India vs England 1st Test: భారత జట్టు వైస్ కెప్టెన్, వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ టెస్ట్ క్రికెట్‌లో మరో రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లాండ్‌తో లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో జరుగుతున్న మొదటి టెస్ట్ మూడవ రోజున, పంత్ ఓలీ పోప్ క్యాచ్ పట్టుకున్న వెంటనే ఒక ప్రత్యేక క్లబ్‌లో చేరాడు. పోప్ క్యాచ్ పట్టుకున్న వెంటనే పంత్ తన టెస్ట్ కెరీర్‌లో 150వ క్యాచ్ పూర్తి చేశాడు.
ఇప్పుడు రిషబ్ పంత్ భారతదేశం తరపున టెస్ట్ క్రికెట్‌లో 150 క్యాచ్‌లు పూర్తి చేసిన మూడో వికెట్ కీపర్ అయ్యాడు. అతని కంటే ముందు, మాజీ దిగ్గజ ఆటగాడు MS ధోని, సయ్యద్ కిర్మాణి ఈ ఘనత సాధించారు. ఈ క్యాచ్‌తో, పంత్ భారతదేశం తరపున వికెట్ కీపర్‌గా మొత్తం 151 క్యాచ్‌లు, 15 స్టంపింగ్‌లతో సహా 166 మంది బ్యాట్స్‌మెన్‌లను అవుట్ చేశాడు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో అద్భుతమైన రికార్డు
మూడో రోజున ఇంగ్లాండ్ జట్టు తమ ఇన్నింగ్స్‌ను 209/3 తొ మొదలు పెట్టింది. ఇంగ్లీష్ జట్టు తరపున, వారి బ్యాట్స్‌మన్ ఓలీ పోప్, హ్యారీ బ్రూక్ క్రీజులో ఉంటూ భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ ఓలీ పోప్‌కు ఆఫ్ స్టంప్ వెలుపల వైడ్ బంతిని విసిరిన వెంటనే, పోప్ దానిపై కట్ షాట్ ఆడాడు. అంతే బంతి ఓలీ బ్యాట్ అంచున తగిలి నేరుగా రిషబ్ పంత్ చేతుల్లోకి వెళ్లింది. పోప్ 137 బంతుల్లో 14 ఫోర్ల సహాయంతో 106 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
ఈ వికెట్‌తో, రిషబ్ పంత్ టెస్ట్ క్రికెట్‌లో 150 క్యాచ్‌లు పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించిన భారతదేశం తరపున మూడో వికెట్ కీపర్‌గా నిలిచాడు.
వికెట్ కీపింగ్‌తో పాటు బ్యాట్‌తో కూడా అద్భుతమైన ఇన్నింగ్స్
ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ బ్యాట్‌తో కూడా అద్భుత ప్రదర్శన చేశాడు. అతను కేవలం 178 బంతుల్లో 134 పరుగులు చేశాడు, ఇందులో 12 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. ఇది అతని టెస్ట్ కెరీర్‌లో ఏడో సెంచరీ. పంత్ ఇప్పుడు భారతదేశం తరపున టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన వికెట్ కీపర్ కూడా అయ్యాడు. పంత్ తన ఇన్నింగ్స్‌లో మరో రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ అద్భుతమైన సెంచరీ కారణంగా, పంత్ టెస్ట్ క్రికెట్‌లో ఆసియాలో అత్యంత వేగంగా 3000 పరుగులు చేసిన వికెట్ కీపర్‌గా నిలిచాడు. రిషబ్ పంత్ కేవలం 40 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి ఈ ఘనత సాధించాడు.
భారతదేశం టాప్-3 టెస్ట్ వికెట్ కీపర్లు (క్యాచ్‌ల ఆధారంగా)
1. MS ధోని - 90 టెస్ట్‌లు, 256 క్యాచ్‌లు, 38 స్టంపింగ్‌లు
2. సయ్యద్ కిర్మాని - 88 టెస్ట్‌లు, 160 క్యాచ్‌లు, 38
3. రిషబ్ పంత్ - 40 టెస్ట్‌లు, 151 క్యాచ్‌లు, 15 స్టంపింగ్‌లు
భారత్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంలో ఉంది
3వ రోజు వర్షం కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఆట త్వరగా ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లకు 90 పరుగులు చేసి, ఇంగ్లాండ్‌పై 96 పరుగుల ఆధిక్యంలో ఉంది. కెఎల్ రాహుల్ 47 పరుగులతో కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ 6 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు టాస్ గెలిచి ఇండియాకు బ్యాటింగ్ అవకాశాన్ని ఇచ్చింది. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగుల స్కోరు చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్, శుభ్‌మాన్ గిల్, రిషబ్ పంత్ సెంచరీలు చేశారు. దీనికి సమాధానంగా, ఇంగ్లాండ్ జట్టు 465 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓల్లీ పోప్ అద్భుతమైన సెంచరీ సాధించగా, హ్యారీ బ్రూక్ 99 పరుగులు చేశాడు.
భారత జట్టు బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మరోసారి 5 వికెట్లు పడగొట్టాడు. ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్లు పడగొట్టగా, మొహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు తీసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో 6 పరుగుల ఆధిక్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్, యశస్వి జైస్వాల్‌ను కేవలం 4 పరుగులకే బ్రైడాన్ కార్సే చేతిలో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్ రెండో వికెట్‌కు 66 పరుగులు జోడించి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. బెన్ స్టోక్స్ సుదర్శన్‌ను 30 పరుగుల వద్ద అవుట్ చేయడంతో ఈ భాగస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేశాడు.అర్ధ సెంచరీకి చేరువలో ఉన్న కెఎల్ రాహుల్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి 4వ రోజు ఆధిక్యాన్ని నిర్మించాలని చూస్తున్నాడు.