ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియాకు భారీ ఆధిక్యం దక్కింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 284 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా 132 పరుగుల ఆధిక్యాన్ని దక్కించుకుంది. జానీ బెయిర్‌స్టో (106: 140 బంతుల్లో, 14 ఫోర్లు, రెండు సిక్సర్లు) ఫాంను కొనసాగిస్తూ ఈ మ్యాచ్‌లో కూడా సెంచరీ సాధించాడు. భారత బౌలర్లలో సిరాజ్‌కు నాలుగు వికెట్లు దక్కాయి.


రెండో రోజు తన మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఓపెనర్ అలెక్స్ లీస్ వికెట్‌ను త్వరగానే కోల్పోయింది. మరో ఓపెనర్ జాక్ క్రాలే (9: 17 బంతుల్లో, ఒక ఫోర్), ఓలీ పోప్ (10: 18 బంతుల్లో, రెండు ఫోర్లు) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. ఈ రెండు వికెట్లను కూడా బుమ్రానే దక్కించుకున్నాడు దీంతో ఇంగ్లండ్ 44 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.


ఈ దశలో వర్షం రావడంతో మ్యాచ్‌ను నిలిపివేసి టీ బ్రేక్‌ను ప్రకటించారు. మ్యాచ్ తిరిగి ప్రారంభం అయ్యాక జో రూట్ (31: 67 బంతుల్లో, నాలుగు ఫోర్లు), జాక్ లీచ్ (0: 5 బంతుల్లో) కూడా అవుట్ కావడంతో ఇంగ్లండ్ 83 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (25: 36 బంతుల్లో, నాలుగు ఫోర్లు) మరో వికెట్ పడకుండా రోజును ముగించారు.


84-5 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ప్రారంభించిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సాఫీగానే ప్రారంభం అయింది. కెప్టెన్ బెన్ స్టోక్స్, జానీ బెయిర్‌స్టో వికెట్ పడకుండా వేగంగా ఆడారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 66 పరుగులు జోడించిన అనంతరం శార్దూల్ ఠాకూర్ ఈ జోడిని విడగొట్టాడు. భారీ షాట్ ఆడబోయిన బెన్ స్టోక్స్ బుమ్రా చేతికి చిక్కాడు. దీంతో ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది.


ఆ తర్వాత వికెట్ కీపర్ బ్యాటర్ శామ్ బిల్లింగ్స్ (36: 57 బంతుల్లో, నాలుగు ఫోర్లు)... జానీ బెయిర్‌స్టోకు జత కలిశాడు. ఒక ఎండ్‌లో శామ్ వికెట్ కాపాడుకోవడానికి ప్రాధాన్యతను ఇవ్వగా, మరో ఎండ్‌లో జానీ బెయిర్‌స్టో చెలరేగిపోయాడు. వీరిద్దరూ వన్డే స్థాయిలో పరుగులు చేశారు. ఏడో వికెట్‌కు 92 పరుగులు జోడించారు. ఈ దశలోనే బెయిర్‌స్టో సెంచరీ కూడా పూర్తయింది.


శతకం అయ్యాక బెయిర్‌స్టో ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. షమీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి స్లిప్‌లో కోహ్లీ చేతికి చిక్కాడు. వెంటనే బ్రాడ్ (1: 5 బంతుల్లో), బిల్లింగ్స్ కూడా పెవిలియన్ బాట పట్టారు. ఆ తర్వాత పాట్స్ (19: 18 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) కాసేపు పోరాడాడు. అయితే సిరాజ్ తన వికెట్‌ను దక్కించుకోవడంతో ఇంగ్లండ్ 284 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో సిరాజ్‌కు 4, బుమ్రాకు 3 వికెట్లు దక్కాయి. షమి రెండు, శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ తీసుకున్నారు.