IND vs PAK:
క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్! మరోసారి ఓ పెద్ద టోర్నీలో భారత్, పాకిస్థాన్ తలపడబోతున్నాయి. ఈ ఏడాది ఆసియాకప్‌లో దాయాది దేశాల పోరు ఉంటుందని ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జే షా ధ్రువీకరించారు. 2023-24 సీజన్లకు సంబంధించిన షెడ్యూలు, గ్రూపుల వివరాలను పంచుకున్నారు. ఈసారి పురుషులు, మహిళల ఏసీసీ టోర్నీల్లో భారత్, పాక్‌లు పోరాడనున్నాయి.
పురుషుల ఆసియాకప్‌లో మొత్తం ఆరు జట్లు తలపడతాయి. ఒక గ్రూపులో భారత్, పాకిస్థాన్, శ్రీలంక ఉన్నాయి. రెండో గ్రూపులో అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ ఉన్నాయి. అర్హత టోర్నీలో గెలిచిన ఒక జట్టు ఈ గ్రూపులో చేరుతుంది. లీగు దశలో ఆరు మ్యాచులు జరుగుతాయి. సూపర్ 4లో ఆరు మ్యాచులు ఉంటాయి. ఫైనల్‌తో కలిపి 13 మ్యాచులు జరుగుతాయి. అర్హత టోర్నీలో యూఏఈ, నేపాల్, కువైట్, ఖతార్, ఒమన్, హాంకాంగ్, సింగపూర్, మలేసియా, ఛాలెంజర్స్ ట్రోఫీలో గెలిచి మరో రెండు జట్లు ఆడతాయి. ఎమర్జింగ్ టీమ్స్ ఏసియాకప్ సైతం ఉంటుంది.
మహిళల ఆసియాకప్‌లో ఆరు జట్లు ఆడతాయి. భారత్, పాకిస్థాన్ ఒక గ్రూపులో, శ్రీలంక, బంగ్లాదేశ్ మరో గ్రూపులో ఉన్నాయి. ప్రీమియర్ కప్‌లో గెలిచిన రెండు జట్లు రెండు గ్రూపుల్లో చేరతాయి. ఆరు జట్లు రౌండ్ రాబిన్ ఫార్మాట్లో తలపడతాయి. ఫైనల్‌తో కలిపి మొత్తం 16 మ్యాచులు జరుగుతాయి. అర్హత టోర్నీతో పాటు ఛాలెంజర్స్ కప్, ఎమర్జింగ్ కప్ టోర్నీలు ఉంటాయి.
సాధారణంగా ఐసీసీ ప్రపంచకప్‌లకు సన్నాహకంగా ఆసియాకప్‌ను నిర్వహిస్తారు. మెగా టోర్నీని బట్టి టీ20, వన్డే ఫార్మాట్‌ను ఎంపిక చేస్తారు. ఈ సారి ఆసియాకప్ నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. పాకిస్థాన్‌కు ఆతిథ్య హక్కులు ఇవ్వడమే ఇందుకు కారణం. దాయాది దేశంలో టీమ్‌ఇండియా అడుగుపెట్టదని బీసీసీఐ కార్యదర్శి జేషా గతంలో స్పష్టం చేశారు. టోర్నీని తటస్థ వేదికకు తరలించాల్సిందేనని పరోక్షంగా సూచించారు.
అప్పటి పీసీబీ ఛైర్మన్ రమీజ్ రాజా.. జే షా సూచనను అంగీకరించలేదు. తమను సంప్రదించకుండానే ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. ఒకవేళ టీమ్‌ఇండియా రాకపోతే భారత్‌లో జరిగే ప్రపంచకప్‌నకు పాకిస్థాన్ రాదని చెప్పారు. కాగా పీసీబీ ఛైర్మన్ పదవి నుంచి ఆయన్ను రాత్రికి రాత్రే గెంటేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పగ్గాలు చేపట్టిన నజమ్ సేథీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.