లోనూ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా సిరీస్ డిసైడర్ అయిన మూడో టీ20లో పాత కోహ్లీని గుర్తుకుతెచ్చాడు. 'ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలుసు' అన్నట్లుగా.. ధాటిగా ఆడుతున్న సూర్యకుమార్ కు సహకరించాడు. అతడు హిట్టింగ్ చేస్తుంటే మరోవైపు స్ట్రైక్ రొటేట్ చేస్తూ సూర్యకు సహకరించాడు. ఒకసారి సూర్య ఔటయ్యాక తన బ్యాట్ పవర్ చూపించాడు. అలా 48 బంతుల్లోనే 63 పరుగులు చేసి విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. 


మరో వికెట్ పడనివ్వలేదు


మొదటి ఓవర్లోనే రాహుల్ వికెట్ కోల్పోయిన భారత్ కష్టాల్లో పడింది. కొన్ని షాట్లతో ఆకట్టుకున్న రోహిత్ ఎక్కువసేపు నిలవలేదు. ఈ దశలో మరో వికెట్ పడుంటే పరిస్థితి ఎలా ఉండేదో. కానీ విరాట్ కోహ్లీ ఆసీస్ కు అవకాశం ఇవ్వలేదు. తన అనుభవాన్ని ఉపయోగించి ఇన్నింగ్స్ ను నడిపించాడు. తనను ఇబ్బంది పెట్టాలని చూసిన స్పిన్నర్ జంపా బౌలింగ్ పై ఎదురుదాడికి దిగాడు. ముందు దూకుడుగానే ఆడినా.. సూర్యకుమార్ హిట్టింగ్ చేస్తుండటంతో అతనికి ఎక్కువ స్ట్రైక్ ఇస్తూ సహకరించాడు. ఓవైపు కోహ్లీ క్రీజులో పాతుకుపోయాడనే ధైర్యంతో సూర్య బ్యాట్ ఝుళిపించాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్ కు శతక భాగస్వామ్యం అందించారు. వీళ్ల ఇన్నింగ్స్ కారణంగానే ఎక్కడా మ్యాచ్‌ ప్రత్యర్థి చేతిలోకి వెళ్లలేదు. రిక్వైర్డ్‌ రన్‌రేట్‌ పదికి మించలేదు. 


శతక భాగస్వామ్యం


ఆసీస్ తో మూడో టీ20లో (43 బంతుల్లో 68 పరుగులు) కీలక ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ.. మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అచ్చొచ్చిన ఉప్పల్ మైదానంలో చివరి ఓవర్ వరకు క్రీజులో నిలబడ్డాడు. స్వల్ప వ్యవధిలో ఓపెనర్లను కోల్పోయిన సమయంలో.. సంయమనంతో కూడిన దూకుడును ప్రదర్శించాడు. ఓవైపు సూర్యకుమార్ ధాటిగా ఆడుతుంటే.. మరోవైపు కోహ్లీ తన వేగం తగ్గించి అతనికి సహకరించాడు. సూర్యతో కలిసి మూడో వికెట్ కు 104 పరుగుల భాగస్వామ్యం అందించి జట్టు విజయంలో పాలు పంచుకున్నాడు. మ్యాచ్ అనంతరం దీనిపై కోహ్లీ మాట్లాడాడు. 


సూర్యకుమార్ ధాటిగా ఆడుతున్న సమయంలో తాను ఓసారి డగౌట్ వైపు చూశానని కోహ్లీ చెప్పాడు. అప్పుడు అక్కడ ఉన్న కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్.. తనను నిలకడగా ఆడమని చెప్పారని కోహ్లీ వివరించాడు. సూర్య బాగా ఆడుతున్నాడని, మంచి భాగస్వామ్యం నిర్మించాలని సూచించారు. దాంతో నేను స్ట్రైక్ రొటేట్ చేస్తూ సూర్యకుమార్ కు సహకరించాను. నా అనుభవాన్ని ఉపయోగించి నిదానంగా ఆడాను. ఒకసారి సూర్య ఔటయ్యాక హిట్టింగ్ మొదలుపెట్టాను. మిడిలార్డర్ లో ఆడే నేను జట్టు అవసరాలకు అనుగుణంగా ఆడాల్సి ఉంటుంది. ఈరోజు మ్యాచులో నేనదే చేశాను. అంటూ విరాట్ కోహ్లీ వివరించాడు. 


ఉప్పల్ 'కింగ్' కోహ్లీ


తనకు అచ్చొచ్చిన మైదానంలో విరాట్ కోహ్లీ మరోసారి ఆకట్టుకున్నాడు. సొగసైన బ్యాటింగ్ తో అలరించాడు. మొదటి ఓవర్లోనే రాహుల్ ఔటవటంతో క్రీజులోకి వచ్చిన కోహ్లీ ఆచితూచి ఆడాడు. తనను ఇబ్బంది పెట్టాలని చూసిన స్పిన్నర్ ఆడమ్ జంపా బౌలింగ్ లో ఎదురుదాడికి దిగాడు. ఓవైపు సూర్యకుమార్ దంచి కొడుతుంటే.. స్ట్రైక్ రొటేట్ చేస్తూ అతనికి చక్కని సహకారం అందించాడు. చివరి ఓవర్లో విజయానికి 11 పరుగులు అవసరమైన సమయంలో మొదటి బంతినే సిక్సర్ గా మలిచి సమీకరణాన్ని తేలిక చేశాడు. ఆ తర్వాత బంతికి కోహ్లీ ఔటైనా.. భారత్ ఎలాంటి ఇబ్బంది లేకుండానే మ్యాచ్ గెలిచింది. ఈ మ్యాచుకు ముందు ఉప్పల్ మైదానంలో విరాట్ కోహ్లీ 3 ఫార్మాట్లలో 8 మ్యాచుల్లో కలిపి 607 పరుగులు చేశాడు. ఈ స్టేడియంలో అతని సగటు 75. 87గా ఉంది.