India vs England 1st Test Probable XIs: సొంత గడ్డపై టెస్టు సిరీసుల్లో 12 ఏళ్లుగా ఓటమి ఎరుగని భారత్‌ జట్టు(Team India)కు సిసలైన పరీక్ష ఎదురుకానుంది. 5 టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్‌-ఇంగ్లాండ్‌(Ind v Eng) మధ్య తొలిమ్యాచ్‌ రేపు(గురువారం) హైదరాబాద్‌(Hyderabad) వేదికగా మొదలుకానుంది. బజ్‌బాల్‌ ఆటతో సుదీర్ఘ ఫార్మాట్‌లో వేగాన్ని పెంచిన ఇంగ్లాండ్‌...దశాబ్దకాలానికిపైగా సొంతగడ్డపై తిరుగులేని టీమిండియాకు సవాలు విసరనుంది. తొలి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో శుభారంభం చేయాలని... ఇరుజట్లు పట్టుదలగా ఉన్నాయి.

 

విజయంతో సిరీస్‌లో శుభారంభం చేయాలని ఇరుజట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. సొంతగడ్డపై భారత్‌ టెస్టు సిరీస్‌ ఓడి దాదాపు 11 ఏళ్లు గడిచిపోయాయి. చివరగా 2012లో ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను 1-2తో భారత్‌ కోల్పోయింది. అప్పటి నుంచి సొంతగడ్డపై భారత్‌ మరో టెస్టు సిరీస్‌ ఓడిపోలేదు. కనీసం ప్రత్యర్థికి సిరీస్‌ డ్రా చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. తొలి టెస్టు జరిగే ఉప్పల్‌ పిచ్‌ స్పిన్‌కు సహకరించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో స్పిన్నర్లే సంపూర్ణ ఆధిపత్యం చలాయించే అవకాశం ఉంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ రేసులో నిలవాలంటే ఈ సిరీస్‌ టీమ్‌ఇండియాకు ఎంతో కీలకం. దీంతో ఇప్పుడు అందరిదృష్టి ఈ సిరీస్‌పై పడింది.

 

కోహ్లీ లేకుండానే...

టెస్టుల్లో ఉప్పల్‌ వేదికలో దాదాపు 75 పైగా సగటు ఉన్న స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ లేకుండా టీమిండియా ఈ ‌మ్యాచ్‌లో బరిలోకి దిగుతోంది. వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టులకు అందుబాటులోని లేని కోహ్లీ స్థానంలోయువ ఆటగాడు రజిత్‌ పాటిదార్‌ జట్టులోకి వచ్చాడు. అతడికి తుది జట్టులో . దాదాపు అవకాశం దక్కకపోవచ్చు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో యువ ఆటగాడు యశ్వసి జైస్వాల్‌ ఓపెనింగ్‌ చేయనున్నాడు. గిల్‌ మూడో స్థానంలో రానున్నాడు. శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌ మిడిల్‌ఆర్డర్‌లో బ్యాటింగ్‌ భారాన్ని మోయనున్నారు. వికెట్‌ కీపర్‌గా ఆంధ్ర ఆటగాడు కేఎస్‌ భరత్‌కు తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ఆల్‌రౌండర్‌ జడేజా, అశ్విన్‌లు తుది జట్టులో ఉంటే అక్షర్‌ లేదా కుల్‌దీప్‌లో ఒకరు బెంచ్‌కు పరిమితం కానున్నారు. బుమ్రా, సిరాజ్‌ పేస్‌ భారాన్ని మోయనున్నారు. ఈ సిరీస్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తామని....ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌ గెలుస్తామని భావిస్తున్నట్లు కెప్టెన్ రోహిత్‌ శర్మ అన్నాడు. 

 

బజ్‌బాల్‌ పనిచేస్తుందా..?

మరోవైపు ప్రత్యర్థి ఎవరైనా....... వేదిక ఎక్కడైనా దూకుడైన బజ్‌బాల్‌ ఆటతీరుతో సాగిపోతున్న ఇంగ్లండ్‌ ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని....... పట్టుదలగా ఉంది. బెయిర్‌స్టో, క్రాలీ, డకెట్‌, ఫోక్స్‌, లారెన్స్‌, పోప్‌, రూట్‌, స్టోక్స్‌తో........బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఇంగండ్‌ సొంతం. జాక్‌ లీచ్‌ మినహా టామ్‌ హార్ట్‌లీ, షోయబ్‌ బషీర్‌, రెహాన్‌ అహ్మద్‌లతో కూడిన అనుభవలేమి స్పిన్ విభాగం ఏమేరకు రాణిస్తుందో చూడాలి. అండర్సన్‌, అట్కిన్సన్‌, రాబిన్సన్‌, మార్క్‌ వుడ్‌లతో ఇంగ్లాండ్‌ పేస్‌ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది

 

భారత్‌ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, కెఎస్ భరత్ , ధృవ్ జురెల్ , రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, అవేష్ ఖాన్.

 

ఇంగ్లాండ్ తుదిజట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్, రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జాక్ లీచ్.