Manchestar Test Latest Live Updates: ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగోటెస్టులో డ్రా కోసం భారత్ పోరాడుతోంది. శుభమాన్ గిల్ (167 బంతుల్లో 78 బ్యాటింగ్, 10 ఫోర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్, కేఎల్ రాహుల్ క్లాసీ ఇన్నింగ్స్ (210 బంతుల్లో 87 బ్యాటింగ్, 8 ఫోర్లు) లతో సత్తా చాటడంతో శనివారం నాలుగోరోజు ఆటముగిసేసరికి భారత్ 63 ఓవర్లలో 2 వికెట్లకు 174 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఓటమిని తప్పించుకోవాలంటే భారత్ ఇంకా 137 పరుగులు చేయాలి. అంతకుముందు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 669 పరుగులకు ఆలౌటైంది. దీంతో 311 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది. జో రూట్ (150), ఇంగ్లాండ్ బెన్ స్టోక్స్ (141) సెంచరీలతో రాణించారు. రవీంద్ర జడేజాకు నాలుగు వికెట్లు దక్కాయి.
అద్భుత పోరాటం..నాలుగో రోజు ఆటలో రాహుల్-గిల్ భాగస్వామ్యామే హైలెట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. లంచ్ విరామానికి ముందు కేవలం మూడు ఓవర్లు ముంగిట ఇండియా ఇన్నింగ్స్ ప్రారంభం కాగా, భారత్ కు క్రిస్ వోక్స్ డబుల్ షాకిచ్చాడు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ , సాయి సుదర్శన్ లను డకౌట్ చేసి, షాకిచ్చాడు. దీంతో పరుగులేమీ చేయకుండానే టీమిండియా రెండు వికెట్లను కోల్పోయింది. ఇక హ్యాట్రిక్ బంతిని ఎదుర్కొనేందుకు బ్యాటింగ్ కు దిగిన గిల్.. ఆ బంతిని చక్కగా ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి, ఇంగ్లీష్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. ఆరంభంలో వికెట్ ను కాపాడుకోడానికి ప్రాధన్యతనిచ్చిన ఈ ఇద్దరు ఆ తర్వాత నెమ్మదిగా బ్యాట్ ఝళిపించారు. మరో ఎండ్ లో గిల్ మాత్రం కాస్త వేగంగా ఆడారు. దీంతో టీ విరామ వరకు వికెట్ పడకుండా సెషన్ ను ముగించారు.
ఇరువురు అర్ధ సెంచరీలు..టీ విరామం తర్వాత సెట్ కావడంతో గిల్, రాహుల్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. తొలుత గిల్ అర్ధ సెంచరీ చేయగా, ఆ తర్వాత రాహుల్ ఫిఫ్టీని కంప్లీట్ చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా వీరిద్దరూ సాధికారంగా బ్యాటింగ్ చేయడంతో ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఫ్రస్ట్రేషన్ కు గురయ్యారు. ఈ క్రమంలో సెంచరీ, ఆ తర్వాత 150 పరుగులకుపైగా పార్ట్ నర్ షిప్ ను నమోదు చేసి, అదే జోరులో మరో వికెట్ పడకుండా రోజును ముగించారు. ఆదివారం ఆటకు చివరి రోజు కావడంతో వీలైనంత వరకు బ్యాటింగ్ చేసి, మ్యాచ్ ను డ్రా చేసుకోవాలని టీమిండియా కృత నిశ్చయంగా ఉంది. ఇంగ్లీష్ బౌలర్లలో క్రిస్ వోక్స్ కు రెండు వికెట్లు దక్కాయి. ఇక తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 358 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.