Cricketer Caps History: క్రికెటర్లకు క్యాప్ ఎండ నుండి కాపాడే ఓ సాధారణ క్యాప్ కాదు. క్రికెటర్లు పెట్టుకునే క్యాప్ ఆ ఆటగాడికి ఇచ్చే గౌరవం. దానికో నంబర్ ఉంటుంది. అది ఆ ఆటగాడి అరంగేట్రానికి ఇచ్చే ఘనత, గొప్ప స్వాగతం. ఆ క్యాప్‌కు ఇచ్చే నెంబర్ జట్టులో అతని స్థానాన్ని, ఎంతో మంది లెజెండరీ క్రికెటర్ల వారసుడిగా జట్టులోకి రావడాన్ని సూచిస్తుంది. అసలు క్యాప్‌కు నెంబర్లు ఎవరు ఇస్తారు? ఎలా ఇస్తారు? ఈ సంప్రదాయ చరిత్ర ఏంటో పూర్తి కథనం చదివి తెలుసుకోండి.
క్రికెట్ సంప్రదాయాల్లో భాగంగా పుట్టిందే క్రికెటర్ క్యాప్స్‌కు నంబరింగ్.
క్రికెటర్లు గ్రౌండ్‌లో ధరించే క్యాప్‌లకు నంబర్లు ఇవ్వడం అనేది ఇంటర్నేషనల్ క్రికెట్ పుట్టుకతోనే స్టార్ట్ అయిందని చెప్పాలి. 1877లో ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ జరిగింది. ఈ టెస్ట్ క్రికెట్ మ్యాచ్‌లోనే ఈ సంప్రదాయం పురుడుపోసుకుంది. ఒక దేశం తరపున జట్టులో చేరే ప్రతీ క్రికెటర్‌ను, అతని అరంగేట్రాన్ని గౌరవించాలన్న ఆలోచనతోనే ఈ సంప్రదాయం ప్రారంభం అయింది. తను ధరించే క్యాప్ నెంబర్ ఆ జట్టులో అతని స్థానాన్ని సూచిస్తుంది. అతనికి ఇచ్చిన నంబర్ మరో ఆటగాడికి ఇవ్వడం ఉండదు. అంటే జీవితకాలం అతను ఆడిన జట్టులో అతని నంబర్, అతని స్థానాన్ని, అతని సేవలను గుర్తు చేస్తూ ఉంటుంది.
భారత టెస్ట్ క్రికెట్‌లో తొలి క్యాప్ ఎవరు అందుకున్నారో తెలుసా?
క్రికెట్‌లో భారత్ కూడా టెస్ట్, వన్డే, టీ20 ఫార్మాట్‌లలో క్రికెట్ ప్రయాణం ఆరంభించింది. 1932లో ఇండియా తన తొలి టెస్ట్‌ను ఇంగ్లండ్‌తో ఆడింది. ఈ టెస్ట్ మ్యాచ్‌కు సి. కే నాయుడు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఈ జట్టులో తొలి క్యాప్ అందుకున్నది మాత్రం అమర్ సింగ్. ఇతను ఇండియన్ తొలి ఫాస్ట్ బౌలర్‌గా పేరుపొందారు. కేవలం బౌలర్‌గానే కాదు, దూకుడైన బ్యాట్స్‌మెన్‌గా పేరుంది. ఇక వన్డే క్రికెట్ విషయానికి వస్తే మన దేశం 1974లో తొలి వన్డేను అజిత్ వాడేకర్ నాయకత్వంలో ఆడింది. ఇంగ్లండ్‌లోని హెడింగ్లే మైదానంలో ఈ మ్యాచ్ జరిగింది. ఇందులో తొలి వన్డే క్యాప్ దక్కించుకుంది మాత్రం సుధీర్ నాయక్. ఇతను రైట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్, దేశీయ క్రికెట్‌లో అతను ముంబై జట్టు కెప్టెన్ కూడా. ఇక టీ20 క్రికెట్‌లో కూడా నంబర్ల విధానం ప్రారంభం అయింది. తొలి టీ20 మ్యాచ్‌ను 2006లో దక్షిణాఫ్రికాతో ఆడింది. ఇందులో తొలి టీ20 క్యాప్‌ను అజిత్ అగార్కర్ దక్కించుకున్నారు.
ప్రముఖ క్రికెటర్ల టెస్ట్ క్యాప్ నంబర్లు ఇవే:
అమర్ సింగ్: 1
సునీల్ గవాస్కర్: 129
కపిల్ దేవ్: 155
సచిన్ టెండూల్కర్: 187
రాహుల్ ద్రావిడ్: 207
ఎం.ఎస్. ధోని: 251
విరాట్ కోహ్లి: 269
రోహిత్ శర్మ: 280
చివరిగా అందుకున్నది (అన్షుల్ కంబోజ్): 318
ప్రముఖ వన్డే క్రికెటర్ల క్యాప్ నంబర్లు ఇవే:
సుధీర్ నాయక్: 1
సునీల్ గవాస్కర్: 4
కపిల్ దేవ్: 25
సౌరవ్ గంగూలీ: 84
రాహుల్ ద్రావిడ్: 86
సచిన్ టెండూల్కర్: 74
ఎం.ఎస్. ధోని: 159
రోహిత్ శర్మ: 168
విరాట్ కోహ్లి: 175
చివరిగా అందుకున్నది (తిలక్ వర్మ): 261
టీ20 స్టార్ క్రికెటర్ల క్యాప్ నంబర్స్:
సచిన్ టెండూల్కర్: 11
వీరేంద్ర సెహ్వాగ్: 34
రోహిత్ శర్మ: 35
ఎం.ఎస్. ధోని: 36
యువరాజ్ సింగ్: 38
విరాట్ కోహ్లి: 44
చివరి టీ20 క్రికెట్ క్యాప్ అందుకున్నది అభిషేక్ శర్మ: 125
అయితే క్యాప్స్‌తో పాటు ఆటగాళ్లు ధరించే జెర్సీలకు నంబర్ ఉంటుంది. అయితే ఈ జెర్సీ నంబర్‌ను ఆటగాడు తన ఇష్టాన్ని, పుట్టిన తేదీ, అదృష్ట సంఖ్య ఆధారంగా ఎంచుకోవచ్చు. కానీ క్యాప్ నెంబర్ మాత్రం అలా కాదు. ఏ దేశ జట్టుకు ఆడితే, ఆ క్రికెట్ బోర్డు క్రమ పద్ధతిలో ఆ సంఖ్యను ఇస్తుంది. ఆ సంఖ్య మరో ఆటగాడికి ఇవ్వడం అనేది జరగదు. ఇలా క్రికెట్ ఆడే దేశాలలోని క్రికెట్ బోర్డులు తమ ఆటగాళ్ల క్యాప్స్‌కు నంబర్స్ ఇస్తూ, వారి అరంగేట్రాన్ని గౌరవించడం క్రికెట్ సంప్రదాయంగా మారింది.