IND vs ENG,  ENG 218 all out:  ఇంగ్లాండ్‌(England)తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత(India) స్పిన్నర్లు విజృంభించారు. కుల్‌దీప్‌ యాదవ్‌ (5/72), అశ్విన్‌ (4/51) తమ స్పిన్‌ మాయజాలంతో పర్యటక జట్టు బ్యాటర్లకు చుక్కలు చూపించారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 218 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ జాక్‌ క్రాలే (79; 108 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌) మినహా మిగతా బ్యాటర్లు ప్రభావం చూపలేకపోయారు.

 

ఆరంభంలో బాగా ఆడినా

భారత్‌తో జరుగుతున్న అయిదో టెస్ట్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌ ఆరంభంలో సాధికారికంగా బ్యాటింగ్‌ చేసింది. తొలి రోజు లంచ్‌ బ్రేక్‌ సమయానికి రెండు వికెట్ల నష్టానికి సరిగ్గా 100 పరుగులు చేసింది. ఆరంభంలో బజ్‌ బాల్‌ను పక్కన పెట్టిన ఇంగ్లాండ్‌.. ఆచితూచి బ్యాటింగ్‌ చేసింది. ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు దూకుడు తగ్గించారు. సిరాజ్‌, బుమ్రా అద్భుతమైన బంతులతో పరుగులను కట్టడి చేస్తున్నారు. ఇంగ్లాండ్‌ ఓపెనర్లు తొలి 5 ఓవర్లకు 23 పరుగులు చేశారు. పది ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 35 పరుగులు చేశారు. ఇంగ్లాండ్‌ ఓపెనర్లు హాఫ్‌ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తున్నా ఆచితూచి పరుగులు రాబడుతున్నారు. 12వ ఓవర్లో సిరాజ్‌ వేసిన బంతి క్రాలే ప్యాడ్స్‌ను తాకగా అంపైర్‌ నాటౌట్‌ ఇచ్చాడు. భారత్ రివ్యూ కోరినా అనుకూల ఫలితం రాలేదు. 15 ఓవర్లలో ఇంగ్లాండ్‌ వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసింది. నిలకడగా ఆడుతున్న బెన్‌ డకెట్‌ 18వ ఓవర్లో కుల్‌దీప్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. గిల్‌ అద్భుతమైన క్యాచ్‌తో డకెట్‌ వెనుదిరిగాడు. 27 పరుగులు చేసిన డకెట్‌  ఇచ్చిన క్యాచ్‌ను శుభ్‌మన్‌ గిల్‌ అద్భుతంగా ఒడిసిపట్టాడు. తొలి రోజు ఆటలో లంచ్‌ బ్రేక్‌ ముందు చివరి ఓవర్లో భారత్‌కు రెండో వికెట్‌ దక్కింది. 26వ ఓవర్లో ఒలీ పోప్‌ 11 పరుగులు చేసి కుల్‌దీప్‌ వేసిన బంతికి స్టంప్‌ ఔట్‌గా వెనుతిరిగాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా క్రాలే 61 పరుగులతో క్రీజులో  ఉన్నాడు. భారత్‌ తీసిన రెండు వికెట్లు కుల్‌దీప్‌ యాదవ్‌కే దక్కాయి.

 

కుల్‌దీప్‌, అశ్విన్‌ ఉచ్చులో చిక్కి...

కుల్‌దీప్‌ యాదవ్‌ (5/72), అశ్విన్‌ (4/51) తమ స్పిన్‌ మాయజాలంతో పర్యటక జట్టు బ్యాటర్లకు చుక్కలు చూపించారు. వరుసగా వికెట్లు తీసి బ్రిటీష్‌ జట్టును కుప్పకూల్చారు. తొలి రోజు టీ బ్రేక్‌.. ఇంగ్లాండ్‌ 194/8స్థితిలో ఉన్నా ఇంగ్లాండ్‌ ఆ తర్వాత మిగిలిన రెండు వికెట్లు కోల్పోయింది. 

 

యశస్వీ జోరు మాములుగా లేదుగా..

టీమిండియా యువ సంచలనం, ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌లో పరుగుల వరద పారిస్తున్న యశస్వీ జైస్వాల్‌... ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో సత్తా చాటాడు. ఐసీసీ తాజాగా విడుద‌ల చేసిన టెస్టు బ్యాట‌ర్ల ర్యాంకింగ్స్‌లో య‌శ‌స్వి టాప్‌-10లోకి దూసుకొచ్చాడు. రెండు స్థానాలు మెరుగుప‌ర‌చుకుని పదో స్థానంలో నిలిచాడు. అటు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ సైతం రెండు స్థానాలు మెరుగుప‌ర‌చుకుని 11వ స్థానానికి చేరుకున్నాడు.  ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడ‌నప్పటికీ  విరాట్ కోహ్లి టాప్‌-10లోనే కొన‌సాగుతున్నాడు. 744 రేటింగ్ పాయింట్ల‌తో ఎనిమిదిలో స్థానంలో ఉన్నాడు. ఎప్పటిలాగానే న్యూజిలాండ్ స్టార్ బ్యాట‌ర్ కేన్ విలియ‌మ్సన్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ త‌రువాత వ‌రుస‌గా జో రూట్‌, స్టీవ్ స్మిత్‌, డారిల్ మిచెల్‌, బాబ‌ర్ ఆజామ్‌లు వ‌రుస‌గా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.  కేన్ విలియ‌మ్సన్  870 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... 799 రేటింగ్‌ పాయింట్లతో జో రూట్ రెండో స్థానంలో ఉన్నాడు.  స్టీవ్ స్మిత్  789 రేటింగ్‌ పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.