అండర్‌-19 ప్రపంచకప్‌(ICC U19 Mens World Cup 2024)లో బంగ్లాదేశ్‌(Bangladesh)పై విజయంతో మంచి ఊపు మీదున్న యువ భారత్‌ రెండో పోరుకు సిద్ధమైంది. ఇవాళ ఐర్లాండ్‌( Ireland)తో టీమిండియా తలపడనుంది. తొలి మ్యాచ్‌లో అర్ధసెంచరీలు చేసిన కెప్టెన్‌ ఉదయ్‌ సహరన్‌, ఆదర్శ్‌ సింగ్‌ మరోసారి రాణించాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో రాణించి బ్యాటింగ్‌లో గాడిన పడాలని భారత్‌ భావిస్తోంది. కీలకమైన పోరుకు ముందు అన్ని విభాగాల్లో రాణించాలని పట్టుదలగా ఉంది.
నెమ్మదిగా స్పందించే బ్లూమ్‌ఫౌంటీన్‌ పిచ్‌పై భారత బ్యాటర్లు సహనంతో ఆడాల్సి ఉంటుంది. తొలి మ్యాచ్‌లో విఫలమైన ప్రియాంశు మోలియాపై భారత్‌ ఆశలు పెట్టుకుంది. స్పిన్నర్లు సౌమీ కుమార్‌, ముషీర్‌ఖాన్‌లను ఎదుర్కోవడం ఐర్లాండ్‌కు శక్తికి మించిన పనే కానుంది. హైదరాబాద్‌ కుర్రాళ్లు అవనీశ్‌, అభిషేక్‌ ఎలా రాణిస్తారో చూడాలి. దూకుడుగా ఆడే ఐర్లాండ్‌ను తక్కువగా అంచనా వేస్తే భారత్‌కు షాక్‌ తప్పదని మాజీలు హెచ్చరిస్తున్నారు. 


తొలి అడుగు బలంగా..
అండర్‌ 19 ప్రపంచకప్‌(U19 World Cup 2024 ) వేట ప్రారంభమైంది. ఇప్పటికీ అయిదుసార్లు జూనియర్‌ పొట్టి ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న యువ భారత్‌... ఆరోసారి ఆ కప్పును ఒడిపి పట్టే దిశగా తొలి అడుగును బలంగా వేసింది. బంగ్లాదేశ్‌(IND U19 vs BAN U19)తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించి టీమిండియా శుభారంభం చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా(Team India) 251 పరుగులు చేసింది. అనంతరం 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌( Bangladesh) కేవలం 167 పరుగులకే కుప్పకూలింది.



మ్యాచ్ సాగిందిలా...
దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్‌ 19 ప్రపంచకప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన యువ భారత్‌.. మొదటి పోరులో బంగ్లాదేశ్‌ను 84 పరుగుల తేడాతో చిత్తు చేసింది. బ్లూమ్‌ఫోంటెన్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్‌ ఆదర్ష్‌ సింగ్‌(76) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్‌ ఉదయ్‌ సహ్రన్‌(64) హాఫ్‌ సెంచరీతో రాణించాడు. బంగ్లా బౌలర్లలో మరూప్‌ మిరందా 5 వికెట్లతో చెలరేగాడు. లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్‌.. 45.5 ఓవర్లలో 167 పరుగులకే ఆలౌట్‌ అయింది. బంగ్లాదేశ్‌.. ఆరంభం నుంచే క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోయి 167 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా బౌలర్లలో సౌమీ పాండే 4 వికెట్లతో బంగ్లాదేశ్‌ పతనాన్ని శాసించగా.. ముషీర్‌ ఖాన్‌ 2 వికెట్లతో సత్తాచాటాడు. బంగ్లాదేశ్‌ బ్యాటర్లలో మహ్మద్ షిహాబ్ జేమ్స్54 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఈ మెగా టోర్నీలో టీమిండియా తమ తదుపరి మ్యాచ్‌లో జనవరి 25న బ్లోమ్‌ఫోంటెయిన్ వేదికగా ఐర్లాండ్‌తో తలపడనుంది.


భారత జట్టు: ఉదయ్‌ సహారన్‌ (కెప్టెన్‌), సౌమీ కుమార్‌ పాండే, అర్షిన్‌ కులకర్ణి, ఆదర్శ్‌ సింగ్‌, రుద్ర మయూర్‌ పటేల్‌, సచిన్‌ దాస్‌, ప్రియాంశు మోలియా, ముషీర్‌ఖాన్‌, మురుగన్‌ అభిషేక్‌, అవనీశ్‌ రావు, ఇనీశ్‌ మహాజన్‌, ధనుశ్‌ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్‌ లింబాని, నమన్‌ తివారి; స్టాండ్‌బై: ప్రేమ్‌ దేవ్‌కర్‌, అన్ష్‌ గొసాయ్‌, మహ్మద్‌ అమన్‌