మాంచెస్టర్: టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ఓపెనర్ కెఎల్ రాహుల్ నాల్గవ టెస్ట్ నాల్గో రోజున 174 పరుగుల భాగస్వామ్యంతో జట్టును కష్టాల నుండి గట్టెక్కించారు. అసలే 311 పరుగుల ఆధిక్యంలో ఉన్న ఇంగ్లాండ్ మొదటి ఓవర్లోనే భారత్ ఓపెనర్ జైస్వాల్ తో పాటు వన్ డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ వికెట్లు పడగొట్టింది. ఆ తరువాత రాహుల్, గిల్ తమ బ్యాటింగ్ తో గత 55 సంవత్సరాలలో అరుదైన ఘనత సాధించారు.
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో కెఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ 500 కంటే ఎక్కువ పరుగులు చేశారు. 55 సంవత్సరాల తర్వాత విదేశీ గడ్డపై ఒక టెస్ట్ సిరీస్‌లో ఇద్దరు భారత బ్యాటర్లు 500 కంటే ఎక్కువ పరుగులు చేయడం ఇదే మొదటిసారి. సునీల్ గవాస్కర్, దిలీప్ సర్దేశాయ్ 1970-71లో చివరిసారిగా ఈ ఘనత సాధించారు.
మొదటి ఇన్నింగ్స్‌లో 311 పరుగుల వెనుకబడిన టీమిండియా రెండవ ఇన్నింగ్స్‌లో చాలా పేలవంగా ప్రారంభించింది. తొలి ఓవర్లోనే ఇంగ్లాండ్ బౌలర్ క్రిస్ వోక్స్ డబుల్ షాకిచ్చాడు. క్రిస్ వోక్స్ మొదటి ఓవర్ నాల్గవ బంతికి యశస్వి జైస్వాల్ (0)ను, ఐదవ బంతికి సాయి సుదర్శన్ (0)ను ఔట్ చేశాడు. కానీ ఆ తర్వాత నాలుగో రోజు ఆట ముగిసే వరకు రాహుల్, గిల్ మరో వికెట్ పడకుండా చూసుకుంటేనే పరుగులు రాబట్టారు.
కెఎల్ రాహుల్ 210 బంతులు ఎదుర్కొని 87 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. భారత కెప్టెన్ గిల్ 167 బంతులు ఎదుర్కొని 78 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. నాల్గో టెస్ట్ చివరి రోజు ఆటలో వీరు సెంచరీలను పూర్తి చేయవచ్చు. భారత్ ఇప్పుడు ఈ మ్యాచ్ గెలవకపోవచ్చు, కానీ ఓటమి నుంచి తప్పించుకోవడానికి బెస్ట్ బ్యాటింగ్ చేయాలి. దాంతో నాల్గో టెస్టును డ్రాగా ముగించవచ్చు.
కేఎల్ రాహుల్ అరుదైన ఘనత
ఇంగ్లాండ్‌లో ఒక టెస్ట్ సిరీస్‌లో 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన కెఎల్ రాహుల్ భారత్ తరపున ఈ ఘనత సాధించిన రెండవ ఓపెనర్ అయ్యాడు. గతంలో సునీల్ గవాస్కర్ ఈ ఘనత సాధించాడు. రాహుల్ ఈ సిరీస్‌లో తన 3వ సెంచరీ దిశగా వెళ్తున్నాడు. అతను మొదటి టెస్ట్ రెండవ ఇన్నింగ్స్‌లో, మూడవ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేశాడు. సిరీస్ లో రాహుల్ ఇప్పటివరకు 508 పరుగులు చేశాడు.
ఒక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారతీయ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ 46 సంవత్సరాల నాటి రికార్డును బద్దలు కొట్టడానికి దగ్గరగా ఉన్నాడు. గిల్ ప్రస్తుతానికి 697 పరుగులు చేశాడు, ఈ జాబితాలో సునీల్ గవాస్కర్ మొదటి స్థానంలో ఉన్నాడు. గవాస్కర్ 1978లో 732 పరుగులు చేశాడు. గిల్ తన ఇన్నింగ్స్‌లో మరో 36 పరుగులు జోడిస్తే 47 సంవత్సరాల నాటి గవాస్కర్ రికార్డును బద్దలు కొట్టవచ్చు.
టెస్ట్‌లో 3వ వికెట్‌కు అతిపెద్ద భాగస్వామ్యం
రాహుల్, గిల్ ఈరోజు మూడవ వికెట్‌కు అతిపెద్ద భాగస్వామ్యం విషయంలో సచిన్, సౌరవ్ గంగూలీలను అధిగమించే అవకాశం ఉంది. 3వ వికెట్‌కు అతిపెద్ద భాగస్వామ్యం చేసిన భారత జోడీ సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, వీరు 2004లో 336 పరుగులు చేశారు. ఈ జాబితాలో ఐదవ స్థానంలో టెండూల్కర్, గంగూలీ ఉన్నారు, వీరు 1996లో 255 పరుగులు జోడించారు. గిల్, రాహుల్ ఆట తీరును చూస్తుంటే, ఈరోజు సచిన్, గంగూలీ రికార్డులను అధిగమించే అవకాశం ఉంది.