India vs England Ranchi ENG 4th Test: రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియా ఎదురీదుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 353 పరుగులకు ఆలౌట్ కాగా... భారత జట్టు 219 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. యశస్వి జైస్వాల్... ధ్రువ్ జురెల్, కుల్‌దీప్ యాదవ్ నిలబడకపోతే భారత్ పరిస్థితి మరింత ఘోరంగా ఉండేది. ఓవర్ నైట్ స్కోరు ఏడు వికెట్ల నష్టానికి 302 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ 353 పరుగులకు ఆలౌట్ అయింది. జో రూట్ 122 పరుగులతో అజేయంగా నిలిచాడు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు...ఆదిలోనే షాక్ తగిలింది. 4 పరుగుల వద్ద రోహిత్ పెవిలియన్ చేరాడు. జైస్వాల్ 73 పరుగులతో రాణించగా.. గిల్ 38, రజత్ పాటిదార్ 17, రవీంద్ర జడేజా 12, సర్ఫరాజ్ ఖాన్ 14, అశ్విన్ ఒక పరుగు చేసి పెవిలియన్‌కు చేరారు. దీంతో 177 పరుగులకే భారత్ ఏడు వికెట్లు కోల్పోయింది. టీమిండియా 200లోపే ఆలౌట్ అవుతుందని అంతా భావించినా కుల్‌దీప్ యాదవ్, ధ్రువ్ జురెల్ నిలబడ్డారు. వీరిద్దరూ 42 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ మరో వికెట్ పడకుండా 219 పరుగులు చేయగలిగింది. ప్రస్తుతం.. ఇంగ్లండ్ కంటే భారత్ ఇంకా 134 పరుగుల వెనుకంజలో ఉంది..
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్
రాంచీలో జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 353 పరుగులకు ఆలౌట్ అయింది. జో రూట్ 122 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఓ వైపు రూట్ అడ్డుగోడలా నిల్చినా... అవతలి వైపు వికెట్లన్నీ నేలకూలాయి. ఏడు వికెట్ల నష్టానికి 302 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ ... మరో 51 పరుగులు జోడించి ఆలౌట్ అయింది. దూకుడుగా బ్యాటింగ్ చేసిన రాబిన్సన్ టెస్టుల్లో తొలి అర్ధ శతకం సాధించాడు. మరోవైపు రూట్ బజ్ బాల్ ఆటకు స్వస్తి పలికి ఆచితూచి బ్యాటింగ్ చేశాడు. రూట్ -రాబిన్సన్ కలిసి ఎనిమిదో వికెట్ కు 100 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఈ భాగస్వామ్యాన్ని జడేజా విడదీశాడు. ఒకే ఓవర్లో జడేజా రెండు వికెట్లు తీశాడు. తొలుత రాబిన్సన్ ను అవుట్ చేసిన జడేజా.. అదే ఓవర్ లో బషీర్ ను ఔట్ చేశాడు. భారత బౌలర్లలో జడేజా 4, ఆకాశ్ 3, సిరాజ్ 2 వికెట్లు తీయగా అశ్విన్ కు ఒక వికెట్ దక్కింది.
యశస్వీ మరో రికార్డ్
ఈ టెస్ట్ సిరీస్‌లో వరుస డబుల్ సెంచరీలతో అదరగొట్టిన యువ సంచలనం యశస్వి జైస్వాల్ మరో అరుదైన రికార్డ్ సాధించాడు. ఒకే సిరీస్‌లో 600లకు పైగా పరుగులతో అదరగొట్టి ఈ ఘనతను అందుకున్న ఐదో భారత ఆటగాడిగా నిలిచాడు.
గతేడాది వెస్టిండీస్ పర్యటనతో టెస్టుల్లో అరంగేట్రం చేసిన యశస్వి ఈ సిరీస్‌లో రెండు ద్విశతకాలు నమోదు చేశాడు. కేవలం ఏడు ఇన్నింగ్స్‌ల్లోనే 618 పరుగులు చేశాడు. తొలి టెస్టులో 80, 15; రెండో టెస్టులో 209, 17; మూడో టెస్టులో 10, 214; నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 73 సాధించాడు.