ఎదుటి జట్టు ఆట గురించి కాకుండా.. తామంతా కలిసి అత్యుత్తమ ప్రదర్శనతో గెలవడంపైనే దృష్టి సారిస్తామని టీమిండియా సారథి రోహిత్ శర్మ(Rohit Sharma) స్పష్టం చేశాడు. రేపట్నుంచి ప్రారంభం కానున్న టీమిండియా-ఇంగ్లండ్ టెస్టు సిరీస్(IND vs ENG Test Series)లో భాగంగా హైదరాబాద్ లోని ఉప్పల్ మైదానం (Uppal Stadium)లో తొలి టెస్ట్ జరగనుంది. రెండ్రోజుల నుంచి జట్టు సభ్యులు ముమ్మర సాధన చేస్తున్నారు. తొలిరెండు టెస్టులకు కీలక ఆటగాడు విరాట్ కోహ్లీ అందుబాటులో లేకపోవడం జట్టుకు లోటే అని రోహిత్ శర్మ చెప్పాడు. పరిస్థితుల మేరకు అక్షర్, కుల్దీప్ లలో ఒకరిని తీసుకుంటామని.. అన్నారు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్‌ను ఓడించడానికి స్థిరంగా రాణించాల్సి ఉందని రోహిత్ తెలిపాడు.
భారత్ గత 12 ఏళ్లుగా స్వదేశంలో అజేయంగా ఉందని కానీ 2012లో అలిస్టర్ కుక్ నేతృత్వంలోని ఇంగ్లండ్ మనల్ని ఓడించింది. దీనిపై కూడా రోహిత్ స్పందించాడు. తాము ఓడిపోలేమని తాను అనుకోవడం లేదని రికార్డులను తాను పట్టించుకోనని హిట్ మ్యాన్ తెలిపాడు.
స్పెషలిస్ట్ బ్యాటర్‌గానే రాహుల్:
ఇంగ్లాండ్(England)తో టెస్ట్ సిరీస్‌లో వికెట్ కీపర్‌గా రాహుల్(Kl Rahul)ను తీసుకుంటారా లేదా స్పెషలిస్ట్ బ్యాటర్‌గానే తీసుకుంటారా అన్న అనుమానాలకు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) స్పష్టత ఇచ్చారు. ఈ టెస్ట్ సిరీస్‌లో రాహుల్ వికెట్ కీపింగ్ చేయడని ద్రవిడ్ స్పష్టం చేశాడు. రేపటి తొలి టెస్టు ఆరంభం కానున్న నేపథ్యంలో విలేకరులతో మాట్లాడిన కోచ్ రాహుల్ ద్రవిడ్.. రాహుల్ కీపింగ్‌పై స్పష్టత ఇచ్చేశాడు. ఈ సిరీస్‌లో కేఎల్ రాహుల్ కీపింగ్‌కు దూరంగా ఉంటాడని, జట్టు ఎంపిక సమయంలోనే దీనిపై తాము పూర్తి స్పష్టతతో ఉన్నామని ద్రవిడ్ వెల్లడించాడు. రాహుల్ కాకుండా మరో ఇద్దరు వికెట్ కీపర్లను జట్టుకు ఎంపిక చేశామని, అయిదు టెస్టు మ్యాచ్‌లు ఉండటం.. భారత్‌లో పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకుని రాహుల్ కాకుండా కేఎస్ భరత్, ధ్రువ్ జురెల్‌లను జట్టులోకి తీసుకున్నామని ద్రవిడ్ వెల్లడించాడు. ఇక తొలి టెస్టుకు ఆతిథ్యమిస్తున్న ఉప్పల్ స్టేడియం పిచ్ స్పిన్‌కు అనుకూలించొచ్చని ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. ఉప్పల్ పిచ్‌పై ఇప్పుడే ఒక అంచనాకు రావడం కష్టమన్న ద్రవిడ్ మ్యాచ్ ప్రారంభమైతే ఎలా స్పందిస్తుందో తెలుస్తుందన్నాడు. పిచ్ బాగుందని కొంచెం స్పిన్ తిరగొచ్చని ఎంత త్వరగా ఎంత వేగంగా అన్నది కచ్చితంగా చెప్పలేనని ద్రవిడ్ అన్నాడు. కొంతకాలంగా ఇంగ్లాండ్ బాగా ఆడుతోందని దూకుడు ఆట చూడటం ఉత్సాహంగా అనిపిస్తుందని ద్రవిడ్ అన్నాడు. కానీ భారత్‌లో పరిస్థితులు ఇంగ్లాండ్ జట్టుకు సవాలే అన్న టీమిండియా హెడ్ కోచ్... ఇక్కడి పరిస్థితులపై తమకు మంచి అవగాహన ఉందని ద్రవిడ్ తెలిపాడు.
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో టెస్టు మ్యాచ్ ఐదు రోజుల పాటు 25 వేల మంది స్కూల్ విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. తెలంగాణలో పని చేస్తున్న ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది కుటుంబాలకు రిపబ్లిక్ డే రోజున ఉచితంగా అనుమతించాలని హెచ్‌సీఏ నిర్ణయం తీసుకుంది.