టీమిండియాతో జరుగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లండ్ పుంజుకుంది. మూడో రోజు లంచ్ సమయానికి ఇంగ్లండ్ ఆరు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. మూడో రోజు మొదటి సెషన్‌లో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఇంగ్లండ్ 116 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో జానీ బెయిర్‌స్టో (91 బ్యాటింగ్: 113 బంతుల్లో, 12 ఫోర్లు, రెండు సిక్సర్లు), శామ్ బిల్లింగ్స్ (7 బ్యాటింగ్: 17 బంతుల్లో, ఒక ఫోర్) ఉన్నారు.
84-5 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ప్రారంభించిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సాఫీగా ప్రారంభం అయింది. కెప్టెన్ బెన్ స్టోక్స్, జానీ బెయిర్‌స్టో వికెట్ పడకుండా వేగంగా ఆడారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 66 పరుగులు జోడించిన అనంతరం శార్దూల్ ఠాకూర్ ఈ జోడిని విడగొట్టాడు. భారీ షాట్ ఆడబోయిన బెన్ స్టోక్స్ బుమ్రా చేతికి చిక్కాడు. దీంతో ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది.
ఆ తర్వాత వికెట్ కీపర్ బ్యాటర్ శామ్ బిల్లింగ్స్... జానీ బెయిర్‌స్టోకు జత కలిశాడు. ఒక ఎండ్‌లో శామ్ వికెట్ కాపాడుకోవడానికి ప్రాధాన్యతను ఇవ్వగా, మరో ఎండ్‌లో జానీ బెయిర్‌స్టో చెలరేగిపోయాడు. వీరిద్దరూ వన్డే స్థాయిలో పరుగులు చేశారు. ఏడో వికెట్‌కు 49 బంతుల్లోనే 51 పరుగులు జోడించారు. అయితే ఈ దశలో వర్షం రావడంతో వెంటనే మ్యాచ్‌ను నిలిపివేసి లంచ్‌ను ప్రకటించారు.