ప్రపంచకప్‌లో అప్రతిహాత జైత్రయాత్రతో దూసుకుపోతున్న రెండు అగ్ర శ్రేణి జట్ల మధ్య మహా సమరానికి రంగం సిద్ధమైంది. విశ్వ సంగ్రామంలో న్యూజిలాండ్-భారత్ తలపడబోతున్నాయి. ధర్మశాల వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే టీమిండియా, కివీస్‌ను ఆటగాళ్ల గాయాలు కలవరపెడుతున్నాయి. హార్దిక్ పాండ్యా గాయంతో ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో అతడి స్థానంలో జట్టులోకి ఎవరు వస్తారన్న ఆసక్తి మొదలైంది. కివీస్ సారధి విలియమ్సన్ కూడా మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకూ కివీస్ నాలుగు మ్యాచ్‌లు ఆడగా అందులో ఒక్క మ్యాచ్‌లోనే విలియమ్సన్ ఆడాడు. విలియమ్సన్ స్థానాన్ని రచిన్ రవీంద్ర భర్తీ చేశాడు. అయితే హార్దిక్ పాండ్యా స్థానంలో భారత తుదిజట్టులో చేరే ఆటగాడు ఎవరన్నది ఉత్కంఠగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో తొలి స్థానాన్ని ఆక్రమించాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి.
హార్దిక్ స్థానంలో ఎవరు?
స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా కివీస్‌తో మ్యాచ్‌కు దూరమయ్యాడు. టీమిండియా హార్దిక్ స్థానంలో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌లలో ఒకరిని తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఆరో నంబర్‌లో బ్యాటింగ్ చేయడానికి... మ్యాచ్‌ను ముగించడానికి సూర్యకుమార్ యాదవ్ సరైన ఎంపికగా టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సూర్యకుమార్ యాదవ్, శుభమన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్‌లతో భారత్ బ్యాటింగ్ లైనప్ దుర్భేద్యంగా మారుతుందని మాజీలు కూడా అంచనా వేస్తున్నారు. ఒకవేళ సూర్యకుమార్ యాదవ్‌ను వద్దనుకుంటే ఇషాన్ కిషన్ తుది జట్టులో చేరవచ్చు. శార్దూల్ ఠాకూర్ స్థానంలో మహ్మద్ షమీ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. శార్దూల్ స్థానంలో షమీను తీసుకోవాలని ఇప్పటికే డిమాండ్లు వస్తున్నాయి. లేకపోతే హార్దిక్ స్థానంలోనే షమీని తీసుకునే అవకాశం ఉంది.
వరుస విజయాలతో టీమ్‌ఇండియా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. టాపార్డర్‌లో రోహిత్, కోహ్లీ, కేఎల్ రాహుల్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. అఫ్గాన్‌పై సెంచరీ చేసిన రోహిత్... దాయాది పాకిస్తాన్, బంగ్లాదేశ్‌పై కూడా మంచి ఇన్నింగ్సులు ఆడాడు. కోహ్లీ కూడా మంచి ఫామ్ అందిబుచ్చుకున్నాడు. బంగ్లాదేశ్‌పై సెంచరీ కూడా బాదాడు. కేఎల్ రాహుల్ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడుతూ జట్టుకు విలువైన స్కోర్ అందిస్తున్నాడు. రానున్న మ్యాచుల్లో వీరు రాణిస్తే టీమిండియాకు తిరుగుండదు. గిల్, శ్రేయస్,జడేజా కూడా రాణిస్తే కివీస్ బౌలర్లకు తిప్పలు తప్పవు. ఎలాగూ ఉండనే ఉన్నాడు. బౌలింగ్‌లో బుమ్రా,కుల్‌దీప్, జడేజా, కుల్‌దీప్ యాదవ్ ప్రత్యర్థి జట్టును కట్టడి చేస్తున్నారు. కీలక సమయంలో వికెట్లు పడగొడుతూ సిరాజ్ జట్టు విజయాల్లో తన వంతు పాత్రను పోషిస్తున్నాడు. ఇవన్ని దృష్టిలో ఉంచుకుని టీమ్ఇండియా సమష్టిగా రాణిస్తే ఇక కివీస్‌ను చిత్తు చేయడం కష్టతరమైన పనేమి కాదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
భారత జట్టు:
రోహిత్ శర్మ ( కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్, సూర్యకుమార్ యాదవ్/ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ/శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
న్యూజిలాండ్ జట్టు:
డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, విల్ యంగ్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, ఇష్ సోధీ , ట్రెంట్ బౌల్ట్.